ఫిర్యాదు చేస్తే పేరు గల్లంతు | If the complaint name displaced | Sakshi
Sakshi News home page

ఫిర్యాదు చేస్తే పేరు గల్లంతు

Published Tue, Sep 29 2015 2:54 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

ఫిర్యాదు చేస్తే పేరు గల్లంతు - Sakshi

ఫిర్యాదు చేస్తే పేరు గల్లంతు

టీచర్ల బదిలీల్లో కొనసాగుతున్న గందరగోళం
- ఫిర్యాదులు చేసిన వారి దరఖాస్తులు గల్లంతు
- బదిలీకి ముందుగా దరఖాసు చేసినా అదే పరిస్థితి
- ఆందోళనలో ఉపాధ్యాయులు
ఒంగోలు వన్‌టౌన్:
ఉపాధ్యాయుల బదిలీల గడువు ముగింపు దశకు చేరుకున్నా బదిలీలపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. తప్పుడు సమాచారంతో కొందరు ఉపాధ్యాయులు అధిక పాయింట్లు పొందారని ఫిర్యాదు చేసిన వారి బదిలీ దరఖాస్తులే ఆన్‌లైన్‌లో గల్లంతు కావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా షెడ్యూల్‌కు ముందే చేసిన బదిలీ దరఖాస్తులూ ఆన్‌లైన్‌లో  కనిపించడం లేదు. ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినా.. అందులో సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  దీంతో ఏం చేయాలో పాలుపోక  ఆందోళన చెందుతున్నారు.
 
500కు పైగా ఫిర్యాదులు..
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మొత్తం 500 వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చాయి. కొందరు ఉపాధ్యాయులు అదనపు పాయింట్లకు దరఖాస్తు చేసుకోగా మరికొందరు ఇతర ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేశారు. ప్రధానంగా పదో తరగతి సగటు ఉత్తీర్ణత, పాఠశాల సగటు పనితీరుపై ఫిర్యాదు చేశారు. కొంతమంది అక్రమంగా స్పౌజ్ వాడుకుంటున్నారని కూడా ఫిర్యాదులు వచ్చాయి.  

ఫిర్యాదుల చేసిన వారి దరఖాస్తుల గల్లంతు..
బదిలీల్లో లబ్ధి పొందేందుకు కొందరు దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం పొందుపరిచారని కొందరు ఉపాధ్యాయులు అక్రమార్కులపై ఫిర్యాదులు చేశారు. అయితే ఈ ఫిర్యాదులను సైతం ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి రావడంతో వారు ఇబ్బందులు పడ్డారు. నిబంధనల ప్రకారం ఏ ఉపాధ్యాయుడి మీద ఫిర్యాదు చేస్తున్నారో సీనియారిటీ జాబితాలో ఆ ఉపాధ్యాయుని నంబరు నమోదు చేసి, ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో వివరించాలి. అయితే ఫిర్యాదు చేస్తున్న ఉపాధ్యాయులు ఇది తెలియక ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో వారి నంబర్‌నే నమోదు చేశారు. దీంతో ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా వారి పేర్లు సీనియారిటీ జాబితాలో తొలగిపోయాయి. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
 
ముందుగా దరఖాస్తు చేసుకున్నా గల్లంతే..
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ముందుగా దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల పేర్లు కొన్ని సీనియారిటీ జాబితాలో గల్లంతయ్యాయి. ప్రధానంగా సీనియారిటీ జాబితాలో 50 సంఖ్యతో మొదలయ్యే నంబర్లలో కొన్ని ఉపాధ్యాయుల పేర్లు గల్లంతయ్యాయి. ఇప్పటి  వరకు సుమారు 15 మంది పేర్లు ఈ విధంగా గల్లంతనట్లు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. వీరి దరఖాస్తులు ఎంఈఓ లాగిన్‌లో గానీ, డీఈఓ లాగిన్‌లో గానీ కనిపించడం లేదు. దీంతో వీరి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ 15 మంది ఉపాధ్యాయుల వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు డీఈఓ పంపించారు.
 
షెడ్యూల్‌పై అయోమయం
ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌పై ఇంకా అయోమయం కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా ఆయా తేదీల్లో నిర్దేశించిన పనులు మాత్రమే జరగాల్సి ఉంది. అయితే ఆ తేదీలు ముగిసినా ఆప్షన్లు క్లోజ్ కాకుండా ఉండటంతో ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రాథమిక సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు 25వ తేదీతో గడువు ముగిసినా 28వ తేదీ వరకు అభ్యంతరాలు తెలుపుకునేందుకు కంప్లైంట్ బాక్స్ ఆన్‌లైన్‌లో ఓపెన్ అవుతూనే ఉంది.
 
ఆన్‌లైన్‌తో అవస్థలు..
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి అన్ని ప్రక్రియలు ఆన్‌లైన్‌లోనే చేయాల్సి రావడంతో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. ప్రధానంగా సీనియారిటీ జాబితాలు చూసుకునేందుకు వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని కొందరు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేస్తున్నారు. తొలిసారి  వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినా అందులో సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement