చేతి వృత్తిదారుల రుణాలకు దరఖాస్తులు
Published Mon, Oct 10 2016 11:14 PM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM
కాకినాడ సిటీ : చేతివృత్తిదారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ రుణాల కోసం బీసీ సమాఖ్యలు ఈ నెల 18లోగా ఓబీఎంఎంఎస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రమౌళి కోరారు. కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశహాల్లో బీసీ కార్పొరేషన్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ బీసీ సమాఖ్యల ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. 2016–17 సంవత్సరానికి ఫెడరేషన్లకు పెంచిన రుణ, సబ్సిడీ పరిమితులు, ఏపీఓబీఎంఎంఎస్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు విధానం తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. జిల్లా బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.జ్యోతి మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి 50 శాతం సబ్సిడీ, 50 శాతం బ్యాంకు రుణం కల్పిస్తారని చెప్పారు. 10 బీసీ ఫెడరేషన్ల కింద నమోదైన సంఘాలు లేదా వాటిలోని ఉప సంఘాల సభ్యులకు రూ.లక్ష సబ్సిడీ, రూ.లక్ష బ్యాంకు రుణం కల్పిస్తారన్నారు. జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, ఎల్‌డీఎం సుబ్రహ్మణ్యం, వివిధ ఫెడరేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement