డెంగీలో జిల్లా ఫస్ట్ | In dengue first district | Sakshi
Sakshi News home page

డెంగీలో జిల్లా ఫస్ట్

Published Wed, Aug 5 2015 3:21 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

డెంగీలో జిల్లా ఫస్ట్

డెంగీలో జిల్లా ఫస్ట్

- రాష్ట్ర స్థాయిలో చిత్తూరులోనే అత్యధిక కేసులు
- కేంద్ర, రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందం రాక
- మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటన
- ఏడిస్ ఈజిప్టై దోమపై ఢిల్లీలో పరిశోధనలు
చిత్తూరు (అర్బన్):
రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న డెంగీ కేసులతో పోలిస్తే మన జిల్లాలో ఈ జ్వరం బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు, ప్రజల్లో చైతన్యం లేకపోవడంతోనే డెంగీ జ్వరాలు వస్తున్నాయని అధికారులు చెప్పుకుంటున్నారు. అయితే ఎక్కడా లేనివిధంగా జిల్లాలో డెంగీ కేసులు విపరీతంగా నమోదవుతుండడంతో దీనిని పరిశీలించడానికి కేంద్ర భారత వైద్య మంత్రిత్వ శాఖ నుంచి డెప్యూటీ డెరైక్టర్ డాక్టర్ అమిత్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ అధికారి డాక్టర్ అనురాధ మంగళవారం చిత్తూరుకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు జిల్లాలోని పలు ప్రాంతాలను, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జ్వర బాధితులను విచారించనున్నట్లు తెలిపారు. ప్రజలకు దోమతెరలు అందించడం, గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టడం, నిధుల విడుదలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.
 
ప్రభుత్వాస్పత్రి సందర్శన
డెంగీ జ్వరాల వ్యాప్తిపై పరిశోధన, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై అనురాధ, అమిత్ ఈ నెల 7వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డాక్టర్ కోటీశ్వరితో కలిసి డెంగీ జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల రూట్ మ్యాప్‌ను తీసుకున్నారు. ఈ ప్రాంతాలను సందర్శించడం, దోమల వ్యాప్తి, ఉత్పత్తి ఎలా జరుగుతోంది, ఎక్కడెక్కడ ఎక్కువగా సమస్య ఉందని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు.

మంగళవారం కేంద్ర, రాష్ట్ర వైద్యాధికారులతో పాటు డీఎంఅండ్‌హెచ్‌వో, డీసీహెచ్‌ఎస్ సరళమ్మతో కలిసి చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. ఇక్కడున్న చిన్నపిల్లల వార్డులో డెంగీ జ్వరాలతో బాధపడుతున్న ముగ్గురికి అందుతున్న వైద్య సేవలపై విచారించారు. అలాగే ఓ వృద్ధురాలికి సైతం డెంగీ జ్వరం ఉండడంతో ఆమెను సైతం విచారించారు. అనంతరం నగరంలోని భరత్‌నగర్ కాలనీని పరిశీలించారు. ఇక్కడ పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో దోమలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించారు.
 
ఈ ప్రాంతాల్లో వ్యాప్తి
మరోవైపు జిల్లాలో డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను వైద్యశాఖ గుర్తించింది. ఇందులో పీలేరు, చిత్తూరు, మదనపల్లె, రామసముద్రం మండలాల్లో 20 కంటే ఎక్కువ మందికి డెంగీ ఉన్నట్టు నిర్ధారించారు. గుర్రంకొండ, పెద్దమండ్యం, తిరుపతి అర్బన్, పలమనేరు, బంగారుపాళ్యం, నిమ్మనపల్లె, సోమల, కలికిరి, పులిచెర్ల, కేవీపల్లె, రొంపిచెర్ల, పెద్దపంజాణి, యాదమరి, ఐరాల మండలాల్లో 10 నుంచి 20 మందికి డెంగీ జ్వరాలు వచ్చాయి. బి.కొత్తకోట, కురబలకోట, చౌడేపల్లె, ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు, పాకాల, గుడిపాల, ఎస్‌ఆర్ పురం, తిరుపతి రూరల్, పాలసముద్రం ప్రాంతాల్లో సగటున 6-9 మందికి డెంగీ జ్వరాలు ఉన్నట్లు గుర్తించారు.
 
దోమపై పరిశోధన
ప్రత్యేక వైద్య బృందం జిల్లా పర్యటన పూర్తీ చేసుకుని వెళ్లేప్పుడు ఇక్కడ డెంగీ జ్వరాన్ని కలుగచేసే ఏడిస్ ఈజిప్టై దోమను, జ్వరంతో బాధపడుతున్న ఒకరి రక్తనమూనాను సేకరించి ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. అక్కడ దీనిపై పరిశోధన చేసి డెంగీ వ్యాప్తి నివారణ, బాధితులకు ఇవ్వాల్సిన మందులపై దృష్టి సారిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement