
దాహార్తికి గోదావరి
అదనంగా 50 క్యూసెక్కుల నీరు తెచ్చేందుకు జీవీఎంసీ కసరత్తు
మరో పాయ తవ్వడం ద్వారా సేకరించవచ్చునని అంచనా
రూ. 49 లక్షల కేటాయింపు
ఏలేరు కెనాల్‌ను పరిశీలించిన కమిషనర్
విశాఖపట్నం సిటీ: వేసవి సీజన్‌లో విశాఖవాసులందరికీ తాగునీటి సరఫరాపై జీవీఎంసీ దృష్టి సారించింది. నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గోదావరి నీటిని ఏలేరు కెనాల్ ద్వారా విశాఖకు తీసుకొస్తున్న విధానంలో ఎదురవుతున్న ఇబ్బందులను బుధవారం కమిషనర్ ప్రవీణ్‌కుమార్ స్వయంగా పరిశీలించారు. గోదావరి నుంచి రెండు మోటార్ల ద్వారా నిరంతరం పంపింగ్ చేస్తూ కెనాల్‌లోకి నీటిని మళ్లిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోదావరి నదిలోనూ నీరు అడుగంటడంతో ఒక పాయను తవ్వడం ద్వారా ఈ వేసవి వరకూ తాగునీటికి ఢోకా వుండదని గుర్తించారు. అందుకు అవసరమైన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. రూ. 49 లక్షలతో గోదావరి నదిలోనే ఓ చిన్న పాయను తవ్వడం ద్వారా పంపింగ్ చేసి విశాఖకు తీసుకురానున్నారు. ఇలా చేయడం వల్ల అదనంగా మరో 50 క్యూసెక్కుల నీటిని విశాఖకు తీసుకురావచ్చని జీవీఎంసీ అధికారిక వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుతం గోదావరి నుంచి 100 క్యూసెక్కులు, ఏలేరు రిజర్వాయర్ నుంచి 150 క్యూసెక్కుల నీటిని విశాఖకు ఏలేరు కెనాల్ ద్వారా తీసుకొస్తున్నారు. అయితే 300 క్యూసెక్కుల నీరు వుంటేనే కానీ నగర ప్రజల దాహార్తిని తీర్చలేమని అంచనాకొచ్చారు. అందుకనుగుణంగా ఏలేరు, గోదావరి నీటిని అదనంగా లిఫ్ట్ చేసి మోటార్ల ద్వారా సరఫరా చేయాలని ప్రయత్నిస్తున్నారు.
అడుగంటిన ఏలేరు, గోదావరి..!
ఏలేరు, గోదావరి నీటి మట్టాలు అడుగంటాయి. విశాఖకు అక్కడి నుంచి రావాల్సిన నీరు రావడం లేదు. ఏలేరు నుంచి 200 క్యూసెక్కుల నీటిని వాడితే 30 రోజులు తర్వాత నీరు లభ్యం కాదు. ప్రస్తుతమున్న నీటి నిల్వలు మరో నెల రోజుల వరకూ సరిపోతాయని అంచనా వేశారు. ఏలేరులో ప్రస్తుతం నీటి నిల్వ 74.63 మీటర్లు వుందని 72.5 మీటర్లకు తగ్గితే ఇక నీటి లభ్యత వుండదని స్థానిక అధికారులు కమిషనర్‌కు వివరించారు. అయితే తాటిపూడి, గోస్తనీ నదుల వల్ల వచ్చే నీరుందని చెప్పారు. మేఘాద్రిగెడ్డ, రైవాడ, ముడసర్లోవ నుంచి నీరు తగ్గే అవకాశాలున్నాయని గుర్తించామన్నారు. అందుకే గోదావరి నుంచి ఎత్తిపోతల ద్వారా 50 క్యూసెక్కుల నీటిని తీసుకొస్తామని అందుకు అవసరమైన చర్యలు వెంటనే మొదలెట్టాల్సిందిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఏలేరు కెనాల్ గట్టుపై పర్యటన..!
ఏలేరు నుంచి విశాఖకు వచ్చే కెనాల్ గట్టు వెంట కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు బుధవారం పర్యటించారు. దాదాపు 60 కిలోమీటర్లు ఇరుకైన గతుకులతో నిండిన కాల్వ గట్టు వెంబడి పర్యటించారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఈ గట్టు వెంట దాదాపు రైతులు పైపుల ద్వారా నీటిని చోరీ చేస్తున్న దృశ్యాలు అడుగడుగునా కనిపించాయి. పలు చోట్ల కాల్వ గట్టులు తవ్వేయడంతో ఆ గట్ల పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు. కమిషనర్ వెంట చీఫ్ ఇంజనీర్ దుర్గాప్రసాద్, ప్రాజెక్టు ఎస్‌ఈ ఉమా మహేశ్వరరావు, ఏఈ రాజు, కాంట్రాక్టర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రూ. 14 కోట్లతో నీటి ప్రాజెక్టులు
విశాఖ ప్రజలు, పారిశ్రామిక అవసరాల కోసం రూ. 14 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు కమిషనర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖలోని గంభీరం(ఆనందపురం), నక్కపల్లి, వంటి ప్రాంతాల్లో పరిశ్రామిక క్లస్టర్‌లు రానున్నాయని చెప్పారు. విశాఖ-ఛెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఈ రెండు చోట్ల పరిశ్రమలు రానున్నాయన్నారు. అందుకే భవిష్యత్తు అవసరాలకు సంబంధించి జీవీఎంసీ , ప్రభుత్వం ఈ మొత్తాన్ని వెచ్చిస్తుందని వెల్లడించారు. ఏషియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుకు సాయం చేస్తుందన్నారు.