పేదల ఆస్పత్రిపై పగ
పేదల పెద్దాస్పత్రిపై పాలకులు పగబట్టారు. ఒకటి కాదు రెండు కాదు వరుస సంఘటనలు ఎన్ని జరుగుతున్నా మాత్రం కళ్లు తెరవడం లేదు. ఆస్పత్రిలో రోజురోజుకు పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నా ఆలకించే నాథుడే లేకుండా పోయారు. హాస్పటల్ ప్రాంగణంలో ఎటుచూసినా మురుగునీరు, ఏపుగా పెరిగిన గడ్డి, ఎండిపోయిన చెట్లు, బయో వ్యర్థాలు, ఇతరత్రా పదార్థాలు క్వింటాళ్ల కొద్దీ పేరుకొని కన్పిస్తాయి. దీని వల్ల ఎలుకలు, పందికొక్కులు, ఇతరత్రా కీటకాలు, తాజాగా పాములు సైతం చొరబడే పరిస్థితి దాపురించింది. భరించలేని దుర్వాసనతో ఆస్పత్రికొచ్చే వారు భయాందోళన చెందుతున్నారు. ఆస్పత్రి ఆవరణే దుర్గంధంగా ఉంటే ఇక వార్డుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. పారిశుద్ధ్యం మెరుగుదల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆచరణలో ఆశించిన ఫలితాలు మాత్రం సాధించలేకపోతున్నారు.
గుంటూరు మెడికల్: ప్రతి సంఘటనను తమకు అనుకూలంగా మలుచుకుని అధికార పార్టీ నేతలు ఏదో విధంగా లాభపడే ప్రయత్నం చేస్తున్నారు. జీజీహెచ్‌లో ఎలుకల దాడిలో పసికందు మృతిచెందిన సంఘటనను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. గతంలో శానిటేషన్‌ను రద్దు చేసి టీడీపీ ఎంపీకి చెందిన బంధువులకు కాంట్రాక్టును ఎలాంటి టెండరు లేకుండానే అప్పనంగా అప్పగించారు. గతంలో చెల్లిస్తున్న దానికంటే అదనంగా రెండింతలు ఎక్కువ డబ్బులు అధికార పార్టీ నేతలకు చెందిన కాంట్రాక్టర్‌కు డబ్బులు ఇస్తున్నప్పటికీ శానిటేషన్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడ మాదిరిగానే ఉంది. ప్రభుత్వం ఇకనైన చిత్తశుద్ధితో బంధు ప్రీతిని పక్కన పెట్టి పెద్దాసుపత్రి పారిశుద్ధ్యంపై దృష్టి సారించకపోతే పాములు, ఎలుకల నిలయంగా ఆసుపత్రి మారే ప్రమాదం ఉంది.
నీటి మూటలుగానే పాలకుల, అధికారుల మాటలు...
రాష్ట్రంలోనే అతిపెద్ద పేదల పెద్దాసుపత్రి, రాజధాని జిల్లా ఆస్పత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో శానిటేషన్ మెరుగుకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామంటూ ఆస్పత్రి అధికారులు, పాలకులు చెబుతున్న మాటలు కేవలం నీటి మాటలుగానే ఉన్నాయే తప్పా చేతల్లో కాదనే విషయం ఆస్పత్రిలో పాము ప్రత్యక్షం అవ్వటంతో రుజువైంది. గతంలో ఒక సారి పాము రాగా తాజాగా డిసెంబర్ 31న పాము ప్రత్యక్షం అవ్వటంతో ఆస్పత్రిలో బ్రహ్మండంగా శానిటేషన్ పనులు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న శానిటేషన్ నిర్వాహకుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఆగస్టులో ఎలుకల దాడిలో పసికందు ప్రాణాలు పోవటంతో ప్రభుత్వం, అధికారులు హడావుడి చేశారు. శానిటేషన్ కాంట్రాక్ట్‌ను రద్దుచేసి ఎలాంటి టెండర్లు లేకుండానే నేరుగా టీడీపీ ఎంపీ బంధువులకు చెందిన పద్మావతి శానిటేషన్‌కు సర్వీసెస్‌కు 2015 సెప్టెంబర్ 4 నుంచి జీజీహెచ్ శానిటేషన్ బాధ్యతలు అప్పగించారు. గతంలో సుమారు రూ.21 లక్షలు నెలకు చెల్లిస్తుండగా దానిని రెండంతలు చేసి నూతన శానిటేషన్ నిర్వాహకులకు బాధ్యతలు అప్పగించారు. కేవలం కాంట్రాక్టర్లు మారారే తప్ప ఆస్పత్రిలో పారిశుద్ధ్యం మెరుగుదల విషయంలో ఏ విధమైన మార్పు రాలేదు.