Bias Tragedy
-
ఒక్క డేంజర్ బోర్డు పెట్టినా.....
హైదరాబాద్: ఒక్క డేంజర్ బోర్డు పెట్టినా ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని హిమాచల్‌ప్రదేశ్ బియాస్‌నదిలో నీటి ప్రవాహంలో గల్లంతైన విద్యార్ధుల తల్లిదండ్రులు బావురుమంటున్నారు. పిల్లల్ని తల్చుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. తమవారు ఎక్కడ ఉన్నా సజీవంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. లేని పక్షంలో వారి మృతదేహాలనైనా తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంలో జాతీయ విపత్తు నిర్వహణ(ఎన్డిఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిథర్‌రెడ్డి చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. తక్షణం ఘటానాస్థలికి మర్రిశశిధర్‌రెడ్డి రావాలని వారు డిమాండ్ చేశారు. ఇంతటి ఘోరం జరిగి 48 గంటలైనా ఆయన ఇక్కడకు రాకపోవడం విచారకరం అన్నారు. మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యలపై బాధిత తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ విద్యార్ధులు జరిగిన సంఘటనలను భారమైన హృదయాలతో గుర్తుతెచ్చుకుంటున్నారు. ఎంతో ఆనందంగా ప్రారంభమైన యాత్ర విషాదంగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షణాల్లోనే ఊహించని ఘోరం జరిగిపోయిందని వాపోయారు. విహారయాత్రకు వెళ్లిన పిల్లలు విగత జీవులుగా ఇంటికి చేరటంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇదిలా ఉండగా, సహాయకచర్యలు వేగంగా జరగడం లేదని సంఘటనా స్థలం వద్దకు వెళ్లిన బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురాతన పద్ధతుల్లో గాలింపు చేస్తున్నారని వారు ఆరోపించారు. అధునాతన పరికరాలతో చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
ఇది మా బిడ్డకు మరోజన్మ
* సృజన్ తండ్రి విశ్వనాథం రాజేంద్రనగర్: విహారయాత్రకు వెళ్లిన విజ్ఞాన్ జ్యోతి కళాశాల విద్యార్థులు గల్లంతయ్యారంటూ టీవీలో బ్రేకింగ్న్యూస్ చూసి షాక్‌కు గురయ్యామని.. అదే సమయంలో తన కూతురు తేరుకుని కుమారుడి సెల్‌కు ఫోన్ చేసి మాట్లాడ్డంతో ఊపిరి పీల్చుకున్నట్టు విద్యార్థి పి.సృజన్ తల్లిదండ్రులు విశ్వనాథం, ఉమాదేవి కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమారుడు క్షేమంగా ఉన్నా తోటి విద్యార్థులు 24 మంది మృతి చెందారని తెలిసి తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి అయిన విశ్వనాథంకు ముగ్గురు సంతానం కాగా సృజన్ చిన్నవాడు. వీరంతా బండ్లగూడ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో సృజన్ తండ్రికి ఫోన్‌చేసి క్షేమంగా ఉన్నట్టు తెలిపి ఫోన్ పెట్టేశాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బంధువొకరు ఫోన్‌చేసి విహారయాత్రకు వెళ్లినవారి జాడతెలియడంలేదంటూ టీవీలో వస్తోందని చెప్పారన్నారు. హతాశులైన తాము కుప్పకూలిపోగా కూతురు సృజన్‌తో మాట్లాడించిందన్నారు. తాను క్షేమంగా ఉన్నట్టు చెప్పడంతో కొంత ఊరట లభించదని విశ్వనాథం పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఫోన్‌చేసిన సృజన్ చండీఘడ్ నుంచి విమానంలో వస్తున్నట్టు సమాచారం అందించాడు. -
దేవాశీష్ బోస్ మృతదేహం లభ్యం
మండి (హిమాచల్‌ప్రదేశ్): బియాస్ నదిలో మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడు బాగ్‌అంబర్‌పేట సీఈకాలనీకి చెందిన దేవాశీష్ బోస్ గా గుర్తించారు. బోస్ తండ్రి రాబిన్‌బోస్ నిన్ననే సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. కుమారుడి మరణవార్త తెలియడంతో బోస్ తల్లి నిర్మల భోరున విలపించారు. దీంతో ఇప్పటివరకు మృతదేహాలు వెలికితీసినట్టయింది. ఇంకా 19 మంది ఆచూకీ చేయాల్సివుంది. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 500 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నిన్న నలుగురు మృతదేహాలు వెలికితీశారు. సోమవారం అర్థరాత్రి ఈ మృతదేహాలను హైదరాబాద్ కు తరలించారు. ఈ నలుగురు అల్వాల్‌కు చెందిన దుర్గాదాస్ కుమార్తె గంపల ఐశ్వర్య, కూకట్‌పల్లికి చెందిన రాధాకృష్ణ కుమార్తె అప్పనబోట్ల లక్ష్మిగాయత్రి, చర్లపల్లికి చెందిన సూర్యకుమార్ కుమార్తె ఆకుల విజేత, నల్గొండ జిల్లా బిక్యాతాండాకు చెందిన శేఖర్‌నాయక్ కుమారుడు బానోతు రాంబాబుగా గుర్తించారు. -
విద్యార్థిని రిషిక క్షేమం
