vnr Engineering College
-
నేటి నుంచి ‘సోనార్’ గాలింపు
సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో బియాస్ నదిలో గల్లంతైన వీఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. 16 మంది విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ కోసం శనివారం ఏడో రోజు నావికాదళం, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రత్యేక ఈత నిపుణులు, మరో 450 మంది పనివారు రోజంతా గాలించినా లాభం లేకపోయింది. ప్రమాద స్థలి నుంచి మూడు కిలోమీటర్ల మేరకు నదిలో నీటిమట్టాన్ని గంట పాటు కనీస స్థాయికి తగ్గించి వెదికినా ఒక్క మృతదేహం కూడా లభించలేదు. దాంతో ఐదు రోజులుగా ఘటనా స్థలి వద్దే పడిగాపులు కాస్తూ, తమ పిల్లల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల మనోవేదనకు అంతులేకుండా పోయింది. ఆదివారం నుంచి అత్యాధునిక సోనార్ (సైట్ స్కాన్ రాడార్) పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు. అప్పటికీ ఫలితం లేకపోతే మృతదేహాల కోసం పండో డ్యామ్ గేట్లు ఎత్తేయడం, లేక మరో వారం పది రోజుల్లో వాటంతట అవే పైకి తేలేదాకా ఎదురు చూడటం తప్ప మరో మార్గం ఉండకపోవచ్చంటున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన మండి జిల్లాలోనే కొద్ది రోజులుగా మకాం వేసిన తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి శనివారం స్థానిక ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. విహారయాత్రకు వెళ్లిన 24 మంది విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ జూన్ 8న లార్జి డ్యామ్ నుంచి హఠాత్తుగా వచ్చి పడ్డ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం తెలిసిందే. గురువారం దాకా 8 మంది విద్యార్థుల మృతదేహాలు లభించాయి. శుక్రవారం మానవరహిత విమానాన్ని రంగంలోకి దించినా లాభం లేకపోయింది. -
వీఎన్ఆర్ కాలేజి యాజమాన్యానికి పూర్వ విద్యార్ధుల బాసట
మండి: హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో విద్యార్థుల గల్లంతు ఘటనపై యాజమాన్యానికి విఎన్ఆర్ విజ్ఞాన్ కళాశాల పూర్వవిద్యార్థులు బాసటగా నిలిచారు. బియాస్ నదిలో ప్రమాదానికి, యాజమాన్యం ఎలాంటి సంబంధం లేదని విద్యార్ధులు తెలిపారు. ఈ దుర్ఘటనలో కాలేజి యాజమాన్య తప్పిదంలేదని పూర్వ విద్యార్ధులు మీడియాకు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు మేము అండగా నిలుస్తామని పూర్వ విద్యార్ధులు ముందుకు వచ్చారు. మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నామని విఎన్ఆర్ విజ్ఞాన్ కళాశాల పూర్వవిద్యార్థులు అన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాపై కాలేజి యాజమాన్యం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. -
దేవాశిష్‌కు కన్నీటి వీడ్కోలు
నారాయణగూడ క్రిస్టియన్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు ముషీరాబాద్/అంబర్‌పేట/అఫ్జల్‌గంజ్: హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నది ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి దేవాశిష్ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం జరిగాయి. బాగ్‌అంబర్‌పేట సెంట్రల్ ఎక్సైజ్‌కాలనీలోని అతని నివా సం నుంచి కింగ్‌కోఠిలోని క్రైస్తవ శ్మశానవాటిక వరకు జరిగిన అంతిమయాత్రలో తోటి విద్యార్థులు, బంధుమిత్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవాశిష్ శవపేటికను అతని తండ్రి, తమ్ముడు భుజాలపై ఎత్తుకొని తీసుకొచ్చారు. అంతకుముందుదేవాశిష్ బోస్ ఆత్మకు శాంతిచేకూరాలని అబిడ్స్‌లోని క్యాథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బంధువులు, స్నేహితులు దర్శించుకునేందుకు వీలు గా భౌతిక కాయాన్ని రెండు గంటల పాటు అక్కడే ఉంచారు. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన కుమారుడు ఇలా విగత జీవిగా మారడాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వారితోపాటు బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో శ్మశాన వాటికకు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు మాజీ మంత్రి కృష్ణయాదవ్, విద్యానగర్ కార్పొరేటర్ అడపా చంద్రమౌళి దేవాశిష్ బోస్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.