పదవి రాకపోతే రాజకీయం వదిలేస్తా..
► ఆసుపత్రి కమిటీ చైర్మన్‌గా మా సుధీరే ప్రమాణం చేస్తాడు
► ఎమ్మెల్సీ పీఆర్‌కు మంత్రి ఆది పరోక్ష చాలెంజ్
► జమ్మలమడుగు అధికారపార్టీలో ఆసుపత్రి చైర్మన్ పదవి చిచ్చు
► ఎవరికి వారే పట్టుకోసం తీవ్ర పోరు
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఏది ఏమైనా మా సుధీరే ఆస్పత్రి కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అవసరమైతే నేను రాజకీయమైనా వదులుకుంటా’ మంత్రి ఆదినారాయణరెడ్డి మంగళవారం జమ్మలమడుగు ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో తన మనసులోని ఆగ్రహాన్ని ఇలా బయటపెట్టారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా తన కుమారుడు సుధీర్‌రెడ్డిని ప్రమాణా స్వీకారం చివరి నిమిషంలో వాయిదాపడటంపై మనసులోనే రగిలిపోతున్న ఆదినారాయణరెడ్డి అదే ఆసుపత్రి వేదికగా జరిగిన కార్యక్రమంలో తన ప్రత్యర్థి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి పరోక్షంగా ఈ చాలెంజ్ విసిరారు. ఆదేవిధంగా పట్టణంలోని వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రికి చైర్మన్‌గా తన కుమారుడు సుధీర్‌రెడ్డి ఈనెల ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. తాను పట్టుబట్టిన పనిని ఖచ్చితంగా జరిగే విధంగా చూస్తానని, తన పని జరుగకపోతే రాజకీయాల నుంచి అయిన తప్పుకుంటానని పరోక్షంగా ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు.
తీవ్రమైన ఆధిపత్యపోరు
జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిని టీడీపీలో చేర్చుకునే ప్రతిపాదనను మాజీమంత్రి రామసుబ్బారెడ్డి గట్టిగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఆయన్ను తీసుకుంటే పార్టీ కూడా వదిలి వెళ్లేందుకు వెనుకాడబోమని కూడా ఆయన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పరోక్షంగా సంకేతాలు పంపారు. ఆ తర్వాత ఆదిని మంత్రిని చేయాలనుకున్నప్పుడు ససేమిరా అంగీకరించలేదు. పీఆర్‌కు ఎమ్మెల్సీ పదవి ఎరవేసి చంద్రబాబు ఒప్పించారు. అక్కడి నుంచి జమ్మలమడుగు టీడీపీలో ఆధిపత్య పోరు తీవ్రమైంది. మంత్రి ఆది, మాజీమంత్రి పీఆర్ మధ్య ఏ మాత్రం సఖ్యత కుదరకపోగా రెండు వర్గాలు ఒకరినొకరు దెబ్బ తీసుకోవడానికి ఎత్తులు పైఎత్తులు వేస్తూ వచ్చాయి.
ఇదే సందర్భంలో పీఆర్ వద్దనుకుని పంపిన మున్సిపల్ కమిషనర్‌ను మంత్రి వెనక్కుతేవడం, తన తమ్ముడు గిరిధర్‌రెడ్డి పేరు ఆసుపత్రి కమిటీ చైర్మన్ పదవికి ప్రతి పాదిస్తే మంత్రి దాన్ని పక్కకు తోసేసి తన కుమారుడు సుధీర్‌ను చైర్మన్ చేసుకోవడం పీఆర్ జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిణామాలన్నింటి మీద నేరుగా సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం మీద ఒత్తిడి తెచ్చి సుధీర్‌రెడ్డి పదవీ ప్రమాణా స్వీకారాన్ని చివరి నిమిషంలో నిలుపుదల చేయించారు. ఆ పదవి తన తమ్ముడు గిరిధర్‌రెడ్డికి ఇప్పించాలని పీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
రగలిపోతున్న మంత్రి ఆది
తనకు ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి తీసుకుని చేతిలో అధికా రం పెట్టుకుని పీఆర్ మంత్రి మీద పోరాటం చేసే వ్యూహం అమలు చేశారు. దీంతో తాను మంత్రిగా ఉండి కొడుక్కు చిన్న పదవి కూడా ఇప్పించుకోలేకపోవడాన్ని ఆదినారాయణరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆసుపత్రి సలహా మండ లి చైర్మన్ పదవి తన కుమారుడికే కావాలని ఆయన కూడా పట్టుబట్టారు. ఈ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం కమిటీ నియామకాన్నే పక్కన పెట్టేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి ఆది మంగళవారం అదే ఆసుపత్రి వేదికగా తన సత్తా ఏమిటో చూపిస్తానని గట్టిగా చెప్పారు. తన కుమారుడు ఆసుపత్రి కమిటీ చైర్మన్‌గా ప్రమాణా స్వీకారం చేయకపోతే రాజకీయం కూడా వదులుకుంటానని చెబుతూ చేతనైతే నిలుపుదల చేయిం చాలని పరోక్షంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి సవాల్ విసిరారు. ఈ పరిణామంతో జమ్మలమడుగు తెలుగుదేశం రాజకీయం మరోసారి వేడెక్కబోతోంది.