శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిపాలనకు కేంద్ర స్థానమైన కలెక్టరేట్‌లో కలకలం రేగింది. కీలకమైన రెవెన్యూ సర్వీసుల సంఘం, తహశీల్దార్ల నిరసన, బహిష్కరణలతో పరి స్థితి గందరగోళంగా మారింది. జాయింట్ కలెక్టర్ వ్యవహారశైలిపై రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు విరుచుకుపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉన్నతాధికారులు చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు.
జాయింట్ కలెక్టర్ వీర పాండ్యన్ ఇటీవల వ్యవహరిస్తున్న తీరు, సిబ్బందిని వేధింపులకు గురిచేయడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా రెవెన్యూ సంఘం ఆధ్వర్యంలో తహశీ ల్దార్లు శుక్రవారం నిరసనకు దిగారు. నెలవారీగా జరగాల్సిన రెవెన్యూ ఆఫీసర్స్(ఆర్‌ఓ) సమావేశాన్ని సైతం బహిష్కరించారు. ఫలితంగా ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్ దద్దరిల్లింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు మొదట జేసీ, తర్వాత డీఆర్‌వో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.
ఇలా మొదలైంది..
తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, తదితర రెవెన్యూ అధికారులతో జరిపే నెలవారీ సమీక్షా సమావేశం శుక్రవారం జరగాల్సి ఉంది. దాని కోసం ఉదయం తహశీల్దార్లందరూ కలెక్టరేట్‌కు వచ్చినా.. సమావేశ హాలులోకి మాత్రం వెళ్లలేదు. ఇటీవల జరిగిన జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో వేధింపులు, ఒత్తిళ్లు తగ్గేవరకు సమావేశాలకు హజరుకారాదని నిర్ణయించుకున్నారు.
రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా శాఖ ఆధ్యక్షుడు ఎం.కాళీప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖలో పని ఒత్తిడి చాలా పెరిగిందని, దీనికి తోడు తగిన సౌకర్యాలు కల్పించకుండా జాయింట్ కలెక్టర్ మరింత ఒత్తిడి పెంచుతున్నారని, సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారని, దీని వల్ల ఉద్యోగుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు.
ఉద్యోగులు తమ కుటుంబాలను చూసుకొనేందుకు కూడా సమయం ఉండడంలేదని అన్నారు. ఈ సమస్యలు వివరించినా పట్టించుకోనే స్థితిలో జేసీ లేరని ఆరోపించారు. సస్పెండ్ చేస్తామని బెదిరించడం, కొందరిపై చర్యలు తీసుకోవడం వల్ల సమాజంలో తహశీల్దార్లకు గౌరవం తగ్గుతోందన్నారు. ఈ విషయమై జేసీతో చర్చించగా, సమస్యల గురించి లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచించారే తప్ప పరిష్కారం గురించి మాట్లాడలేదని, అందుకే ఆర్‌ఓ సమావేశాన్ని బిహ ష్కరిస్తున్నామని చెప్పారు.
రెవిన్యూ సర్వీసుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జె రామారావు మాట్లాడుతూ వీఆర్‌ఎ నుంచి తహశీల్దారు వరకు జేసీ కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారన్నారు. పలు తహశీల్దారు కార్యాలయాల్లో సరిపడినన్ని కంప్యూటర్లు లేవన్నారు. సిబ్బంది కొరత ఉందని, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు లేవని, నెట్ సర్వీసు, విద్యుత్ కోతలు, ఇతర ఇబ్బందులు ఉన్నాయన్నారు. వీటిని పరిష్కరించకుండా ఒత్తిడి పెంచడం తగదన్నారు. ఆవసరమైతే రాష్ట్ర రెవిన్యూ సంఘం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒత్తిడి
దీనిపై జేసీ వద్ద ప్రస్తావించగా పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయించాలన్న ఉద్దేశంతో కఠినంగా వ్యవహరిస్తున్నాను తప్ప వారిపై కోసం కాదని, రెవె న్యూ సిబ్బంది అంటే తనవారేనని అన్నారు.
సాయంత్రం మరోసారి చర్చలు
రెవిన్యూ సర్వీసుల సంఘం ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ శుక్రవారం సాయంత్రం మరోసారి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో 20 రకాల సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు జేసీ దృష్టికి తీసుకువెళ్లారు. తన పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని, మిగిలిన వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని జేసీ హామీ ఇచ్చారు. దీంతో తాత్కలికంగా తహశీల్దార్లు నిరసన విరమించుకున్నారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ నూర్‌బాషా కాశీం, ఆర్డీవోలు జి.గణేష్‌కుమార్, శ్యాంప్రసాద్, తేజ్ భరత్‌లు, రెవెన్యూ సంఘం ప్రతనిధులు పాల్గొన్నారు.
టెక్కలి ఆర్డీవోకు జేసీ మందలింపు
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చాంబర్ వద్ద విడియో చిత్రీకరిస్తున్న ఒక న్యూస్ చానల్ కెమెరాను లాక్కునేందుకు టెక్కలి ఆర్‌డీవో శ్యామ్‌ప్రసాద్ ప్రయత్నించారు. జర్నలిస్టులు దీనికి నిరసన వ్యక్తం చేయగా అక్కడే ఉన్న శ్రీకాకుళం ఆర్డీవో జోక్యం చేసుకుని క సముదాయించారు. అనంతరం జేసీ చాంబర్‌కు వెళ్లిన తర్వాత కూడా టెక్కలి ఆర్డీవో మిడియాపై చిందులు తొక్కుతుండగా జర్నలిస్టుల జోలికి వెల్లద్దని, వివాదాలు వద్దని జేసీ వీరపాండ్యన్ ఆయన్ను మందలించారు.
తహశీల్దార్ల నిరసన గళం
Published Sat, Aug 23 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM
Advertisement
Advertisement