'మోడీ ప్రధాని అయితే విజయవాడే రాజధాని'
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని అయితే విజయవాడను స్మార్ట్ సిటీగా చేస్తారని.. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కూడా అవుతుందనే ఆశాభావాన్ని మాజీ మంత్రి, బీజేపీ నేత యర్నేని సీతాదేవి వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఉన్న భద్రాచలం డివిజన్ ను ఆంధ్రప్రదేశ్ లో కలుపాలని సీతాదేవి డిమాండ్ చేశారు. ఈ డివిజన్ లోని పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపిన నేపథ్యంలో సీతాదేవి ఈ వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు వెంటనే పునరావాసం ఏర్పాటు చేయాలి అని సీతాదేవి అన్నారు. ప్రత్యేక హోదా కల్పించాలని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు చేసిన డిమాండ్ మేరకే విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ ప్రత్యేక హోదా కల్పించదన్నారు. తాను విజయవాడ లేదా మచిలీపట్నం లోకసభ స్థానం నుంచి పోటీకి దిగనున్నట్టు సీతాదేవి తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తాను అని సీతాదేవి అన్నారు.