అక్రమాల లెక్క తేలేనా? | illegal mining irregularities in Arasavalli | Sakshi
Sakshi News home page

అక్రమాల లెక్క తేలేనా?

Published Sun, Aug 12 2018 8:43 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

illegal mining irregularities in Arasavalli - Sakshi

అరసవల్లి:  శ్రీకాకుళం డివిజన్‌ మైనింగ్‌ అక్రమాల లెక్క తేల్చేందుకు రంగంలోకి దిగిన ఆడిట్‌ అధికారులకు దిమ్మదిగిరే అనుభవం ఎదురయ్యింది. ఈ నెల 6వ తేదీ నుంచి శుక్రవారం వరకు విశాఖపట్నంలో నిర్వహించిన మైనింగ్‌ ఆడిట్‌ ప్రక్రియకు కేవలం అభ్యంతరాలే తప్ప..అందుకు స్పందన దొరకక పోవడంతో సంబంధిత అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

 ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ముఖ్యంగా శ్రీకాకుళం డివిజన్‌లో గత కొన్నేళ్ల నుంచి బయటపడుతున్న మైనింగ్‌ అక్రమాల లెక్క సంగతి తేల్చేందుకు గనులశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విశాఖపట్నం డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయంలో ఆడిట్‌ ప్రక్రియను నిర్వహించారు. అయితే ఆడిట్‌ బృందానికి సమాధానం ఇచ్చే అధికారి ఒక్కరూ లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో కేవలం జిల్లా కేంద్ర డివిజన్‌లో జరిగిన మైనింగ్‌ పనులపై అభ్యంతరాలతో  అధికారులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

శ్రీకాకుళం డివిజన్‌ అధికారులంతా గైర్హాజరే..!
ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన మైనింగ్‌పై ఆడిట్‌ అధికార బృందం ఈనెల 6 నుంచి 10వ తేది వరకు డీడీ కార్యాలయంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. విశాఖ జిల్లాలో విశాఖపట్నం ఏడీ, డీడీ, అనకాపల్లి ఏడీ, విజిలెన్స్‌ కార్యాలయాలు, అలాగే విజయనగరం ఏడీ, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం ఏడీ, టెక్కలి ఏడీ కార్యాలయాల్లో గత కొన్నేళ్లుగా జరిగిన మైనింగ్‌ వ్యవహారాలపై ఆడిట్‌ను నిర్వహించారు.

 ఈ ప్రక్రియకు కచ్చితంగా ఆయా కార్యాలయాల అసిస్టెంట్‌ డైరెక్టర్లు (ఏడీ)తో పాటు కార్యాలయ సూపరింటెండెంట్‌తో సహా నాన్‌ టెక్నకల్‌ సిబ్బంది కూడా తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది. ఆడిట్‌ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలకు వెంటనే సమాధానాలను నివేదిక రూపంలో అధికార బృందానికి అందజేయాల్సి ఉంది. ఇదిలావుంటే ఈ ఆడిట్‌ అభ్యంతరాల అంశంలో స్పందించేందుకు శ్రీకాకుళం డివిజన్‌ అధికారులు మినహా మిగిలిన జిల్లాల డివిజన్ల అధికారులు హజరయ్యారు. దీంతో శ్రీకాకుళం డివిజన్‌ అధికారులపై ఆడిట్‌ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

87 అభ్యంతరాలకు సమాధానాలెక్కడ..?
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం డివిజన్‌లో మైనింగ్‌ అక్రమాలు పేట్రేగిపోతున్నాయన్న విమర్శలున్నాయి.  తాజాగా నిర్వహించిన ఆడిట్‌ కార్యక్రమానికి కూడా స్థానిక డివిజన్‌ అధికారులు గైర్హాజర్‌ కావడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, టెక్కలి డివిజన్లలో మైనింగ్‌ అక్రమాలకు అధికార పార్టీ నేతలు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు కొంద రు గనులశాఖ అధికారులు కూడా సహకరించడంతో అక్రమాలకు అడ్డూఆపు లేకుండా ఉన్నాయన్న విషయం ఇటీవల వంశధార నదికి వరదలు వచ్చినప్పుడు నిరూపితమైన సంగతి విదితమే. 

దీన్ని నిజం చేస్తున్నట్లుగా ఆడిట్‌ అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాల్సిన డివిజన్‌ స్థాయి అధికారులు, సిబ్బంది గానీ విశాఖ ఆడిట్‌ సమావేశాలకు హాజరుకాలేదు.  శ్రీకాకుళం డివిజన్‌లో మొత్తం మైనింగ్‌ అక్రమాలపై అనుమానాలను, సందేహా లను ఆడిట్‌ అధికారులు వ్యక్తం చేశారు. మొత్తం 87 అభ్యంతరాలను అధికారులు లేవనెత్తారు. అయితే ఒక్క అభ్యంతరానికి కూడా డివిజన్‌ అధికారులు సమాధానం ఇవ్వలేదని తెలిసింది.  శ్రీకాకుళం డివిజన్‌ అధికారుల నిర్లక్ష్యంపై ఆడిట్‌ అధికార బృందం, మైనింగ్‌ ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా నివేదిక పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలావుంటే ఆడిట్‌ అభ్యంతరాలపై సమాధానాలు సకాలంలో పంపుతారా..లేదా అన్నదానిపై స్పష్టత కొరవడింది. దీంతో మైనింగ్‌ అక్రమాల నిగ్గు తేలనుందా లేదా..అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకమే..!

త్వరలో నివేదికిస్తామన్నారు
ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇటీవల నిర్వహించిన ఆడిట్‌ ప్రక్రియలో శ్రీకాకుళం డివిజన్‌ ఏడీ హాజరుకాలేదు. అయితే శ్రీకాకుళంలో ఏడీగా తమ్మినాయుడు ఇటీవలే రీ జాయిన్‌ అయిన కారణంగా, త్వరలోనే ఆడిట్‌ అభ్యంతరాలకు సమాధానాలను అందజేస్తామని చెప్పారు. ఆడిట్‌ అభ్యంతరాలకు కచ్చితంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. 
– ఎన్‌ఆర్‌వి.ప్రసాద్,  డిప్యూటీ డైరెక్టర్‌ (విశాఖ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement