డిపో మూసివేయాలని చూస్తే ఊరుకోం
ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
సూళ్లూరుపేట: సూళ్లూరుపేట డిపోను మూసివేయాలని చూస్తే ఊరుకునేది లేదని, పోరాటం చేసైనా మూసివేతను అడ్డుకుంటామని స్థానిక శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. డిపోలో దశలవారీగా బస్సుల సంఖ్యను తగిస్తూ ఉండడంతో డిపో పరిధిలోని మూడు యూనియన్లు కలిసి బుధవారం ఆందోళన చేశారు. అదే విధంగా డిపో మూసివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని యూనియన్ నాయకులు ఎమ్మెల్యే కిలివేటికి ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఆయన డిపోకు చేరుకు ని మేనేజర్, కార్మికులతో చర్చించారు. బస్సులు తగ్గించడానికి కారణాలు, మంగళ, శుక్రవారాల్లో బస్సులను ఆపేయడంపై ఆయన ఆరా తీశారు. కార్మికులు మాట్లాడుతూ మంచి కలెక్షన్లు వస్తున్న బస్సులను రద్దు చేశారని, ఇప్పటికి ఎనిమిది సర్వీసులు తీసుకెళ్లారని, డొక్కు బస్సులు తప్ప మంచి బస్సులు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో ఆత్మకూరు, వాకాడు గూడూరు భారీ నష్టాల్లో ఉన్నాయని, వాటిని పట్టించుకోకుండా అతి తక్కువ నష్టాలతో నడస్తున్న ఈ డిపోపై ఉన్నతాధికారులు కక్ష కట్టారని కార్మికులు వివరించారు. కార్మికులు పనితీరు బాగలేనందువల్లే ఈ పరిస్థితులు వస్తున్నాయని, ఈ డిపో మనది, మనమే కాపాడుకోవాలనే దృక్పథంతో కార్మికు లు పనిచేస్తే ఎలాంటి ఇబ్బందులుండవని డిపో మేనేజర్ ప్రసాద్ వివరించారు. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న డిపో కాబట్టి దీన్ని మూసివేయడం తనకు ఇష్టం లేదని అభివృద్ధికి తాను కూడా సహకరిస్తానని, కార్మికులంతా కలిసికట్టుగా పనిచేసి మంచి కలెక్షన్లు తీసుకొస్తే డిపో నిలబ డుతుందన్నారు. ఎమ్మెల్యే కిలివేటి మాట్లాడుతూ జిల్లాలో నాలుగు డిపోలు నష్టాలో నడుస్తున్నాయని అం దులో సూళ్లూరుపేట డిపో నష్టాల్లో నాల్గోస్థానంలో ఉందన్నారు. మొదటి, రెండో స్థానంలో ఉన్న డిపోల జోలికి పోకుండా ఈ డిపోను మాత్రం ఎందుకు మూసివేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. కార్మికులంతా యూనియన్లు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేసి ఆదాయాలను తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎం , ఈడీతో చర్చించి డిపో మూతపడకుండా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఉన్నతాధికారులనైనా ఎదిరించి డిపోను నిలబెట్టుకునేందుకు కలిసికట్టుగా పోరాడదామని కిలివేటి చెప్పారు. దీంతో కార్మికులు కూడా సానుకూలంగా స్పందించి డిపోలో అన్ని బస్సుల్లో మంచి కలెక్షన్లు తీసుకురావడానికి కృషి చేస్తామని ముక్తకంఠంతో చెప్పారు. వైఎస్సార్‌సీపీ నేత దబ్బల రాజారెడ్డి, ఎంపీపీ షేక్ షమీమ్, తడ మండల కన్వీనర్ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఇలుపూరు సుధాకర్, గండవరం సురేష్‌రెడ్డి, యూనియన్ నాయకులు శేఖర్, జయరాజ్, నరేంద్ర పాల్గొన్నారు.