అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వాహనదారులపై మరోసారి పెట్రో బాంబు పేలింది. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న వినియోగదారులను కేంద్రం మరోసారి నడ్డివిరిచింది. జూలైలో లీటరు పెట్రోల్‌పై రూ.1.55 చొప్పున పెంచిన కేంద్రం... శనివారం పెట్రోల్, డీజిల్ రెండింటిపైనా వడ్డించింది. లీటరు పెట్రోల్‌పై రూ.2.30, డీజిల్‌పై 50 పైసల చొప్పున పెంచింది.
పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీని వల్ల జిల్లా ప్రజలపై నెలకు రూ.2.52 కోట్లఅదనపు భారం పడనుంది. జిల్లాలో 220 పెట్రోల్ బంకులున్నాయి. అన్ని బంకుల్లో కలిపి రోజుకు రెండు లక్షల లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతోంది. తాజా పెంపు వల్ల లీటర్ పెట్రోల్ ధర రూ.75.96 నుంచి రూ.78.26కు చేరింది. దీంతో రోజుకు రూ.4.60 లక్షల చొప్పున నెలకు రూ.1.38 కోట్ల అదనపు భారం పడనుంది.
అలాగే జిల్లా వ్యాప్తంగా రోజుకు 7.64 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. లీటరు డీజిల్ ధర రూ.55.94 నుంచి రూ.56.44 చేరింది. ఆ లెక్కన రోజుకు రూ.3.82 లక్షల చొప్పున నెలకు రూ.కోటి 14 లక్షల 60 వేల అదనపు భారం పడనుంది. పెట్రోల్, డీజిల్ కలిపి మొత్తంగా నెలకు జిల్లా ప్రజలపై రూ. 2 కోట్ల 52 లక్షల 60 వేల అదనపు భారం పడనుంది. ఏడాదికి రూ.30.24 కోట్ల భారం పడుతోంది. ఇప్పటికే ఉప్పు మొదలుకుని కూరగాయల వరకు అన్ని నిత్యావసర ధరలు సెగలు కక్కుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు పెట్రో ధరలు కూడా పెరగడంతో వాహనదారులతో పాటు సామాన్య ప్రజలు కూడా అవస్థ పడనున్నారు. పెట్రో ధరల పెంపు వల్ల నిత్యావసరాల ధరలు, ఆటో, బస్సు చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది.
మళ్లీ పెట్రో భారం
Published Sun, Sep 1 2013 4:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement
Advertisement