కాచిగూడ: హిమాచల్‌ప్రదేశ్‌కు స్టడీటూర్ కోసం వెళ్లిన వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాల విద్యార్థుల్లో బర్కత్‌పుర బసంత్ కాలనీలోని బసంత్ ఆపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న రామకృష్ణ, మంజుల దంపతుల కుమార్తె రిషిక కూడా ఉంది. ప్రమాదం విషయం తెలినప్పటి నుంచి తల్లిదండ్రులు తీవ్ర అందోళన చెందారు. అయితే, తాను క్షేమంగానే ఉన్నట్టు రిషిక నుంచి ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం రిషిక కుటుంబ సభ్యులను జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్, బర్కత్‌పుర కార్పొరేటర్ దిడ్డి రాంబాబు కలిసి విద్యార్థిని యోగక్షేమాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. రిషిక త్వరగా హైదరాబాద్ చేరుకునేలా అధికారులతో మాట్లాడతామన్నారు. ఫోన్ వచ్చిన కొద్దిసేపటికే... ముషీరాబాద్: వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న నల్లకుంటకు చెందిన బైరినేని రిత్విక్ రావ్ ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. మరో గంటలో హిమాచల్‌ప్రదేశ్‌కు చేరుకుంటున్నామని చెప్పాడు. కానీ అంతలోనే గల్లంతైనవార్తలు విని తల్లిదండ్రులు కుప్పకూలారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆదివారం రాత్రి 8.45 గంటలకు టీవీలో వార్తలు చూసి కొడుకు రిత్విక్‌కు తండ్రి రామ్మోహన్రావు ఫోన్ చేశాడు. అయితే ఫోన్ స్నేహితుడి దగ్గర ఉండటంతో రిత్విక్‌కు ఫోన్ ఇవ్వమంటే స్నేహితుడు తడబడుతూ దూరంగా ఉన్నాడని, మళ్లీ ఫోన్ చేయిస్తానని చెబుతూ విషయం దాటవేశాడు. గట్టిగా నిలదీయగా నదిలో కొట్టుకుపోయాడని సమాధానం చెప్పడంతో తండ్రి రామ్మోహన్ రావు కుప్పకూలిపోయాడు. -
క్షణాల్లో తప్పించుకున్నాడు
* నితిన్ తల్లిదండ్రులు గచ్చిబౌలి: హిమాచల్‌ప్రదేశ్ ఘటనలో తమ కొడుకు సురక్షితంగా బయటపడటం అదృష్టమని, మిగతా విద్యార్థులు గల్లంతైన విషయం జీర్ణించుకోలేక పోతున్నామని నితిన్ తల్లిదండ్రులు సి.యాదయ్య, సుజాత పేర్కొన్నారు. ఆదివారం రాత్రి 7.45 గంటలకు నితిన్ ఫోన్ చేసి చెప్పే వరకు ప్రమాదం విషయం తమకు తెలియదన్నారు. తన కళ్ల ముందే స్నేహితులు వరదలో కొట్టుకపోయారని ఆందోళనగా చెప్పగానే తాము షాక్‌కు గురైనట్లు తెలిపారు. అప్పటి వరకు ఫొటోలు దిగిన నితిన్ నీళ్లు చల్లగా ఉండటంతో బయటకు వెళ్లాలని.. అదే సమయంలో పైన ఉన్న అతని స్నేహితుడు పిలువడంతో అక్కడికి వెళ్లినట్టు చెప్పాడన్నారు. కొద్ది క్షణాల్లోనే నీటి ఉధృతికి అంతా కొట్టుకుపోయారని చెప్పాడన్నారు. విషయం తెలిసిన సమయం నుంచి నితిన్‌తో గంట గంటకు ఫోన్లో మాట్లాడుతున్నట్టు వివరించారు. వరంగల్ జిల్లా చేర్యాల మండలం, సుంచనకోటకు చెందిన యాదయ్య సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తూ గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈయన నలుగురు కొడుకుల్లో నితిన్ పెద్దవాడు. స్నేహితుడితో వెళ్లి... నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉపేంద్ర వీఎన్‌ఆర్‌లో ద్వితీయ సంవత్సరం చదువుతూ మియాపూర్‌లో ఓ హాస్టల్లో ఉంటున్నాడు. జీపీఆర్ఏ క్వార్టర్స్‌లో బంధువుల ఇంటికి వెళ్లి అక్కడి నుంచి క్యాబ్‌లో క్లాస్మేట్ నితిన్‌తో కలిసి ఈనెల 3న నాంపల్లికి బయలుదెరాడు. దక్షిణ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి.. అక్కడి నుంచి హిమాచల్‌ప్రదేశ్‌కు చేరకున్నారు. స్నేహితుడు ఉపేంద్ర గల్లంతు కావడం తట్టుకోలేకపోతున్నానని నితిన్ తల్లిదండ్రులు తెలిపారు. -
కులుమనాలికి వైఎస్ఆర్ సీపీ ఎంపీలు
న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లో గల్లంతైన విద్యార్థుల కుటుంబాలకు సహాయం అందించేందుకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎంపీల బృందం మంగళవారం కులుమనాలి వెళ్లింది. ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కులుమనాలి వెళ్లారు. బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం సాగుతున్న సహాయక చర్యలను వారు పరిశీలించనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్ ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో హైదరాబాద్ వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. వీరిలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. కాగా, ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ ఎంపీల బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించింది.