veera pandyan
-
కర్నూలులో లక్ష దాటిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు
సాక్షి, నంద్యాల: జిల్లాలో సోమవారం నాటికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు మొదలై 100 రోజులు పూర్తయాయి. దాంతోపాటు కర్నూలు వ్యాప్తంగా నేటి వరకు లక్షా ఐదు వేల కరోనా పరీక్షలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రఘు బాబు, సహాయ కార్యదర్శి మదన్ మోహన్, శ్రీనివాసులు, కర్నూల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు జీ.వి సతీష్, రజాక్, ఇతర ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ కట్టడిలో ట్రూనాట్ ల్యాబ్స్, వీర్‌డీఎల్ ల్యాబ్స్ అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్ల కృషిని ఈ సందర్బంగా పలువురు కొనియాడారు. అంతేకాకుండా కరోనా కట్టడిలో భాగంగా పెద్ద ఎత్తున ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి కర్నూల్ జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ తీసుకున్న నిర్ణయాలను జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ల తరుపున రఘు బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏప్రిల్ 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 56 ట్రూ నాట్ ల్యాబ్‌లలో, మరో 20 వరకు వీర్‌ఆర్‌డీఎల్ ల్యాబ్‌లలో ల్యాబ్ టెక్నీషియన్లు నిర్విరామంగా కోవిడ్ నిర్థారణ పరీక్షల్లో భాగస్వాములై ఉన్నారు.ఇప్పటికి దాదాపు ప్రతి జిల్లాలో కొందరు ల్యాబ్ టెక్నీషియన్లు కరోనా బారిన పడినప్పటికి కోలుకున్న తరువాత తిరిగి విధులకు సిద్ధంగా ఉన్నారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ సునీతతో ల్యాబ్ టెక్నీషియన్లు -
కర్నూలు ఆసుపత్రి చరిత్రలో మరో మైలురాయి
సాక్షి, కర్నూలు : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మరో మైలురాయిని చేరుకుంది. ఆసుపత్రి చరిత్రలో, రాయలసీమలోనే తొలిసారిగా ఓ రోగికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. కర్నూలు మెడికల్ కాలేజీ మొదటి బ్యాచ్ విద్యార్థి, ఉస్మానియా ఆసుపత్రి యురాలజీ విభాగం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ విక్రమసింహారెడ్డి, నిమ్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్యప్రకాష్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సను ఆసుపత్రి యురాలజీ హెచ్‌వోడీ డాక్టర్ భగవాన్, ప్రొఫెసర్ డాక్టర్ సీతారామయ్య విజయవంతంగా చేశారు. స్వయాన యురాలజిస్ట్ అయిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ కూడా పాల్గొని సహాయ సహకారాలు అందించడం విశేషం. వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు (24)కు రెండు కిడ్నీలు పాడైపోయాయి. కిడ్నీ మార్పిడి తప్పనిసరని వైద్యులు చెప్పారు. పెద్దాసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు జీవన్‌దాన్ ట్రస్ట్ నుంచి ఏడాది క్రితం అనుమతి లభించింది. దీంతో రామాంజనేయులు పేరును రిజిష్టర్ చేయించారు. అతనికి కిడ్నీ ఇవ్వడానికి తల్లి బజారమ్మ ముందుకు వచ్చింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కలిపి మొత్తం 35 మందితో కూడిన బృందం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిరంతరాయంగా శ్రమించి ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. పెద్దాసుపత్రి చరిత్రలో గొప్ప అధ్యాయం : కలెక్టర్ పెద్దాసుపత్రి చరిత్రలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఒక గొప్ప అధ్యాయమని, ఆసుపత్రి మరో మైలురాయిని చేరుకుందని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ప్రశంసించారు. సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్యులను, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ గురించి తెలుసుకుని చాలా గర్వపడ్డానన్నారు. ఇది నిజంగా ఆసుపత్రి చరిత్రలో గొప్ప లక్ష్యసాధనగా పేర్కొన్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత ఒక ఏడాది వరకు అవసరమైన మందులను జిల్లా కలెక్టర్ నిధుల నుంచి ఇస్తానని ప్రకటించారు. ఒక్క ఆపరేషన్‌తో ఆపకూడదని, ఇకపై మరిన్ని ఆపరేషన్లు చేయాలని వైద్యులను ప్రోత్సహించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని రకాల వైద్యసేవలు అందించగలిగే వైద్యులు ఇక్కడ ఉన్నారని కొనియాడారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, నెఫ్రాలజీ హెచ్‌వోడీ డాక్టర్ పీఎన్ జిక్కి, యురాలజీ హెచ్‌వోడీ డాక్టర్ భగవాన్, ప్రొఫెసర్ డాక్టర్ సీతారామయ్య, అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ రఘురామ్, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు. డాక్టర్ సూర్యప్రకాష్‌కు సన్మానం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో తొలిసారిగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయడంలో సహకరించిన నిమ్స్ యురాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ బి.సూర్యప్రకాష్‌ను సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగడం కర్నూలుకే గర్వకారణమని క్లబ్ జిల్లా చైర్మన్ ఎన్.వెంకటరామరాజు అన్నారు. కార్యక్రమంలో క్లబ్ మాజీ గవర్నర్లు ఎస్.నాగేశ్వర్రావు, డాక్టర్ జి.బాలమద్దయ్య, సభ్యులు రమణగౌడ్, బోస్ పాల్గొన్నారు. 30 ఏళ్ల కల నెరవేరింది నేను కర్నూలు మెడికల్ కాలేజీ మొదటి బ్యాచ్ విద్యార్థిని. మా చేరికతోనే ఈ ఆసుపత్రి జనరల్ ఆసుపత్రిగా మారింది. 1971లో నా ఆధ్వర్యంలో ఇక్కడ యురాలజీ విభాగం ప్రారంభమైంది. అప్పట్లో రాయలసీమలోనే నేను మొదటి యురాలజిస్టు. అప్పట్లోనే ఒక రోగికి డయాలసిస్ ప్రారంభించాం. 30 ఏళ్ల క్రితమే నేను ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ప్రారంభించాలని భావించా. అయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పిలిపించి ఉస్మానియాలో ఉంచారు. 30 ఏళ్ల తర్వాత నా కల నెరవేరింది. నా ఆధ్వర్యంలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగడం ఆనందంగా ఉంది. – డాక్టర్ ఎ.విక్రమసింహారెడ్డి, ఉస్మానియా ఆసుపత్రి రిటైర్డ్ ప్రొఫెసర్ -
తహశీల్దార్‌తోపాటూ ఏడుగురిపై సస్పెన్షన్ వేటు
సాక్షి, అనంతపురం : భూ అక్రమాలపై కలెక్టర్ వీరపాండ్యన్ సీరియస్ అయ్యారు. కూడేరు తహశీల్దార్ వసంత లతతో సహా ఏడుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. డబ్బు తీసుకొని ప్రభుత్వ భూములకు ఇష్టారాజ్యంగా కూడేరు రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేశారు. విచారణలో నిజాలు నిగ్గు తేలటంతో అక్రమార్కులపై కలెక్టర్ వేటు వేశారు. -
నేడు విధులకు నూతన కలెక్టర్
అనంతపురం అర్బన్ : జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన జి.వీరపాండియన్ సోమవారం విధులకు హాజరుకానున్నారు. ఆదివారం రాత్రి ఆలస్యంగా జిల్లాకు చేరుకున్న ఆయన... కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. జిల్లా కలెక్టర్‌గా ఉన్న శశిధర్‌ను గుంటూరు కలెక్టర్‌గా, విజయవాడ మున్సిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న వీర పాండియన్‌ను జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించిన విషయం విధితమే. ఈ నెల 20న జిల్లా పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబుతో పాటు నూతన కలెక్టర్ వీరపాండియన్ పాల్గొన్నారు. అదే రోజు రాత్రి ఆయన తిరిగి విజయవాడ వెళ్లారు. -
24న వీర పాండియన్ బాధ్యతల స్వీకరణ!
అనంతపురం అర్బన్ : జిల్లా నూతన కలెక్టర్‌గా వీరపాండియన్ ఈ నెల 24న బాధ్యతలు స్వీకరించవచ్చని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన్ను ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌గా నియమించిన విషయం విదితమే. ఈ నెల 20న ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో పాల్గొన్న వీరపాండియన్ అదే రోజు విజయవాడకు తిరిగి వెళ్లారు. శనివారం విజయవాడ కార్పొరేషన్లో రిలీవ్ అవుతారని సమాచారం. జిల్లా కలెక్టర్‌గా ఆయన ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారనే విషయంపై ఇప్పటి వరకు సమాచారం లేదని, అయితే.. 24న విధుల్లో చేరే అవకాశాలు ఉన్నాయని కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. కోన శశిధర్ రిలీవ్ కలెక్టర్ కోనశశిధర్ శుక్రవారం రిలీవ్ అయ్యారు. ఆయన్ను గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. శనివారం గుంటూరులో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఆయనకు జిల్లా అధికారులు, అన్ని శాఖల సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. -
తహశీల్దార్ల నిరసన గళం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిపాలనకు కేంద్ర స్థానమైన కలెక్టరేట్లో కలకలం రేగింది. కీలకమైన రెవెన్యూ సర్వీసుల సంఘం, తహశీల్దార్ల నిరసన, బహిష్కరణలతో పరి స్థితి గందరగోళంగా మారింది. జాయింట్ కలెక్టర్ వ్యవహారశైలిపై రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు విరుచుకుపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉన్నతాధికారులు చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. జాయింట్ కలెక్టర్ వీర పాండ్యన్ ఇటీవల వ్యవహరిస్తున్న తీరు, సిబ్బందిని వేధింపులకు గురిచేయడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా రెవెన్యూ సంఘం ఆధ్వర్యంలో తహశీ ల్దార్లు శుక్రవారం నిరసనకు దిగారు. నెలవారీగా జరగాల్సిన రెవెన్యూ ఆఫీసర్స్(ఆర్ఓ) సమావేశాన్ని సైతం బహిష్కరించారు. ఫలితంగా ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్ దద్దరిల్లింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు మొదట జేసీ, తర్వాత డీఆర్వో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఇలా మొదలైంది.. తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, తదితర రెవెన్యూ అధికారులతో జరిపే నెలవారీ సమీక్షా సమావేశం శుక్రవారం జరగాల్సి ఉంది. దాని కోసం ఉదయం తహశీల్దార్లందరూ కలెక్టరేట్‌కు వచ్చినా.. సమావేశ హాలులోకి మాత్రం వెళ్లలేదు. ఇటీవల జరిగిన జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో వేధింపులు, ఒత్తిళ్లు తగ్గేవరకు సమావేశాలకు హజరుకారాదని నిర్ణయించుకున్నారు. రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా శాఖ ఆధ్యక్షుడు ఎం.కాళీప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖలో పని ఒత్తిడి చాలా పెరిగిందని, దీనికి తోడు తగిన సౌకర్యాలు కల్పించకుండా జాయింట్ కలెక్టర్ మరింత ఒత్తిడి పెంచుతున్నారని, సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారని, దీని వల్ల ఉద్యోగుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ఉద్యోగులు తమ కుటుంబాలను చూసుకొనేందుకు కూడా సమయం ఉండడంలేదని అన్నారు. ఈ సమస్యలు వివరించినా పట్టించుకోనే స్థితిలో జేసీ లేరని ఆరోపించారు. సస్పెండ్ చేస్తామని బెదిరించడం, కొందరిపై చర్యలు తీసుకోవడం వల్ల సమాజంలో తహశీల్దార్లకు గౌరవం తగ్గుతోందన్నారు. ఈ విషయమై జేసీతో చర్చించగా, సమస్యల గురించి లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచించారే తప్ప పరిష్కారం గురించి మాట్లాడలేదని, అందుకే ఆర్ఓ సమావేశాన్ని బిహ ష్కరిస్తున్నామని చెప్పారు. రెవిన్యూ సర్వీసుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జె రామారావు మాట్లాడుతూ వీఆర్ఎ నుంచి తహశీల్దారు వరకు జేసీ కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారన్నారు. పలు తహశీల్దారు కార్యాలయాల్లో సరిపడినన్ని కంప్యూటర్లు లేవన్నారు. సిబ్బంది కొరత ఉందని, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు లేవని, నెట్ సర్వీసు, విద్యుత్ కోతలు, ఇతర ఇబ్బందులు ఉన్నాయన్నారు. వీటిని పరిష్కరించకుండా ఒత్తిడి పెంచడం తగదన్నారు. ఆవసరమైతే రాష్ట్ర రెవిన్యూ సంఘం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒత్తిడి దీనిపై జేసీ వద్ద ప్రస్తావించగా పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయించాలన్న ఉద్దేశంతో కఠినంగా వ్యవహరిస్తున్నాను తప్ప వారిపై కోసం కాదని, రెవె న్యూ సిబ్బంది అంటే తనవారేనని అన్నారు. సాయంత్రం మరోసారి చర్చలు రెవిన్యూ సర్వీసుల సంఘం ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ శుక్రవారం సాయంత్రం మరోసారి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో 20 రకాల సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు జేసీ దృష్టికి తీసుకువెళ్లారు. తన పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని, మిగిలిన వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని జేసీ హామీ ఇచ్చారు. దీంతో తాత్కలికంగా తహశీల్దార్లు నిరసన విరమించుకున్నారు. ఈ సమావేశంలో డీఆర్ఓ నూర్‌బాషా కాశీం, ఆర్డీవోలు జి.గణేష్‌కుమార్, శ్యాంప్రసాద్, తేజ్ భరత్‌లు, రెవెన్యూ సంఘం ప్రతనిధులు పాల్గొన్నారు. టెక్కలి ఆర్డీవోకు జేసీ మందలింపు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చాంబర్ వద్ద విడియో చిత్రీకరిస్తున్న ఒక న్యూస్ చానల్ కెమెరాను లాక్కునేందుకు టెక్కలి ఆర్డీవో శ్యామ్‌ప్రసాద్ ప్రయత్నించారు. జర్నలిస్టులు దీనికి నిరసన వ్యక్తం చేయగా అక్కడే ఉన్న శ్రీకాకుళం ఆర్డీవో జోక్యం చేసుకుని క సముదాయించారు. అనంతరం జేసీ చాంబర్‌కు వెళ్లిన తర్వాత కూడా టెక్కలి ఆర్డీవో మిడియాపై చిందులు తొక్కుతుండగా జర్నలిస్టుల జోలికి వెల్లద్దని, వివాదాలు వద్దని జేసీ వీరపాండ్యన్ ఆయన్ను మందలించారు. -
రైస్ మిల్లుపై జేసీ కొరడా
4,46,500 విలువైన బియ్యం సీజ్ 200 క్వింటాళ్ల అక్రమ నిల్వల గుర్తింపు బూర్జ: రైస్ మిల్లులపై జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ కొరడా ఝుళిపించారు. శుక్రవారం సాయంత్రం ఆయన బూర్జ మండలం సింగన్నపాలెంలోని శ్రీవెంకటేశ్వర రైస్ మిల్లుపై ఆకస్మికంగా దాడి చేశారు. మిల్లులోని నిల్వలను పరిశీలించారు. తేడా ఉన్నట్లు గుర్తించి పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదకను అందజేయాలని డీఎస్వో సిహెచ్.ఆనంద్‌కుమార్‌కు ఆదేశించారు. అయితే రికార్డులు ఈ నెల 7వ తేదీ వరకే ఉన్నట్లు, అదీ ఇష్టానుసారం రాసినట్లు డీఎస్వో గుర్తించారు. మిల్లు యజమాని బుడుమూరు ఉర్మిళాదేవి లేకపోవటంతో ఆమె భర్త వెంకటసత్యనారాయణ, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. మిల్లులో ధాన్యం, బియ్యం, నూకలు నిల్వల్లో తేడాలను గుర్తించారు. రికార్డుల్లో నమోదు చేయకుండా 200 క్వింటాళ్ల బియ్యం, 5 క్వింటాళ్ల నూకలు నిల్వ చేసినట్లు గుర్తించి సీజ్ చేశారు. వీటి విలువ *4,46,500 ఉంటుందని అందచనా వేశారు. అలాగే 96 క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యం, 172.75 క్వింటాల్ల ప్రభుత్వ బియ్యం కూడా నిల్వ ఉన్నాయని లెక్క తేల్చారు. ప్రభుత్వ బియ్యం, ధాన్యం ఫిభ్రవరి నెలలో మిల్లుకు చేరాయని వీటిని ఎప్పటికప్పుడే సివిల్ సప్లై కార్యాలయానికి తెలియజేయాలన్నారు. అయితే ఏ సమాచారం కూడా తమకు తెలియజేయలేదన్నారు. ఈ సోదాలో తహశీల్దార్ బాబ్జీరావు, ఆర్ఐలు సత్యవతి, వెంకటరమణ, వీఆర్వోలు వేపారి లక్ష్మీనారాయణ, జడ్డు నీలకంఠం, జడ్డు ప్రకాష్, చొక్కర ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బకాయి ఉన్న రైస్ మిల్లులు సీజ్ చేస్తాం ఆమదాలవలస: బకాయి ఉన్న రైస్ మిల్లులను సీజ్‌చేసి రికవరీకి వేలం వేస్తామని జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ మిల్లు యజమానులను హెచ్చరించారు. ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధి సత్యనారాయణ రైస్ మిల్లును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గతంలో సత్యనారాయణ, పద్మాలయ ైరె స్ మిల్లులు వరుసగా *40 లక్షల,*15 లక్షలు బాకాయి ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని నోటీసు పంపించినా యాజమాన్యాలు స్పదించకపోవడంతో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చామన్నారు. సత్యనారాయణ మిల్లు యజమాని రెండు సంవత్సరాలుగా లావాదేవిలు చేయడంలేదని, ఆ మిల్లు ఆంధ్రా బ్యాంక్ లో కూడా రుణంపొందిందని, ఆ రుణం చెల్లించకపోవడంతో మిల్లుకు సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదే శించారు. దీంతో అధికారులు సత్యనారాయణ రైస్ మిల్లు గోదాంకు తాళాలను వేశారు. ఆర్ఆర్ యాక్టు కింద కేసు నమోదు చేసి మిల్లును వేలం వేసి రికవరీ చేస్తామని జేసీ తెలిపారు. పద్మాలయ యజమాని క్యాంపులో ఉండడంతో తనిఖీ చేయలేకపోయారు. దీంతో మిల్లుకు తాళాలు వేశారు. యజమాని సమక్షంలో తనిఖీలు చేస్తామని తహశీల్దార్ శ్రీరాములు చెప్పారు. ఈ దాడిలో సివిల్ సప్లైస్ డీఎం లోక్‌మోహన్, వీఆర్వో కిరణ్ తదితరులు పాల్గొన్నారు.