depot
-
బంగ్లాదేశ్ ఘోర అగ్ని ప్రమాదం (ఫొటోలు)
-
'ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు'.. బస్సు మీ ఊరికి వస్తోంది
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్‌కు చెందిన విద్యార్థులు బస్సు సౌకర్యం లేక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండటంపై ‘ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ మెయిన్‌లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఆర్టీసీ కుషాయిగూడ డిపో మేనేజర్ సుధాకర్, యాదగిరిగుట్ట డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి బుధవారం హాజీపూర్ గ్రామంతో పాటు మోడల్ స్కూల్‌ను సందర్శించారు. ఈసీఐఎల్ నుంచి బొమ్మలరామారం మండల కేంద్రం వయా మల్యాల గ్రామం నుంచి హాజీ పూర్‌కు బస్సు ఆరు ట్రిప్పులు నడుస్తోందని, హాజీపూర్ విద్యార్థుల సౌకర్యం కోసం ధర్మారెడ్డి గూడెం చౌరస్తా నుంచి మోడల్ స్కూల్‌కు బస్సు నడిపిస్తామన్నారు. ఎస్ఐ వెంకన్నతో పాటు షీ టీమ్ బృందం ఎస్ఐ మారుతి, కానిస్టేబుళ్లు అనిల్, పార్వతి మోడల్ స్కూల్ విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆకతాయిలను గుర్తించి వారి వాహనాల నంబర్లను అందజేయాలని కోరారు. మోడల్ స్కూల్ పరిసరాలలో పెట్రోలింగ్ జరుగుతుందని, మరింత నిఘా పెంచుతామని చెప్పారు. ఆపద సమయంలో 100 నంబర్‌కు ఫోన్ చేయాలని విద్యార్థినులకు సూచించారు. -
తరలిపోయిన వజ్ర బస్సులు
సాక్షి, నిజామాబాద్ : ఆర్టీసీ ‘వజ్ర’ం మెరవలేదు.. ఏసీ బస్సులు ప్రయాణికుల ఆదరణ పొందలేదు. రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్యాసెంజర్లు ఎక్కక పోవడంతో ఆదాయం కరువైంది. ఫలితంగా వీటి నిర్వహణ డిపోలకు గుదిబండగా మారింది. ఈ బస్సులు నడపడం వల్ల నష్టాలే మిగులుతుండడంతో ఆర్టీసీ పునరాలోచనలో పడింది. ప్రయాణికుల ఆదరణ లేని ప్రాంతాల నుంచి ఈ ఏసీ బస్సులను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ డిపోకు కేటాయించిన 11 బస్సుల్లో ఇప్పటికే తొమ్మిది బస్సులు తరలి పోయాయి. గంటకో బస్సు.. ఆర్టీసీ 60 వజ్ర బస్సులను కొనుగోలు చేసి, వీటిని ముఖ్యమైన డిపోలకు కేటాయించింది. నిజామాబాద్ డిపో–1కు 9, డిపో–2కు రెండు బస్సులు కేటాయించారు. ప్రయాణికులు నగరంలోని బస్టాండ్‌కు రాకుండా నిర్దేశిత బస్టాప్‌ల నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేలా వీటిని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ముబారక్‌నగర్, అర్సపల్లి, వర్ని చౌరస్తా నుంచి హైదరాబాద్‌లోని మెహిదీపట్నం, కూకట్పల్లి ప్రాంతాలకు గంటకో బస్సు నడిపించాలని నిర్ణయించారు. 2017 మే నుంచి ఈ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఫుల్ ఏసీతో పాటు నాన్‌స్టాప్ బస్సులు కావడం, అతి వేగంగా వెళ్లే సౌకర్యం ఉండడంతో ప్రయాణికుల ఆదరణ బాగుంటుందని ఆర్టీసీ అంచనా వేసింది. ఆదాయం రాకనే.. వజ్ర బస్సులు ప్రయాణికులతో నిండుగా వెళ్తాయని భావించిన రోడ్డు రవాణ సంస్థ అంచనాలు తారుమారయ్యాయి. ఈ బస్సులకు ప్రయాణికుల ఆదరణ కరువైంది. ఒక్కోసారి ఒకరిద్దరు ప్రయాణికులతోనే హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. దీంతో లాభం సంగతి దేవుడెరుగు.. కనీసం డీజిల్ ఖర్చులు కూడా రాలేదు. ప్రతి ట్రిప్పుకూ నష్టాలే మిగిలాయి. ఇలా మొత్తంగా రూ.80 లక్షలకు పైగా ఆర్టీసీ నష్టపోయింది. ఈ నేపథ్యంలో వజ్ర బస్సుల విషయంలో అధికారులు పునరాలోచనలో పడ్డారు. వేరే డిపోలకు తరలింపు.. నిజామాబాద్ మినహా మిగతా రూట్లలో వజ్ర బస్సులకు మంచి ఆదరణ లభిస్తోంది. నిర్వహణ నష్టాలు లేకపోవడంతో ఆ రూట్లలో మరిన్ని బస్సులు ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆర్నెళ్ల క్రితం నిజామాబాద్ డిపో–1 నుంచి మూడు వజ్ర బస్సులు తరలించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మరో మూడు బస్సులను హైదరాబాద్‌కు, మరో మూడింటిని కామారెడ్డి డిపోకు తరలించుకు పోయారు. మొత్తంగా 11 బస్సులకు గాను ప్రస్తుతం రెండు బస్సులు మాత్రమే నిజామాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి కూడా నష్టాల్లో కొనసాగుతుండడంతో వీటిని కూడా తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయాణికుల ఆదరణ లేకే.. నిజామాబాద్ డిపో–1 పరిధిలో మొత్తం 11 వజ్ర బస్సులు ఉండేవి. మా డిపో పరిధిలో ఇంద్ర, గరుడ కలిపి మొత్తం 40 ఏసీ బస్సులు బస్టాండ్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్నాయి. అందుకే ఈ వజ్ర బస్సులను ప్రయాణికులను ఆదరించలేదు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, హైద్రాబాద్ డిపోల పరిధిలో ఈ బస్సులు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. ఇక్కడ నష్టాలను చూసి ఉన్నతాధికారులు వజ్ర బస్సులను ఇతర డిపోలకు తరలించారు. – ఆనంద్, డిపో–1 మేనేజర్ -
రైతు సంక్షేమమే ధ్యేయం
మార్కెట్ కమిటీ చైర్మన్ కె.దేవేందర్‌రెడ్డి దిలావర్పూర్ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కె.దేవేందర్‌రెడ్డి అన్నారు. దిలావర్పూర్లో రూ.3కోట్ల వ్యయంతో నిర్మించిన గోదాం పనులు పూర్తికావడంతో గురువారం జిల్లా మార్కెటింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కృషి ఫలితంగా నిర్మల్ జిల్లా రైతులకు ఎంతగానో మేలు చేకూర్చేవిధంగా అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. రైతులకు వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే దిలావర్పూర్, సిర్గాపూర్, గుండంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద విద్యుత్ సబ్‌స్టేన్ లు ఉండగా మరో నూతన గుండంపల్లి విద్యుత్ సబ్‌స్టేన్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. ఇందులో జిల్లా మార్కెటింగ్ అధికారి టి.శ్రీనివాస్, ఓఎస్వో ఆర్.సుధాకర్, మార్కెట్ కమిటీ సెక్రెటరి సత్యనారాయణ, సూపరింటెండెంట్ భాస్కర్, స్థానిక సర్పంచ్ నంద అనిల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధనె నర్సయ్య, నాయకులు ధనె రవి, ముత్యంరెడ్డి, కోడెనవీన్, సప్పల రవి, ముథోల్ నరేందర్, ఉమాశంకర్, గుణవంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభానికి సిద్ధమైన గోదాంలు
► వేగంగా పూర్తయిన నిర్మాణాలు ► గోదాముల్లో పంటలనిల్వపై రైతుల హర్షం దహెగాం: రైతులు పండించిన పంటలను ఇళ్లల్లో నిల్వ ఉంచుకోవడం ద్వారా ప్రమాదాలు జరిగి రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వం గుర్తించి పంటలను నిల్వ ఉంచుకోవడానికి మార్కెట్ క మిటీ ఆధ్వర్యంలో గోదాంల నిర్మాణం చేపట్టి ంది. మండలానికి ఒక గోదాం చొప్పున ఒక్కో గోదాంకు రూ. 3 కోట్లు వెచ్చించి గత సంవత్స రం నిర్మాణాలు ప్రారంభించింది. మార్కెట్‌యార్డు గోదాంల నిర్మాణాలు పూర్తయి అవి నేడు ప్రారంభదశకు చేరుకున్నాయి. రైతుబంధు పథకం కింద రైతులు పండించిన పం టలకు గిట్టుబాటు ధరలేనప్పుడు పంటలను గో దాంలో నిల్వ ఉంచి దానిపై 75 శాతం రుణం పొందే అవకాశం ఉంది. గిట్టుబాటుధర వచ్చిన తరువాత పంటలను విక్రయిస్తారు. మార్కెట్ కమిటీ వారు 75 శాతం రుణాన్ని రికవరీ చేసుకుని మిగతా డబ్బులను రైతులకు చెల్లిస్తారు. నియోజకవర్గంలో వేగంగా నిర్మాణాలు సిర్పూర్(టి) నియోజకవర్గంలో సిర్పూర్(టి), కౌటాల, కాగజ్‌నగర్, దహెగాం, బెజ్జూర్ మండలాల్లో గత సంవత్సరం ఒక్కో గోదాం నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్లను మంజూరు చేసింది. ఒక్కో గోదాం సామర్థ్యం 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చు. దహెగాం, కౌటాల, బెజ్జూర్, కాగజ్‌నగర్ మండలాల్లో గోదాంల నిర్మాణాలు పూర్తి దశకు చేరుకున్నాయి. కాగజ్‌నగర్‌లోని గోదాం పూర్తికాగా రైతులు పండించిన ధాన్యాన్ని అందులో నిల్వ చేస్తున్నారు. సిర్పూర్(టి) మండలంలోని గోదాం నిర్మాణం కొనసాగుతోంది. మరో నెల రోజుల్లో పనులు పూర్తికానున్నాయి. దీంతో పండించిన పంటల «ధాన్యాన్ని గోదాంలలో నిల్వ ఉంచుకోవచ్చని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 75 శాతం రుణం పొందే అవకాశం రైతులు పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేనప్పుడు పంటలను గోదాం లలో నిల్వ ఉంచుకోవచ్చు. నిల్వ ఉంచిన పం టలకు మార్కెట్‌కమిటీ వారు తక్కువ అద్దెను నిర్ణయిస్తారు. మార్కెట్లో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు గోదాం లో నిల్వ ఉంచిన పంటలపై 75 శాతం రుణం పొందే అవకాశం ఉంది. గిట్టుబాటు ధర వచ్చి న తరువాత రైతు పంటను విక్రయించి మార్కె ట్ కమిటీ ద్వారా తీసుకున్న 75 శాతం రుణం రికవరీ చేసుకుంటారు. మిగతా డబ్బులను రై తులకు అందజేస్తారు. రైతులకు లాభం చే కూర్చే దిశగా గోదాంలు ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రబీసాగులో వచ్చిన పంటలను గోదాంలలో నిల్వ చేసుకోవచ్చని రైతులు పేర్కొంటున్నారు. రైతుబంధు పథకం కింద రైతులు అన్ని పంటలను నిల్వ చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ప్రారంభిస్తాం సిర్పూర్(టి) నియోజకవర్గంలో పూర్తయిన గోదాంలను త్వరలో ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం. దహెగాం, కాగజ్‌నగర్, కౌటాల, బెజ్జూర్ మండలాల్లో గోదాంల నిర్మాణాలు పూర్తయ్యాయి. సిర్పూర్(టి) మండలంలోని గోదాం నిర్మాణం కొనసాగుతోంది. మరో నెలరోజుల్లో నిర్మాణం పూర్తికానుంది. పూర్తయిన గోదాంలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రైతుబంధు పథకం కింద రైతులు పండించిన పంటలను గోదాంలో నిల్వచేసుకోవచ్చు. – సాయిరాంరెడ్డి, మార్కెట్ కమిటీ ఏఈ -
సూర్యాపేట ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఈడీ
సూర్యాపేట : సూర్యాపేట డిపోలోని కంప్యూటర్స్ విభాగాన్ని ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఐటీ) ఎ.పురుషోత్తం ఆదివారం తనిఖీ చేశారు. కంప్యూటర్స్ డిపోలో ఉన్న టిమ్ మిషన్ల పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 ఆర్టీసీలో రూ. 30 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ సిస్టం ప్రాజెక్టును ప్రారంభించినట్టు తెలిపారు. ఈ సిస్టం ద్వారా తెలంగాణలోని అన్ని డిపోల్లో పని తీరును, లాభనష్టాల విషయాలను సులువుగా తెలుసుకోవచ్చన్నారు. సూర్యాపేట డిపోలో పని తీరు సంతృప్తికరంగా ఉందని తెలిపారు. డిపోలో ఓటీ పేమెంట్, డ్యూటీ చేసిన సిబ్బందికి హాజరు పడడం లేదని ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. టెక్నికల్‌గా కొద్దిగా సమస్య ఉందని, దానిని వెంటనే పరిష్కరించి సిబ్బంది జీతాలు చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంఎఫ్ సక్రం, డీసీ యాదయ్య, స్టేషన్ మేనేజర్లు లింగానాయక్, ముత్తయ్య, సిస్టం సూపర్వైజర్ సిమ్లారాణి, వేణు, టీఎంయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి శ్రీనివాస్, యూనియన్ నాయకులు ఎన్సీ సైదులు, జిఎన్ రావు, దేవసాయం, చెరుకు వెంకటయ్య, ఎన్.వీరయ్య, గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త గోదాంలు నిర్మిస్తాం
⇒పది మార్కెట్ కమిటీల్లో 27,500 మెట్రిక్ టన్నుల గోదాంలు ⇒10,700 టన్నుల సామర్థ్యంతో 28 సహకార గోడౌన్లు ⇒రూ.30.98 కోట్లతో కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ ⇒వర్షాకాలం నాటికి కాగ్నా చెక్‌డ్యాం, శివసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి ⇒చెక్‌డ్యాం ప్రారంభోత్సవ సభలో మంత్రి హరీష్‌రావు తాండూరు: జిల్లాపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు వరాల వాన కురిపించారు. సోమవారం వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. కాగ్నా నది వద్ద రూ.8.52కోట్లతో చేపట్టనున్న చెక్‌డ్యాం పనులకు హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. మార్కెట్ కమిటీలను మరింత మెరుగుపర్చేందుకు చేవెళ్ల, సర్దార్‌నగర్, మెయినాబాద్, శంకర్పల్లి, మేడ్చల్, ధారూరు, మర్పల్లి వికారాబాద్, బబ్బుల్గూడ, ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డులలో రూ.16.50కోట్లతో 27,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంలను నిర్మించనున్నట్టు చెప్పారు. రూ.7.40 కోట్లతో 10,700 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సహకార సంఘాల పరిధిలో మరో 28 గోదాంలను నిర్మించనున్నట్టు వివరించారు. ఈ నెలాఖరునాటికి గోదాంల నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు. రూ.30.98కోట్ల ‘జైకా’ నిధులతో కోట్‌పల్లి ప్రాజెక్టును ఆధునికీకరించనున్నట్టు చెప్పారు. ట్రిపుల్ ఆర్ కింద రూ.6.31కోట్లతో చెరువుల మరమ్మతు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. బషీరాబాద్ మండల కేంద్రం, పెద్దేముల్ మండలం కోట్‌పల్లిలో కొత్తగా మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. మొదటి దశలో రూ.200 కోట్లతో 555 చెరువుల పునరుద్ధరణ ‘నీరు మనిషికి ప్రాణాధారం.. ఊరికి చెరువు జీవనాధారం’ నినాదంతో కాకతీయ మిషన్ పథకం కింద చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. జిల్లాలో 2,881 చెరువులకుగాను మొదటి దశలో సుమారు రూ.200 కోట్లతో 555 చెరువులను పునరుద్ధరించనున్నట్టు మంత్రి వివరించారు. శివసాగర్ ప్రాజెక్టు పనులకు రూ.రూ.37లక్షలు మంజూరు చేశామని హరీష్‌రావు తెలిపారు. ఎంతో కాలంగా ప్రతిపాదనలకే పరిమితమైన కాగ్నా చెక్‌డ్యాంకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. శివసాగర్, కాగ్నా చెక్‌డ్యాం పనులను వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందుబాటులోకి తెస్తామన్నారు. నవాంద్గీ ఎత్తిపొతల పథకం పునురుద్ధరణకు రూ.73లక్షలను మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తాండూరు ఇరిగేషన్ అతిథి గృహానికి రూ.3కోట్లు, డీఈ కార్యాలయానికి రూ.16లక్షలను మంజూరు చేస్తామన్నారు. తాండూరులో కంది బోర్డు ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. చెక్‌డ్యాం నిర్మాణం కల నెరవేరింది.. రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌కే పరిమితమైన కాగ్నా చెక్‌డ్యాం నిర్మాణం కల నెరవేరిందన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అంటే ప్రాజెక్టులే కాదు.. ఇంటింటికీ అభివృద్ధి ఫలాలు అందాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, జేసీ ఎంవీ.రెడ్డి, సబ్ కలెక్టర్ హరినారాయణ్, మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, ఎంపీపీలు కోస్గి లక్ష్మమ్మ, అరుణ, జెడ్పీటీసీ సభ్యులు రవిగౌడ్, సునీత, పీఏసీఎస్ చైర్మన్లు సిద్రాల శ్రీనివాస్, అనంత్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ అలీ, నారాయణగౌడ్, టీఆర్ఎస్ నాయకులు కరుణం పురుషోత్తంరావు, కోట్రిక వెంకటయ్య, విజయ్, నర్కుల నరేందర్‌గౌడ్, లక్ష్మీకాంత్‌రెడ్డి, అయూబ్‌ఖాన్,ై మెన్స్ ఏడీ జయరాజ్, ఇరిగేషన్ సీఈ రామకృష్ణారావు, ఎస్ఈ వెంకటేష్, డీఈ నవికాంత్, జెఈలు నికేష్, ధర్మకుమార్, తహసీల్దార్ గోవింద్రావు పాల్గొన్నారు. -
డిపో మూసివేయాలని చూస్తే ఊరుకోం
ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూళ్లూరుపేట: సూళ్లూరుపేట డిపోను మూసివేయాలని చూస్తే ఊరుకునేది లేదని, పోరాటం చేసైనా మూసివేతను అడ్డుకుంటామని స్థానిక శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. డిపోలో దశలవారీగా బస్సుల సంఖ్యను తగిస్తూ ఉండడంతో డిపో పరిధిలోని మూడు యూనియన్లు కలిసి బుధవారం ఆందోళన చేశారు. అదే విధంగా డిపో మూసివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని యూనియన్ నాయకులు ఎమ్మెల్యే కిలివేటికి ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఆయన డిపోకు చేరుకు ని మేనేజర్, కార్మికులతో చర్చించారు. బస్సులు తగ్గించడానికి కారణాలు, మంగళ, శుక్రవారాల్లో బస్సులను ఆపేయడంపై ఆయన ఆరా తీశారు. కార్మికులు మాట్లాడుతూ మంచి కలెక్షన్లు వస్తున్న బస్సులను రద్దు చేశారని, ఇప్పటికి ఎనిమిది సర్వీసులు తీసుకెళ్లారని, డొక్కు బస్సులు తప్ప మంచి బస్సులు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో ఆత్మకూరు, వాకాడు గూడూరు భారీ నష్టాల్లో ఉన్నాయని, వాటిని పట్టించుకోకుండా అతి తక్కువ నష్టాలతో నడస్తున్న ఈ డిపోపై ఉన్నతాధికారులు కక్ష కట్టారని కార్మికులు వివరించారు. కార్మికులు పనితీరు బాగలేనందువల్లే ఈ పరిస్థితులు వస్తున్నాయని, ఈ డిపో మనది, మనమే కాపాడుకోవాలనే దృక్పథంతో కార్మికు లు పనిచేస్తే ఎలాంటి ఇబ్బందులుండవని డిపో మేనేజర్ ప్రసాద్ వివరించారు. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న డిపో కాబట్టి దీన్ని మూసివేయడం తనకు ఇష్టం లేదని అభివృద్ధికి తాను కూడా సహకరిస్తానని, కార్మికులంతా కలిసికట్టుగా పనిచేసి మంచి కలెక్షన్లు తీసుకొస్తే డిపో నిలబ డుతుందన్నారు. ఎమ్మెల్యే కిలివేటి మాట్లాడుతూ జిల్లాలో నాలుగు డిపోలు నష్టాలో నడుస్తున్నాయని అం దులో సూళ్లూరుపేట డిపో నష్టాల్లో నాల్గోస్థానంలో ఉందన్నారు. మొదటి, రెండో స్థానంలో ఉన్న డిపోల జోలికి పోకుండా ఈ డిపోను మాత్రం ఎందుకు మూసివేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. కార్మికులంతా యూనియన్లు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేసి ఆదాయాలను తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్ఎం , ఈడీతో చర్చించి డిపో మూతపడకుండా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఉన్నతాధికారులనైనా ఎదిరించి డిపోను నిలబెట్టుకునేందుకు కలిసికట్టుగా పోరాడదామని కిలివేటి చెప్పారు. దీంతో కార్మికులు కూడా సానుకూలంగా స్పందించి డిపోలో అన్ని బస్సుల్లో మంచి కలెక్షన్లు తీసుకురావడానికి కృషి చేస్తామని ముక్తకంఠంతో చెప్పారు. వైఎస్సార్సీపీ నేత దబ్బల రాజారెడ్డి, ఎంపీపీ షేక్ షమీమ్, తడ మండల కన్వీనర్ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఇలుపూరు సుధాకర్, గండవరం సురేష్‌రెడ్డి, యూనియన్ నాయకులు శేఖర్, జయరాజ్, నరేంద్ర పాల్గొన్నారు.