ఏపీకి మరో భారీ పెట్టుబడి | IMR Company Representative Meets YS Jagan Discuss New Steel Plant In YSR District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో మరో స్టీల్‌ ప్లాంట్‌కు ప్రతిపాదన

Published Thu, Mar 5 2020 4:47 PM | Last Updated on Thu, Mar 5 2020 5:12 PM

IMR Company Representative Meets YS Jagan Discuss New Steel Plant In YSR District - Sakshi

సాక్షి, తాడేపల్లి : రాష్ట్రానికి భారీ పెట్టుబడుల దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వైఎస్సార్‌ జిల్లాలో మరో భారీ స్టీల్‌ ప్లాంట్‌ పెడతామంటూ ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ఏజీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు గురువారం క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఐఎంఆర్‌ కంపెనీ కార్యకలాపాలను సీఎం అడిగితెలుసుకున్నారు. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్‌ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతోపాటు విద్యుత్, ఉక్కు కర్మాగారాలను నడుతున్నామంటూ ఐఎంఆర్‌ కంపెనీ ప్రతినిధులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. 

ఎలాంటి సహకారానికైనా సిద్ధం : సీఎం జగన్‌
వైఎస్సార్‌ జిల్లాలో తలపెట్టిన స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు ముమ్మరం చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ ఎంఆర్‌ఐ ప్రతినిధులకు తెలిపారు. ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఐఎంఆర్‌ కూడా మరొక స్టీల్‌ప్లాంట్‌ పెడితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని సీఎం అన్నారు. నీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. కృష్ణపట్నం పోర్టు, అక్కడి నుంచి రైల్వే మార్గం, జాతీయ రహదారులతో మంచి రవాణా సదుపాయం ఉందని సీఎం వారికి వివరించారు. పరిశ్రమల రాకవల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.  రానున్నరోజుల్లో వైఎస్సార్‌ జిల్లా ప్రాంతం స్టీల్‌సిటీగా రూపాంతరం చెందడానికి పూర్తి అవకాశాలున్నాయని ఐఎంఆర్‌ కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఇండస్ట్రీస్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ్, ఐఎంఆర్‌ ఏజీ ఛైర్మన్‌ హాన్స్‌ రడాల్ఫ్‌ వైల్డ్, కంపెనీ డైరెక్టర్‌ అనిరుధ్‌ మిశ్రా, సెడిబెంగ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీ సీఈఓ అనీష్‌ మిశ్రా, గ్రూప్‌ సీఎఫ్‌ఓ కార్ల్‌ డిల్నెర్, టెక్నికల్‌ డైరెక్టర్‌ సురేష్‌ తవానీ, ప్రాజెక్ట్స్‌ ప్రెసిడెంట్‌ అరిందమ్‌ దే, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ సంజయ్‌సిన్హా , ఏపీ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్స్‌ ఎండీ పి మధుసూదన్‌ పాల్గొన్నారు.

చదవండి : గ్రామాల్లో బెల్టు షాపులు నడవకూడదు: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement