కొత్త గోదాంలు నిర్మిస్తాం | New depot will be built | Sakshi
Sakshi News home page

కొత్త గోదాంలు నిర్మిస్తాం

Published Tue, Jan 13 2015 3:08 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

కొత్త గోదాంలు నిర్మిస్తాం - Sakshi

కొత్త గోదాంలు నిర్మిస్తాం

పది మార్కెట్ కమిటీల్లో 27,500 మెట్రిక్ టన్నుల గోదాంలు
10,700 టన్నుల సామర్థ్యంతో 28 సహకార గోడౌన్లు
రూ.30.98 కోట్లతో కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ
వర్షాకాలం నాటికి కాగ్నా చెక్‌డ్యాం, శివసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి
చెక్‌డ్యాం ప్రారంభోత్సవ సభలో మంత్రి హరీష్‌రావు

తాండూరు: జిల్లాపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు వరాల వాన కురిపించారు. సోమవారం వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. కాగ్నా నది వద్ద రూ.8.52కోట్లతో చేపట్టనున్న చెక్‌డ్యాం పనులకు హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జిల్లాపై వరాల జల్లు కురిపించారు.

మార్కెట్ కమిటీలను మరింత మెరుగుపర్చేందుకు చేవెళ్ల, సర్దార్‌నగర్, మెయినాబాద్, శంకర్‌పల్లి, మేడ్చల్, ధారూరు, మర్పల్లి వికారాబాద్, బబ్బుల్‌గూడ, ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డులలో రూ.16.50కోట్లతో 27,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంలను నిర్మించనున్నట్టు చెప్పారు.  రూ.7.40 కోట్లతో 10,700 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సహకార సంఘాల పరిధిలో మరో 28 గోదాంలను నిర్మించనున్నట్టు వివరించారు.

ఈ నెలాఖరునాటికి గోదాంల నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు. రూ.30.98కోట్ల ‘జైకా’ నిధులతో కోట్‌పల్లి ప్రాజెక్టును ఆధునికీకరించనున్నట్టు చెప్పారు. ట్రిపుల్ ఆర్ కింద రూ.6.31కోట్లతో చెరువుల మరమ్మతు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. బషీరాబాద్ మండల కేంద్రం, పెద్దేముల్ మండలం కోట్‌పల్లిలో కొత్తగా మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయనున్నామన్నారు.
 
మొదటి దశలో రూ.200 కోట్లతో 555 చెరువుల పునరుద్ధరణ
‘నీరు మనిషికి ప్రాణాధారం.. ఊరికి చెరువు జీవనాధారం’ నినాదంతో కాకతీయ మిషన్ పథకం కింద చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. జిల్లాలో 2,881 చెరువులకుగాను మొదటి దశలో సుమారు రూ.200 కోట్లతో 555 చెరువులను పునరుద్ధరించనున్నట్టు మంత్రి వివరించారు. శివసాగర్ ప్రాజెక్టు పనులకు రూ.రూ.37లక్షలు మంజూరు చేశామని హరీష్‌రావు తెలిపారు.

ఎంతో కాలంగా ప్రతిపాదనలకే పరిమితమైన కాగ్నా చెక్‌డ్యాంకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. శివసాగర్, కాగ్నా చెక్‌డ్యాం పనులను వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందుబాటులోకి తెస్తామన్నారు. నవాంద్గీ ఎత్తిపొతల పథకం పునురుద్ధరణకు రూ.73లక్షలను మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తాండూరు ఇరిగేషన్ అతిథి గృహానికి రూ.3కోట్లు, డీఈ కార్యాలయానికి రూ.16లక్షలను మంజూరు చేస్తామన్నారు. తాండూరులో కంది బోర్డు ఏర్పాటును పరిశీలిస్తామన్నారు.
 
చెక్‌డ్యాం నిర్మాణం కల నెరవేరింది..
రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌కే పరిమితమైన కాగ్నా చెక్‌డ్యాం నిర్మాణం కల నెరవేరిందన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అంటే ప్రాజెక్టులే కాదు.. ఇంటింటికీ అభివృద్ధి ఫలాలు అందాలన్నారు.

కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, జేసీ ఎంవీ.రెడ్డి, సబ్ కలెక్టర్ హరినారాయణ్, మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, ఎంపీపీలు కోస్గి లక్ష్మమ్మ, అరుణ, జెడ్పీటీసీ సభ్యులు రవిగౌడ్, సునీత, పీఏసీఎస్ చైర్మన్‌లు సిద్రాల శ్రీనివాస్, అనంత్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ అలీ, నారాయణగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు కరుణం పురుషోత్తంరావు, కోట్రిక వెంకటయ్య, విజయ్, నర్కుల నరేందర్‌గౌడ్, లక్ష్మీకాంత్‌రెడ్డి, అయూబ్‌ఖాన్,ై మెన్స్ ఏడీ జయరాజ్, ఇరిగేషన్ సీఈ రామకృష్ణారావు, ఎస్‌ఈ వెంకటేష్, డీఈ నవికాంత్, జెఈలు నికేష్, ధర్మకుమార్, తహసీల్దార్ గోవింద్‌రావు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement