‘మద్యం’ గెజిట్‌లో గందరగోళం!
- దుకాణాల క్రమ సంఖ్యలో తప్పిదాలు
- రెండు గెజిట్‌లను ఇచ్చిన అధికారులు
- వ్యాపారుల్లో టెన్షన్.. టెన్షన్
చిత్తూరు (అర్బన్): జిల్లాలో విడుదలైన మద్యం పాలసీ గెజిట్ నోటిఫికేషన్‌లో తప్పులు దొర్లాయి. అవి సరిదిద్దుకునే తప్పిదాలు కావు. ఏకంగా మద్యం దుకాణాలనే మార్చేసే తప్పిదాలు. ఇందులో వచ్చిన తప్పిదాలను సరిచేసి రెండోమారు గెజిట్ జారీ చేయాల్సిన అధికారులు అన్నీ తెలిసి మిన్నకుండిపోయారు. ఒక గెజిట్ ఫోర్సులో ఉండగానే మరో గెజిట్‌ను విడుదల చేసేశారు. దీన్ని గుర్తించిన వ్యాపారులు ఆందోళనకు గురవుతుంటే అధికార పార్టీ నాయకుల నుంచి ఎక్సైజ్ అధికారులకు బెదిరింపులు వస్తున్నాయి.
జిల్లాలో 410 ప్రైవేటు, 48 ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహించనున్నట్లు అధికారులు ఈనెల 24 తేదీన గెజిట్ జారీ చేశారు. ఇందులో ప్రభుత్వ మద్యం దుకాణాలు కాకుండా తిరుపతిలో 220, చిత్తూరులో 190 ప్రైవేటు మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆయా ఎక్సైజ్ సూపరింటెండ్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే చిత్తూరు ఈఎస్ పరిధిలోని అర్బన్ ఎక్సైజ్ పరిధిలో ఉన్న మద్యం దుకాణాల గెజిట్ క్రమ సంఖ్యల వివరాల్లో తప్పులు దొర్లాయి. 10వ క్రమ సంఖ్య ఉన్న 30వ డివిజన్‌లో ప్రభుత్వ మద్యం దుకాణం పెట్టనున్నట్లు తొలి గెజిట్‌లో పేర్కొన్నారు.
ఈ క్రమ సంఖ్యకు దరఖాస్తులు స్వీకరించరు. ఇందులో 10వ నెంబరులో ప్రభుత్వ దుకాణం చూపిస్తూ, మళ్లీ 10వ నెంబరులో పలమనేరు రోడ్డులోని 30వ డివిజన్‌లో దుకాణం కోసం అంటూ రెండు మార్లు గెజిట్‌లో 10వ క్రమ సంఖ్యను ముద్రించారు. దీనికితోడు 19వ దుకాణం ఎక్కడుందో చూపించలేదు. అప్పటికే వ్యాపారుల చేతికి గెజిట్ వెళ్లిపోవడంతో దరఖాస్తులు వేసిన చాలామంది రూ.50వేలు చెల్లించి దరఖాస్తులు కొనుగోలు చేసి టెండర్లు కూడా వేసేశారు. తీరా తప్పిదాన్ని గుర్తించిన అధికారులు రెండోమారు మరో గెజిట్‌ను లైవ్‌లోకి తీసుకొచ్చారు. ఇందులో తప్పిదాలు సవరించారు.
అయితే రెండు గెజిట్లను పరిగణనలోకి తీసుకున్న వ్యాపారులు అందులో ఉన్న క్రమ సంఖ్య ఆధారంగా ఇష్ట ప్రకారం టెండర్లు వేశారు. ఫలితంగా గెజిట్‌లోని 10వ క్రమ సంఖ్య నుంచి 20 క్రమ సంఖ్య వరకు దుకాణాలన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు లక్కీడిప్‌లో ఏ దుకాణం వస్తే అధికారులు ఏ దుకాణం అప్పగిస్తారోనంటూ వ్యాపారుల్లో టెన్షన్ ప్రారంభమైంది.
‘తమ్ముళ్ల’ బెదిరింపులు..
జిట్‌లో తప్పిదాలు గుర్తించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్సైజ్ అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. సోమవారం జరిగే లక్కీడిప్‌లో చిత్తూరులోని కొన్ని దుకాణాలు తమకు వద్దని, తాము వేసిన దరఖాస్తులు వెనక్కు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అయితే టెండరు బాక్సులకు సీలు వేసి, వీటిని ఖజానా శాఖలో ఉంచడంతో దరఖాస్తులు వెనక్కు ఇవ్వడం అయ్యే పనికాదని అధికారులు తేల్చేశారు. పొరపాటున లక్కీడిప్‌లో తమకు నచ్చని దుకాణం బలవంతంగా అంటగడితే మీ అంతు చూస్తామని చిత్తూరుకు చెందిన పలువురు టీడీపీ నాయకులు ఎక్సైజ్ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.