ఉద్రిక్తం.. అరెస్టుల పర్వం
శ్రీకాకుళం పాతబస్టాండ్: అక్రమ అరెస్టులపై వెల్లువెత్తిన నిరసన.. అయినా వెనక్కు తగ్గని పోలీసులు.. ర్యాలీలు, ధర్నాలతో పోలీస్‌స్టేషన్ల వద్ద నిరసన గళం వినిపించేందుకు వచ్చిన మహిళా ఉద్యోగులను చెదరగొట్టేందుకు ఖాకీ బలం ప్రదర్శించడంతో తోపులాటలు, వాగ్వాదాలు వంటి ఘటనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా ఉద్యోగులను విచక్షణారహితంగా ఈడ్చుకెళ్లిన తీరు పోలీసుల దమనకాండకు, ప్రభుత్వం నియంతృత్వ ధోరణికి మరోమారు దర్పణం పట్టింది. జీతాల కోసం గత రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) వీవోఏలు హైదరాబాద్‌లో తలపెట్టిన నిరసన కార్యక్రమాలను భగ్నం చేసేందుకు ఆదివారం అరెస్టుల పర్వానికి ప్రభుత్వం తెరతీసిన విషయం తెలిసిందే. అక్రమ అరెస్టులకు నిరసనగా సోమవారం జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల వద్ద వీవోఏలు, సీఐటీయు, ఇతర ప్రజాసంఘాలు ధర్నాలు చేపట్టాయి.
ఈ సందర్భంగా కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. ఒక్క శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోనే 27 మందిని అరెస్టు చేశారు. ఆదివారంనాటి అరెస్టులను నిరసిస్తూ జిల్లావ్యాప్త కార్యక్రమంలో భాగంగా వీవోఏలతోపాటు సీఐటీయూ దాని అనుబంధ సంస్థల ప్రతినిధులు ర్యాలీగా వచ్చి రెండో పోలీసుస్టేషన్ వద్ద బైఠాయించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి ధర్నాను భగ్నం చేశారు. సీఐటీయూ నాయకులు కె.నాగమణి, డి.గణేష్, వై.చలపతిరావులతో సహా 27 మందిని అరెస్టు చేశారు. ఈ అరెస్టులను ఆందోళనకారులు ప్రతిఘటించడంతో ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. దాంతో పోలీసులు పలువురిని బలవంతంగా ఈడ్చుకుపోయారు. ఈ తోపులాటలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి గణేష్ కుడిచేయికి గాయమైంది.
ఇది అరాచకపాలన
ధర్నా వద్ద పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం లేదని, ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. పోలీసులు టీడీపీ పాలకులకు తొత్తులుగా మారిపోయారని విమర్శించారు. ఐకేపీ సీఎఫ్‌లు తమ జీతాల కోసం శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే అరెస్టులు చేసి, స్టేషన్లలో నిర్బంధించడమే కాకుండా బెదిరింపులతో భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. వీవోఏలు 100 రోజులుగా సమ్మె చేస్తుంటే సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా పోలీసులతో బలప్రయోగం ద్వారా ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తూ ప్రజల నుంచి, మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. గతంలో ఇదే రీతిలో వ్యవహరించడం వల్లే ప్రజలు చంద్రబాబును పదేళ్లు అధికారానికి దూరంగా ఉంచిన విషయాన్ని విస్మరిస్తే.. మళ్లీ అదే గతి పడుతుందని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు ఎన్‌వీ రమణ, పి.ప్రభావతి, సూరమ్మ, చిన్నమ్మ, కాలేమ్మ, నర్సమ్మ, లత, సత్యనారాయణ, కాన్‌కాస్ట్ యూనియన్ నాయకులు పి.రామచంద్రరావు, బి.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఐకేపీ వీవోఏల జీతాలు చెల్లించడంతో ప్రభుత్వ అలక్ష్యం, పోలీసుల అక్రమ అరెస్టులకు నిరసనగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. గోవిందరావును ఆదివారం ఉదయం ఐదుగంటలకు అరెస్టు చేసి తెల్లవారేదాకా ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. సోమవారం ఉదయం రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్టు టుటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడే ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని వీవోఏల ధర్నాను భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్ని అక్రమ అరెస్టులు చేరుుంచిందని ధ్వజమెత్తారు. ఇది ప్రజావ్యతిరేకమని పేర్కొన్నారు. వీవోఏల వ్యవస్థను తనే ప్రవేశపెట్టినట్టు చెప్పుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు వ్యవస్థను నాశనం చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని హెచ్చరించారు. ప్రజలు మద్దతుతో ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. జిల్లాలో అరెస్టు చేసిన వీవోఏలు, సీఐటీయూ నాయకులు, ప్రతినిధులందరినీ విడిచిపెట్టిన తర్వాత ఆయన దీక్షను విరమించారు.