పార్వతీపురం/గుమ్మలక్ష్మీపురం: ఆమె కడుపులో బిడ్డ నాలుగు రోజుల కిందటే చనిపోయింది. శస్త్రచికిత్స చేసి సమస్యను పరిష్కరించేందుకు పార్వతీపురం ఏరియా ఆస్పత్రి వైద్యులు భయపడ్డారు. వైద్యం వికటిస్తే.. మెరుగైన వైద్య సదుపాయం అందుబాటులో లేకపోవడతో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అయితే, ఆమెది నిరుపేద కుటుంబం కావడం.. అక్కడి వరకు వెళ్లేందుకు దారిఖర్చులూ లేకపోవడంతో వెనుకంజ వేసింది. విషయం పీవో దృష్టికి వెళ్లడంతో ఆయన వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. ఖర్చులన్నీ భరిం చేందుకు సిద్ధపడి 108 వాహన సదుపాయం కల్పిం చి విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కడుపులో ఉన్న మృతబిడ్డతో ఆమె పడే నరకయాతన చూసేవారికి కన్నీరుతెప్పించింది. వివరాల్లోకి వెళ్తే...
చాపచాయి జంగిడి భద్ర గ్రామానికి చెందిన ఆరు నెలల గర్భిణి మండంగి సింధు తన కడుపులో ఉన్న బిడ్డ కదలడం లేదంటూ నాలుగు రోజుల కిందట తాడికొండ పీహెచ్‌సీకి వెళ్లింది. అక్కడ ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారి మెరుగైన వైద్యం కోసం కురుపాం సీహెచ్‌సీకి రిఫర్ చేశారు. అక్కడకు మూడు రోజుల క్రితం ఈ గర్భిణి తన భర్త శ్యామలరావుతో కలిసి వెళ్లగా, ఆ ఆసుపత్రిలో పరీక్షించిన స్టాఫ్‌నర్స్ పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి వెళ్లాలంటూ సూచించడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు.
వీరి పరిస్థితిని తెలుసుకున్న తాడికొండ పీహెచ్‌సీ వైద్యుడు జి.ప్రభాకరరావు గర్భిణీతో పాటు కుటుంబీకులకు పార్వతీపురం వెళ్లాల్సిందేనంటూ చైతన్యపరచి ఏఎన్‌ఎం సహాయంతో శనివారం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి పంపించారు. ఆమెను శనివారం సాయంత్రమే పరిక్షించిన వైద్యులు సింధూ కడుపులోని బిడ్డ చనిపోయినట్టు నిర్ధారించారు. శస్త్రచికిత్స చేసి బిడ ్డను తీయాలని, ఇక్కడ ఆ సదుపాయాలు లేవంటూ విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అయితే, ఆర్థిక ఇబ్బందులు కారణంగా వెళ్లేందుకు నిరాకరించారు. ఆదివారం సాయంత్రం వరకు పా ర్వతీపురం ఏరియా ఆస్పత్రిలోనే ఉండిపోయారు.
ఈ విషయం ఐటీడీఏ పీఓ దృష్టికి వెళ్లడంతో ఆయన విజయనగరం ఆస్పత్రికి తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. దీంతో రాత్రి 7.30 గంటల ప్రాం తంలో సింధును విజయనగరం పంపించే ఏర్పాట్లను ఏరియా ఆస్పత్రి వైద్యులు చేశారు. అయితే, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి పెద్దదే అయినా సదుపాయాలు, పరికరాలు అందుబాటులో లేకపోవడం... వైద్యం వికటిస్తే గిరిజన సంఘాలు ఆందోళనలు చేస్తుండడంతో వైద్యం అందించేందుకు వైద్యులు సైతం భయపడుతున్నారు. అందుకే.. ప్రమాదకర కేసులను విజయనగరం కేంద్రాస్పత్రికి రిఫర్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment