సాక్షి, భవానీపురం(విజయవాడ పశ్చిమ): ‘మీరు అడిగినవన్నీ ఇచ్చాం. మీరేం చేస్తారో నాకు తెలియదు.. జనవరి 31 నాటికి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయాలి. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.. దట్సాల్’.. అని కలెక్టర్ ఇంతియాజ్ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ సోమాను ఆదేశించారు. బుధవారం నేషనల్ హైవేస్ అధికారులు, సోమా కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆయన ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరంఫ్లై ఓవర్ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్, సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తికాగా, మిగిలిన పనులు డిసెంబర్‌లోగా పూర్తి అవుతాయని చెప్పారు. జనవరి 31 నాటికి ఫినిషింగ్ పనులు పూర్తిచేసి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను, సోమా కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.
పనులు వేగవంతం..
నిర్మాణ పనులకు సంబంధించి 43 స్పాన్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 40 పూర్తయ్యాయని తెలిపారు. ఇటీవల దసరా ఉత్సవాలకు భక్తులకు ఇబ్బంది లేకుండా నిలుపుదల చేసిన 3 స్పాన్స్ పనులను త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గత రెండు, మూడు ఏళ్ల నుంచి మందకొడిగా సాగిన పనులు గత ఆరు నెలల నుంచి వేగవంతమయ్యాయని చెప్పారు. విజయవాడ నగరానికి తలమానికంగా తయారవుతున్న ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయన్నారు. నేషనల్ హైవే సూపరింటెండెంట్ ఇంజినీర్ జాన్‌మోషే మాట్లాడుతూ రూ.320 కోట్లతో చేపట్టిన కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే క్రమంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ఆరు లేన్ల ఈ ఫ్లై ఓవర్‌పై ఒక వైపు కొంత మేర బీటీ లేయర్ వేయడం జరిగిందని, త్వరలోనే రెండో వైపు కూడా మొదలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర, దుర్గగుడి ఈవో సురేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment