తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా అధికారులు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని రాయలసీమ రేంజ్ ఐజీ నవీన్‌చంద్ అదేశాలు జారీ చేశారు.
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా అధికారులు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని రాయలసీమ రేంజ్ ఐజీ నవీన్‌చంద్ అదేశాలు జారీ చేశారు. అర్బన్ ఎస్పీ కార్యాలయంలో మంగళవారం డీఎస్పీలు, సీఐలతో అర్బన్ ఎస్పీ ఎస్వీ.రాజశేఖరబాబు అధ్యక్షతన సీమ రేంజ్ ఐజీ ననీన్‌చంద్ సమీక్షించారు. జిల్లాకు కొత్తగా వచ్చిన డీఎస్పీలు, సీఐల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడేళ్లుగా జిల్లాలో జరిగిన నేరాలపై ఎస్పీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐజీకి వివరించారు. అనంతరం నవీన్‌చంద్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండి సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. ముందస్తుగా సమస్యాత్మక గ్రామాలను అయా స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు సంద ర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. పాత కేసుల్లో నిందితులు ఎవరైనా ఉంటే ముందస్తుగా అదుపులోకి తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని, ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిపై వేటు తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ ఉమామహేశ్వరశర్మ, ఎస్‌బీ డీఎస్పీలు భాస్కభట్ల విమలకుమారి, టంగుటూరి సబ్బన్న, నరసింహారెడ్డి, రవిశంకర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్ సీఐలు గండ్లపల్లి రాజశేఖర్, శరత్‌చంద్ర, విజయశేఖర్, మద్దయ్యాచారి, మురళీధర్‌రెడ్డి, గుణశేఖర్‌బాబు, మల్లికార్జున గుప్తా పాల్గొన్నారు.
బైక్‌లకు నిప్పు పెట్టడంపై ఐజీ సీరియస్
తిరుపతి కొర్లగుంట వివేకానంద నగర్‌లో నాలుగు బైక్‌లతో పాటు ఒక కారుకు ఆకతాయిలు నిప్పుపెట్టిన సంఘటనపై ఐజీ నవీన్‌చంద్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోతోపాటు ఇతర అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. ఈ సంఘటనపై పూర్తి వివరాలను సేకరించాలని నిందితులను ఒకటి రెండు రోజుల్లోగా పట్టుకోవాలని ఐజీ అదేశించినట్లు తెలిసింది. రాత్రి పూట గస్తీ ముమ్మరంగా చేయాలని, మద్యం దుకాణాలు 11గంటల కల్లా మూయించాలని, అర్ధరాత్రి తర్వాత దుకాణాలు, హోటళ్లు, ఫుట్‌ఫాత్ మీద టిఫిన్ సెంటర్లు మూయించాలని ఆదేశించారు.
ఎర్రచందనం స్మగ్లర్లను అరికడదాం : ఐజీ
శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకు అవసరమైన భద్రతను మరింత పటిష్టం చేశామని రాయలసీమ రేంజ్ ఐజీ నవీన్‌చంద్ తెలిపారు. తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ ఎస్వీ.రాజశేఖరబాబుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాతోపాటు స్మగ్లర్లను ఏరివేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని, కొన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులు పెట్టామని చెప్పారు. ఇప్పటికే ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో 340 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన నిందితుల వివరాలను సేకరించే పనిలో పోలీసు అధికారులు ఉన్నారన్నారు. అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లర్లను ఎదుర్కొనే సందర్భంలో ఎస్పీ అదేశాల కోసం ఎదురు చూడకుండా స్మగ్లర్ల అటకట్టించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికల నియామవళి పాటిస్తామని చెప్పారు.