రిధిమా.. వెళ్లిపోయావమ్మా !
మోతీనగర్: హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన రిధిమా మృతదేహం లభించిందని అధికారులు సమాచారమివ్వడంతో మోతీనగర్ బీఎస్పీకాలనీలో ఆమె నివాసం వద్ద తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈనెల 8న దుర్ఘటన జరిగిన నాటి నుంచి రిధిమా తల్లిదండ్రులు శ్రీనివాస్, రాధాదేవిలు తల్లడిల్లుతూ కూతురు కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు తమకూతురు క్షేమంగా తిరిగి వస్తుందని కళ్లల్లో ఒత్తులువేసుకొని అన్నపానీయాలు ముట్టకుండా ఎదురుచూసిన తల్లిదండ్రులకు చివరకు మృతదేహం వస్తుందని తెలియడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.
‘చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నాం. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. రిధిమా మృతదేహం లభించిందని తెలియడంతో ఆమె స్నేహితులు, బంధువులు ఇంటికి తరలివస్తున్నారు. ఈనెల 8న బియాస్ నదిలో దుర్ఘటన జరగ్గా...ఇప్పటివరకు 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా ఏడు మృతదేహాలు దొరకాల్సి ఉంది. మృతదేహం గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అనంతరం అక్కడినుంచి చిత్తూరు జిల్లాకు తరలించనున్నట్లు రిధిమా కుటుంబసభ్యులు తెలిపారు.