కన్నా ఎక్కడున్నావురా?
బియాస్ నదిలో జరగిన ప్రమాదంలో రహమత్‌నగర్‌కు చెందిన జగదీశ్ ఉన్నాడు. తమ కొడుకును తలుచుకుంటు తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికంగా ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ‘కన్నా.. ఎక్కడున్నావురా.. ఏమైపోయావురా..కనిపించరా..’ అంటు జగదీష్ తల్లి విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
తల్లిదండ్రులను ఒప్పించి వెళ్లాడు
మియాపూర్ హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీలోని బ్లోసమ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న రవివర్మ ఎస్‌బీహెచ్, జూబ్లీహిల్స్ శాఖ బ్రాంచ్‌మేనేజర్. భార్య సుమతి, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివప్రకాశ్ వర్మ విజ్ఞాన్‌జ్యోతిలో ఈఐఈ ఇంజనీరింగ్ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులను ఒప్పించి పట్టుబట్టి మరీ 3వ తేదీన విహారయాత్రకు బయలుదేరాడు. ప్రతిరోజు తల్లితో ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. చివరిసారిగా ఆదివారం ఉదయం తల్లికి ఫోన్ చేశాడు. టూర్ విశేషాలు చెప్పాడు. ఆ తరువాత మళ్లీ ఫోన్ రాలేదు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం ఉదయం 6 గంటలకు ఇంటికి తాళంవేసి హిమాచల్‌కు బయలుదేరారు.
తల్లడిల్లుతున్న తల్లి హృదయం
హిమాచల్‌ప్రదేశ్ ఘటనలో చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన అశీష్ ముంతా(20) గల్లంతు కావడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తల్లి సత్యవాణి కన్నీటిపర్యంతమైంది. ఏడాది కిందట భర్తను కోల్పోయి విచారంలో ఉన్న ఆమెకు ఈ వార్త అశనిపాతమైంది. కాగా గల్లంతైన ఆశీష్ ప్రమాద సమయంలో ఇద్దరు విద్యార్థినులకు ఒడ్డుకు చేర్చి, తాను ప్రమాదంలో చిక్కుకున్నాడని అతని స్నేహితులు చెబుతున్నారు.
ఆచూకీ లేని సాబేర్..
శేరిలింగంపల్లి గుల్‌మెహర్‌పార్క్ కాలనీకి చెందిన షేక్ సాబేర్ హుస్సేన్ విషయమై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించగా సాబేర్ సురక్షితంగానే ఉన్నట్లు చెప్పారు. అయినా కాలేజీ వాళ్ల మాటలతో సంతృప్తి చెందక సాబేర్ తల్లిదండ్రులు ఆసియా, షేక్ రజాలు సోమవారం హిమాచల్‌కు బయలుదేరి వెళ్లారు. కానీ బియాస్‌నది వద్ద జరిగిన విషాదం వివరాలు తమకు ఏమీ తెలియడం లేదని సాబేర్ తల్లిదండ్రులు హిమాచల్‌లోని మండి నుంచి ‘సాక్షి’కి ఫోన్ చేసి చెప్పారు. ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించితేకాని ఆచూకీ దొరకదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫోన్ రాకపోవడంతో ఆందోళన
చందానగర్‌కు జవహర్ కాలనీ టెల్‌కర్ట్స్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముండే వెంకట దుర్గ తరుణ్‌ను ఈ నెల 3వ తేదీ సాయంత్రం 8 గంటలకు స్వయంగా తండ్రి సుబ్బారావు రెలైక్కించారు. రెగ్యులర్‌గా ఫోన్‌లో మాట్లాడే తరుణ్ చివరిసారిగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు తండ్రికి ఫోన్ చేసి కులూకు వెళుతున్నట్లు చెప్పాడు. అంతే.. ఆ తరువాత ఫోన్ రాలేదు. దాంతో తండ్రి సుబ్బారావు ఆందోళనకు గురై హిమాచల్‌ప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లాడు.
ఫోన్ స్విచాఫ్..
కడప జిల్లా తెలుగు గంగ ప్రాజెక్టులో ఎస్‌ఈగా పనిచేస్తున్న సుబ్బారావు, ఆశల కుటుంబం కూడా కూకట్‌పల్లిలోనే ఉంటుంది. వారి కుమారుడు సాయిరాజ్ కూడా ఈ ప్రమాదంలో గల్లంతయ్యాడు.
చివరి సారిగా సాయిరాజ్ ఆదివారం మధ్యాహ్నం ఫోన్ చేసి కులుమనాలి సమీపంలోని పర్యాటక స్థలంలో ఉన్నామని చెప్పాడు. టీవిలో వస్తున్న వార్తలు విన్న తల్లిదండ్రులు సాయికి ఫోన్ చేశారు. అప్పటికే అది స్విచాఫ్ అయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వారు హుటాహుటిన హిమాచల్ ప్రదేశ్‌కి బయలుదేరారు.
కోలుకోలేని విషాదంలో తల్లి
వనస్థలిపురంకు చెందిన గోనూరు అరవింద్ గల్లంతయ్యాడన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. అరవింద్ తల్లి శశిలత దుఃఖం వర్ణనాతీతం. శంషాబాద్‌లో ఉండే భర్త వినోద్‌కుమార్‌తో వచ్చిన మనస్పర్ధల కారణంగా కొంతకాలంగా ఆమె తన ముగ్గురు పిల్లలతో వనస్థలిపురం హిల్‌కాలనీలోని తండ్రి సంగప్ప ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో అరవింద్ గల్లంతు కావడం ఆ తల్లిని కోలుకోలేని విషాదంలో ముంచింది.