4,46,500 విలువైన బియ్యం సీజ్
200 క్వింటాళ్ల అక్రమ నిల్వల గుర్తింపు
బూర్జ: రైస్ మిల్లులపై జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ కొరడా ఝుళిపించారు. శుక్రవారం సాయంత్రం ఆయన బూర్జ మండలం సింగన్నపాలెంలోని శ్రీవెంకటేశ్వర రైస్ మిల్లుపై ఆకస్మికంగా దాడి చేశారు. మిల్లులోని నిల్వలను పరిశీలించారు. తేడా ఉన్నట్లు గుర్తించి పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదకను అందజేయాలని డీఎస్‌వో సిహెచ్.ఆనంద్‌కుమార్‌కు ఆదేశించారు. అయితే రికార్డులు ఈ నెల 7వ తేదీ వరకే ఉన్నట్లు, అదీ ఇష్టానుసారం రాసినట్లు డీఎస్‌వో గుర్తించారు. మిల్లు యజమాని బుడుమూరు ఉర్మిళాదేవి లేకపోవటంతో ఆమె భర్త వెంకటసత్యనారాయణ, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు.
మిల్లులో ధాన్యం, బియ్యం, నూకలు నిల్వల్లో తేడాలను గుర్తించారు. రికార్డుల్లో నమోదు చేయకుండా 200 క్వింటాళ్ల బియ్యం, 5 క్వింటాళ్ల నూకలు నిల్వ చేసినట్లు గుర్తించి సీజ్ చేశారు. వీటి విలువ *4,46,500 ఉంటుందని అందచనా వేశారు. అలాగే 96 క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యం, 172.75 క్వింటాల్ల ప్రభుత్వ బియ్యం కూడా నిల్వ ఉన్నాయని లెక్క తేల్చారు. ప్రభుత్వ బియ్యం, ధాన్యం ఫిభ్రవరి నెలలో మిల్లుకు చేరాయని వీటిని ఎప్పటికప్పుడే సివిల్ సప్లై కార్యాలయానికి తెలియజేయాలన్నారు. అయితే ఏ సమాచారం కూడా తమకు తెలియజేయలేదన్నారు. ఈ సోదాలో తహశీల్దార్ బాబ్జీరావు, ఆర్‌ఐలు సత్యవతి, వెంకటరమణ, వీఆర్‌వోలు వేపారి లక్ష్మీనారాయణ, జడ్డు నీలకంఠం, జడ్డు ప్రకాష్, చొక్కర ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బకాయి ఉన్న రైస్ మిల్లులు సీజ్ చేస్తాం
ఆమదాలవలస: బకాయి ఉన్న రైస్ మిల్లులను సీజ్‌చేసి రికవరీకి వేలం వేస్తామని జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ మిల్లు యజమానులను హెచ్చరించారు. ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధి సత్యనారాయణ రైస్ మిల్లును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గతంలో సత్యనారాయణ, పద్మాలయ ైరె స్ మిల్లులు వరుసగా *40 లక్షల,*15 లక్షలు బాకాయి ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని నోటీసు పంపించినా యాజమాన్యాలు స్పదించకపోవడంతో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చామన్నారు.
సత్యనారాయణ మిల్లు యజమాని రెండు సంవత్సరాలుగా లావాదేవిలు చేయడంలేదని, ఆ మిల్లు ఆంధ్రా బ్యాంక్ లో కూడా రుణంపొందిందని, ఆ రుణం చెల్లించకపోవడంతో మిల్లుకు సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదే శించారు. దీంతో అధికారులు సత్యనారాయణ రైస్ మిల్లు గోదాంకు తాళాలను వేశారు. ఆర్‌ఆర్ యాక్టు కింద కేసు నమోదు చేసి మిల్లును వేలం వేసి రికవరీ చేస్తామని జేసీ తెలిపారు. పద్మాలయ యజమాని క్యాంపులో ఉండడంతో తనిఖీ చేయలేకపోయారు. దీంతో మిల్లుకు తాళాలు వేశారు. యజమాని సమక్షంలో తనిఖీలు చేస్తామని తహశీల్దార్ శ్రీరాములు చెప్పారు. ఈ దాడిలో సివిల్ సప్లైస్ డీఎం లోక్‌మోహన్, వీఆర్వో కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
రైస్ మిల్లుపై జేసీ కొరడా
Published Sat, Jul 12 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM
Advertisement