ఇసు‘కాసు’రులు | Illegal sand moving in Karnataka | Sakshi
Sakshi News home page

ఇసు‘కాసు’రులు

Published Mon, Jul 27 2015 2:44 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

ఇసు‘కాసు’రులు - Sakshi

ఇసు‘కాసు’రులు

- రూ.కోట్లు ఆర్జిస్తున్న వైనం
- ‘అనంత’లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
- పట్టించుకోని అధికారగణం
- కణేకల్లులో చీఫ్ విప్ కాలవఅనుచరుల బరితెగింపు
- అక్రమంగా ఇసుక తరలింపునకు సహకారం
- గ్రామస్తుల సమాచారంతో పోలీసుల దాడులు
- ఐదు టిప్పర్లు, రెండు లారీలు, జేసీబీ సీజ్
- 15 మంది అరెస్ట్
అనంతపురం టౌన్ :
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం రచ్చుమర్రి వద్ద ఉన్న వేదవతి హగిరి నుంచి కొన్నాళ్ల నుంచి ఇసుకను కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల హస్తం ఉంది. అయితే గత 15 రోజులుగా ఇసుక మాఫీయా రెచ్చిపోతోంది. ప్రతి రోజూ రాత్రి వేళల్లో ఇసుకను వాహనాల్లో లోడింగ్ చేసుకుని కర్ణాటకకు తరలిస్తోంది.

చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు అనుచరుల కనుసన్నల్లోనే ఈ తతంగమంతా సాగుతోంది.  రచ్చుమర్రి గ్రామం వద్ద శనివారం రాత్రి ఇసుకలోడింగ్ కోసం కర్నాటక నుండి ఐదు టిప్పర్లు, రెండు లారీలు వచ్చాయి. ముందుగా కుదుర్చుకొన్న ఒప్పందం మేరకు కొంత మంది టీడీపీ నేతలు ఇసుకలోడింగ్ కోసం ఒక జేసీబీని అక్కడికి పంపారు.

ఐదు వాహనాల్లో జేసీబీ ఇసుక లోడ్ చేసింది. అంతలోనే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు కళ్యాణదుర్గం డీఏస్పీ అనిల్‌పులిపాటికి ఫోన్ చేసి చెప్పారు. డీఎస్పీ ఆదేశాల మేరకు కణేకల్లు ఇన్‌చార్జ్ ఏస్‌ఐ బీ.శేఖర్, సిబ్బందితో హూటాహుటిన అక్కడికి చేరుకొన్నారు. ఘటన స్థలంలో ఉన్న లారీలు, టిప్పర్లు (కేఏ-16 బీ2617, కేఏ-27 బీ-1783, కేఏ-17 4655, కేఏ-17 సీ-4383, కేఏ-27 బీ-3455, కేఏ-27 బీ1998, కేఏ-17 సీ8343)  సీజ్ చేశారు. వీటితో పాటు జేసీబీ (ఏపీ02 క్యూ 485)ని కూడా సీజ్ చేశారు.

జేసీబీ డ్రై వర్ వన్నూరుస్వామితోపాటు కర్ణాటక ట్రిప్పర్, లారీ డ్రైవర్లు, క్లీనర్లు జేడీ మంజప్ప, వజీర్‌బాషా, గౌస్‌ఆజీం, లింగరాజు, చిన్‌బసప్ప, బసవరాజు, మల్లేష్, పరుశరాం, తోఫిక్, బాబా, సునిల్, రవీ, దుర్గప్ప, ఉజ్జప్పలను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి మంజప్ప తప్పించుకొన్నట్లు ఏస్‌ఐ తెలిపారు. ఈ ప్రాంతంలోని ఇసుకను కర్ణాటకలోని బెంగళూరు, దావణిగెర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. ఇసుక మాఫీయాలో పలువురి హస్తం ఉన్నట్లు తెల్సిందని, విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.   
 
‘అనంత’లో పెట్రేగుతున్న తెలుగుతమ్ముళ్లు
అనంతపురం జిల్లాలో ఇసుక రీచ్‌లు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. బెంగుళూరు, బళ్లారి, హైదరాబాద్‌లకు ఇసుక తరలించడానికి జిల్లా అనుకూలంగా ఉండడంతో ఇదే అదునుగా మాఫియా రెచ్చిపోతోంది. పేరుకు స్వయం సహాయక సంఘాల సభ్యులు రీచ్‌లను నిర్వహిస్తున్నారని చెబుతున్నా ‘ఇసుక కథ’ నడిపిస్తోందంతా టీడీపీ నేతలే కావడం గమనార్హం. జిల్లాలో 18 చోట్ల మహిళా సంఘాల ద్వారా ఇసుక విక్రయాలు చేపడుతున్నారు.

ప్రధానంగా పెన్నానది పరివాహక ప్రాంతాలైన శింగనమల నియోజకవర్గంలోని ఉల్లికల్లు, తాడిపత్రి నియోజకవర్గంలోని చిన్న ఎక్కలూరు, చిత్రావరి పరివాహక ప్రాంతాలైన ధర్మవరం నియోజకవర్గంలోని చిన్న చిగుళ్లరేవు రీచ్‌లలో నాణ్యమైన ఇసుక లభిస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో చెరువుల్లో పైనున్న బంకమట్టిని తొలగించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. అయితే ఇటీవల క్వాలిటీ ఇసుక దొరుకుతున్న మూడు ఇసుక రీచ్‌లను బంద్ చేశారు. ఉల్లికల్లు, చిన్న ఎక్కలూరు ఇసుక రీచ్‌లలో అక్రమాలు జరుగుతన్నాయన్న ఆరోపణలు వచ్చాయి.

దీనికి తోడు చాగళ్లు ప్రాజెక్ట్‌కు హంద్రీనీవా నీటిని విడుదల చేయడంతో ఇసుక రీచ్‌లో రవాణా లేకుండాపోయింది. డంప్ కేంద్రాలను తొలగించి నేరుగా ఇసుక రీచ్ నుంచి ఇసుక విక్రయాలు చేపట్టాలన్న ఆదేశాల నేపథ్యంలో ర్యాంప్ నిర్మాణం కోసం చిన్న చిగుళ్లరేవు ఇసుక రీచ్‌ను బంద్ చేశారు. ప్రస్తుతం హిందూపురంలో కుముద్వతి ప్రాజెక్ట్, గుత్తి, కదిరి ప్రాంతాల్లోని చెరువుల్లో మాత్రమే ఇసుక విక్రయాలు సాగుతున్నాయి. మిగిలిన చోట్ల పెద్దగా ఇసుక విక్రయాలు జరగడం లేదు. ఇసుక విక్రయాలు ప్రారంభించినప్పటి నుంచి ఒక్క ఉల్లికల్లు ఇసుకరీచ్‌లోనే రూ.

కోటి విలువైన ఇసుక దారిమళ్ళిందనే ఆరోపణలు ఉన్నాయంటే ఇక్కడి తెలుగుతమ్ముళ్లు ఎంతగా బరితెగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ రీచ్‌లో అనంతపురానికి చెందిన ఓ నేత దగ్గర బంధువు, పెరవళికి చెందిన ఓ వ్యక్తి ప్రమేయంతో రూ.కోటి విలువైన ఇసుక దారిమళ్లిందన్న ఆరోపణలున్నాయి. చిన్న ఎక్కలూరులో ఓ టీడీపీ ముఖ్యనేత అనుచరుడు.. చిన్న చిగుళ్ళరేవులో రీచ్‌ను ఓ ప్రజాప్రతినిధి బినామీలతో నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.  
 
రోజుకు రూ.లక్షల్లో ఆదాయం
జిల్లాలో ప్రధానంగా పెనుకొండ, హిందూపురం, ధర్మవరం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో ఇసుకమాఫియా జోరందుకుంది. ఒక టిప్పర్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్ముకుంటూ రూ.లక్షలు గడిస్తున్నారు. స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రోజుకు రూ.10 లక్షల వరకు ఆదాయం గడిస్తున్నారు. ఒక్కొక్కరు సుమారు 10 టిప్పర్ల వరకు సరిహద్దులు దాటిస్తున్నట్లు సమాచారం.  
 
‘పచ్చ’ నేతలకు సిబ్బంది సహకారం
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే ‘పచ్చ’ నేతలకు సహకరిస్తుండడంతో ఇక వారు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. మామూళ్ల మత్తుకు తోడు అధికార పార్టీ నేతలన్న భయంతో చాలా మంది ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఒక వేళ పట్టుకుంటే ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో తమకెందుకొచ్చిందిలేనంటూ మిన్నకుండిపోతున్నారు.
 
‘సాక్షి’ కథనాలతో క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం
జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో ఉన్న ఉల్లికల్లురీచ్‌లో భారీగా అక్రమాలు జరగడంతో సాక్షి వరుస కథనాలు ప్రచురించింది. దీంతో కలెక్టర్ కోనశశిధర్ స్పందించి శింగనమల ఏపీఎం రాజశేఖర్‌ను సస్పెండ్ చేయగా పామిడి ఏరియా కో ఆర్డినేటర్ శ్రీనివాసులకు షోకాజ్ ఇచ్చారు. దీనిపై అనంతపురం ఆర్‌డీఓ హుస్సేన్‌సాహేబ్ విచారణ చేశారు. నివేదిక అందుకున్న కలెక్టర్ కోన శశిధర్.. 15 మంది అక్రమార్కులను గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement