గుట్కా కావాలా.. ప్రొద్దుటూరుకు రండి.. | .. If you want to come quid prodduturuku | Sakshi
Sakshi News home page

గుట్కా కావాలా.. ప్రొద్దుటూరుకు రండి..

Published Fri, Nov 7 2014 3:29 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

గుట్కా కావాలా..  ప్రొద్దుటూరుకు రండి.. - Sakshi

గుట్కా కావాలా.. ప్రొద్దుటూరుకు రండి..

ప్రొద్దుటూరు క్రైం: ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గుట్కా పదార్థాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. వీటిని విక్రయిస్తే కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

ప్రొద్దుటూరు క్రైం:
 ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గుట్కా పదార్థాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. వీటిని విక్రయిస్తే కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రతి రోజు టీవీలు, సినిమా థియేటర్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు కూడా ఇస్తున్నాయి. అయినప్పటికీ యథేచ్ఛగా నిషేధిత గుట్కా పదార్థాలు పట్టణంలో లభిస్తున్నాయి. చిన్న చిన్న  బీడీల షాపు నుంచి హోల్‌సేల్ షాపుల వరకూ వీటిని బాహాటంగానే విక్రయిస్తున్నారు. ప్రతి రోజు రూ. లక్షల్లో వీటి విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

 రెట్టింపు ధరలకు విక్రయాలు
 ప్రొద్దుటూరులో పాన్‌పరాగ్, గుట్కా, రాజాఖైనీలతో పాటు బ్లూబుల్ ఖైనీ అనే పొగాకు ప్యాకెట్‌లను దుకాణాలలో విక్రయిస్తున్నారు. అన్నిటికంటే బ్లూబుల్ ఖైనీ విక్రయాలు అధికంగా జరుగుతున్నట్లు దుకాణ దారులు అంటున్నారు. దీనిపై అన్ని వివరాలు తెలుగు, ఇంగ్లీష్‌లో ఉన్నప్పటికీ తయారు చేసిన ప్రాంతం మాత్రం వేరే భాషలో ముద్రించారు.

గతంలో అయితే ఈ ప్యాకెట్‌ను రెండు రూపాయలకు విక్రయించేవారు. రెండు రూపాయలు ఉన్న ఖైనీ ప్యాకెట్‌ను హోల్ సేల్ దుకాణంలోనే రూ.3లకు విక్రయిస్తున్నారు. వాటిని రిటైల్ షాపుల వారు రూ.5-6లకు వినియోగదారులకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.

 ఊరూ.. పేరు లేకుండా
 గుట్కా, ఖైనీ ప్యాకెట్‌ల బండిల్స్ నిత్యం వస్తు రవాణా వాహనాల ద్వారానే ప్రొద్దుటూరుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌పోర్టుల ద్వారా వచ్చే ఈ తరహా బండి ళ్లపై వ్యక్తులపేర్లు గానీ, దుకాణాల పేర్లు గానీ ఉండవు. ఇలా ప్రతి రోజు ప్రొద్దుటూరు పట్టణానికి హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నాయి.

గతంలో అధికారులు దాడులు నిర్వహించి రూ.లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో వీటిపై సంబంధిత అధికారుల నిఘా లేకపోవడంతో గుట్కాలను బహిరంగంగా విక్రయిస్తున్నారు. దుకాణాలలో వీటి లభ్యత అధికం కావడంతో మైనర్లు కూడా గుట్కా వ్యసనానికి లోనవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని గుట్కా విక్రయాలను నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement