విద్యార్థిని రిషిక క్షేమం
కాచిగూడ: హిమాచల్‌ప్రదేశ్‌కు స్టడీటూర్ కోసం వెళ్లిన వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాల విద్యార్థుల్లో బర్కత్‌పుర బసంత్ కాలనీలోని బసంత్ ఆపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న రామకృష్ణ, మంజుల దంపతుల కుమార్తె రిషిక కూడా ఉంది. ప్రమాదం విషయం తెలినప్పటి నుంచి తల్లిదండ్రులు తీవ్ర అందోళన చెందారు.
అయితే, తాను క్షేమంగానే ఉన్నట్టు రిషిక నుంచి ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం రిషిక కుటుంబ సభ్యులను జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్, బర్కత్‌పుర కార్పొరేటర్ దిడ్డి రాంబాబు కలిసి విద్యార్థిని యోగక్షేమాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. రిషిక త్వరగా హైదరాబాద్ చేరుకునేలా అధికారులతో మాట్లాడతామన్నారు.
ఫోన్ వచ్చిన కొద్దిసేపటికే...
ముషీరాబాద్: వీఎన్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న నల్లకుంటకు చెందిన బైరినేని రిత్విక్ రావ్ ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. మరో గంటలో హిమాచల్‌ప్రదేశ్‌కు చేరుకుంటున్నామని చెప్పాడు. కానీ అంతలోనే గల్లంతైనవార్తలు విని తల్లిదండ్రులు కుప్పకూలారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఆదివారం రాత్రి 8.45 గంటలకు టీవీలో వార్తలు చూసి కొడుకు రిత్విక్‌కు తండ్రి రామ్మోహన్‌రావు ఫోన్ చేశాడు. అయితే ఫోన్ స్నేహితుడి దగ్గర ఉండటంతో రిత్విక్‌కు ఫోన్ ఇవ్వమంటే స్నేహితుడు తడబడుతూ దూరంగా ఉన్నాడని, మళ్లీ ఫోన్ చేయిస్తానని చెబుతూ విషయం దాటవేశాడు. గట్టిగా నిలదీయగా నదిలో కొట్టుకుపోయాడని సమాధానం చెప్పడంతో తండ్రి రామ్మోహన్ రావు కుప్పకూలిపోయాడు.