నేటి నుంచి ‘సోనార్’ గాలింపు
సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో బియాస్ నదిలో గల్లంతైన వీఎన్‌ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. 16 మంది విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ కోసం శనివారం ఏడో రోజు నావికాదళం, ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు, రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రత్యేక ఈత నిపుణులు, మరో 450 మంది పనివారు రోజంతా గాలించినా లాభం లేకపోయింది. ప్రమాద స్థలి నుంచి మూడు కిలోమీటర్ల మేరకు నదిలో నీటిమట్టాన్ని గంట పాటు కనీస స్థాయికి తగ్గించి వెదికినా ఒక్క మృతదేహం కూడా లభించలేదు.
దాంతో ఐదు రోజులుగా ఘటనా స్థలి వద్దే పడిగాపులు కాస్తూ, తమ పిల్లల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల మనోవేదనకు అంతులేకుండా పోయింది. ఆదివారం నుంచి అత్యాధునిక సోనార్ (సైట్ స్కాన్ రాడార్) పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు. అప్పటికీ ఫలితం లేకపోతే మృతదేహాల కోసం పండో డ్యామ్ గేట్లు ఎత్తేయడం, లేక మరో వారం పది రోజుల్లో వాటంతట అవే పైకి తేలేదాకా ఎదురు చూడటం తప్ప మరో మార్గం ఉండకపోవచ్చంటున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన మండి జిల్లాలోనే కొద్ది రోజులుగా మకాం వేసిన తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి శనివారం స్థానిక ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. విహారయాత్రకు వెళ్లిన 24 మంది విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ జూన్ 8న లార్జి డ్యామ్ నుంచి హఠాత్తుగా వచ్చి పడ్డ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం తెలిసిందే. గురువారం దాకా 8 మంది విద్యార్థుల మృతదేహాలు లభించాయి. శుక్రవారం మానవరహిత విమానాన్ని రంగంలోకి దించినా లాభం లేకపోయింది.