
అగ్రిగోల్డ్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఆదోని టౌన్: అగ్రిగోల్డ్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆ సంస్థ ఏజెంట్లు, ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేసిన పొదుపు, డిపాజిట్‌లకు వడ్డీతోపాటు చెల్లించాల్సిన నగదును యాజమాన్యం రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తోందంటూ కార్యాలయ తలుపులు మూసి ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో కార్యాలయంలో ఉన్న సీనియర్లపై దాడిచేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఏజెంట్లు, ఖాతాదారులు వీరేష్, చంద్రమ్మ, లక్ష్మన్న, నర్సింహులు, లక్ష్మినారాయణ, సావిత్రి, దస్తగిరి, శరత్‌బాబు, రాము, అంజి, వెంకటేష్, ఈరన్న, పద్మ, రామాంజనేయులు, సురేష్ తదితరులు మాట్లాడుతూ 8నెలలుగా చెక్కులను పట్టుకొని కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలుచేస్తున్నా తమ గోడును పట్టించుకునే నాధుడే లేడన్నారు.
ఒక్కో చెక్కు రెండు, మూడు సార్లు బౌన్స్ అయిందని, రెండు, మూడు బ్యాంకులకు ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ యాజమాన్యం, సీనియర్లు చెప్పే మాటలకు, ప్రస్తుతం జరుగుతున్న దానికి పొంతన లేదని ఆరోపించారు. గంటపాటు ఆందోళన చేసిన ఏజెంట్లు, ఖాతాదారులకు సోమవారం వరకు సమయం ఇవ్వాలని అంతలోగా నగదు చెల్లిస్తామని సీనియర్ల నుంచి ఫోన్లు రావడంతో ఆందోళనను విరమించారు. దాదాపు ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రూ.5కోట్లు మేర డిపాజిట్లు చెల్లించాల్సి ఉన్నట్లు ఖాతాదారులు రామాంజినేయులు, సురేష్, పద్మ, చంద్రమ్మ తెలిపారు.