గల్లంతయిన విద్యార్థులు
హైదరాబాద్: ఒక్క డేంజర్ బోర్డు పెట్టినా ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని హిమాచల్‌ప్రదేశ్ బియాస్‌నదిలో నీటి ప్రవాహంలో గల్లంతైన విద్యార్ధుల తల్లిదండ్రులు బావురుమంటున్నారు. పిల్లల్ని తల్చుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. తమవారు ఎక్కడ ఉన్నా సజీవంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. లేని పక్షంలో వారి మృతదేహాలనైనా తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంలో జాతీయ విపత్తు నిర్వహణ(ఎన్డిఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిథర్‌రెడ్డి చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. తక్షణం ఘటానాస్థలికి మర్రిశశిధర్‌రెడ్డి రావాలని వారు డిమాండ్ చేశారు. ఇంతటి ఘోరం జరిగి 48 గంటలైనా ఆయన ఇక్కడకు రాకపోవడం విచారకరం అన్నారు. మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యలపై బాధిత తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు.
హిమాచల్ ప్రదేశ్ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ విద్యార్ధులు జరిగిన సంఘటనలను భారమైన హృదయాలతో గుర్తుతెచ్చుకుంటున్నారు. ఎంతో ఆనందంగా ప్రారంభమైన యాత్ర విషాదంగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షణాల్లోనే ఊహించని ఘోరం జరిగిపోయిందని వాపోయారు. విహారయాత్రకు వెళ్లిన పిల్లలు విగత జీవులుగా ఇంటికి చేరటంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఇదిలా ఉండగా, సహాయకచర్యలు వేగంగా జరగడం లేదని సంఘటనా స్థలం వద్దకు వెళ్లిన బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురాతన పద్ధతుల్లో గాలింపు చేస్తున్నారని వారు ఆరోపించారు. అధునాతన పరికరాలతో చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.