కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే టెండర్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇతర జిల్లాల్లో లేని నిబంధనలు ఇక్కడ అమలు చేసి కాంట్రాక్టును పెద్దలకు కట్టబెట్టారనే ప్రచారం జరుగుతోంది. వచ్చిన టెండర్లలో అధిక శాతం నిబంధనల మేరకు లేవని అనర్హత వేటు వేయడం ద్వారా కాంట్రాక్టును అయిన వారికి కట్టబెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,400 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 3,165, పట్టణ ప్రాంతాల్లో 369 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటిలో 31,143 మంది గర్భిణిలు, 42,412 మంది బాలింతలు.. 3,07, 889 మంది పిల్లలు నమోదయ్యారు.
వీరందరికీ పౌష్టికాహారంతో పాటు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉడకబెట్టిన గుడ్లను అందించాల్సి ఉంది. దీంతో గుడ్ల సరఫరాకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి యేటా టెండర్లు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కర్నూలు, ఆదోని, నంద్యాల డివిజన్లకు టెండర్లు పిలిచారు. వీటిని దక్కించుకునేందుకు కర్నూలుతో పాటు విజయవాడ, విశాఖపట్టణం, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి సైతం కాంట్రాక్టర్లు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 58 దరఖాస్తులు అమ్ముడవగా.. ఈ నెల 18న జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు సమక్షంలో టెండర్లు నిర్వహించారు. ఇదిలాఉండగా అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను సరఫరా చేసేందుకు నేషనల్ ఎగ్స్ కోఆపరేటివ్ కమిటీ(ఎన్‌ఈసీసీ) ధరకు అనుగుణంగా, రవాణా చార్జీలను కలుపుకుని టెండర్లు పిలుస్తారు. అయితే ఈ యేడాది నిబంధనలు మార్చడం విమర్శలకు తావిస్తోంది. ఎన్‌ఈసీసీ వద్ద రిజిస్టర్ అయి ఉండాలని, గతంలో ప్రభుత్వ శాఖలకు కోడిగుడ్లను సరఫరా చేసిన అనుభవం ఉండాలని, కాంట్రాక్టర్ టర్నోవర్ యేడాదికి రూ.8కోట్లు ఉండాలని కొత్తగా నిబంధనల్లో పేర్కొన్నారు.
గత సంవత్సరం గుడ్లను సరఫరా చేసిన వారు కూడా ఈసారి అనర్హతకు గురవడం గమనార్హం. ఇందుకు అనుగుణంగా జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు ఈ టెండర్‌ను దక్కించుకోవడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగా 58 దరఖాస్తుల్లో 30 తిరస్కరణకు గురయ్యాయి. ఉన్న 28లోనూ ఆయా డివిజన్లకు వేసిన వారే మళ్లీ వేయడంతో ఎంత వరకు పాదర్శకత ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో లేని నిబంధనలు ఇక్కడ అమలు చేయడమేమింని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. బడా కాంట్రాక్టర్లకు టెండర్‌ను కట్టబెట్టేందుకే అధికారులు నిబంధనల్లో మార్పు చేశారని వారు విమర్శిస్తున్నారు. కాగా బుధవారం టెండర్లను ఖరారు చేయాల్సిన అధికారులు వివరాలను గోప్యంగా ఉంచారు. టెండర్ ప్రక్రియలో నిబంధనలను కమిటీ సభ్యులంతా కలిసే రూపొందించామని, ఇతర జిల్లాల గురించి తనకు తెలియదని ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ వివరించారు.
కోడిగుడ్లకు ‘టెండర్’
Published Thu, Nov 21 2013 12:13 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement