
‘చిత్తశుద్ధి ఉంటే దీక్షలో కూర్చోండి’
హైదరాబాద్: పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టే దీక్షలో కూర్చోవాలని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి సూచించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన రేపు విజయమ్మ చేపట్టబోయే దీక్షను ఉద్దేశించి మాట్లాడారు. ‘మా నాయకురాలు చిత్తశుద్దితో దీక్షకు పూనుకున్నారని, మిగతా పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే దీక్షలో కూర్చోవాలని’ మైసూరా తెలిపారు.
రాష్ట్ర విభజనకు అంశంపై నాయకులు స్పందిస్తే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎందుకు దిగిరాదో చూద్దామని సవాల్ విసిరారు. ముప్పైకు పైగా సీట్లను ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సోనియా విభజించాలని చూస్తోందన్నారు. కేవలం 10 సీట్లు కోసమే విభజన చేస్తున్నామని తెలుగు ప్రజలను అడుక్కుంటే.. ఆ సీట్లను తెలుగు ప్రజలు ఇచ్చే వారని మైసూరా విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రూ.4లక్షల కోట్లు ఇవ్వాలంటూ చెబుతున్నారని, మిగులు జలాల గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.