ఆక్వాలో కృష్ణా ఫస్ట్
- సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కితాబు
- జిల్లాలో పాలీహౌస్ టెక్నాలజీకి హామీ
- ఉదయం 10.30 నుంచి రాత్రి వరకు సమీక్ష
- శాఖలవారీగా విడివిడిగా చర్చ
- హాజరైన మంత్రులు, సీఎస్, 13 జిల్లాల కలెక్టర్లు
సాక్షి, విజయవాడ : ‘చేపల ఎగుమతుల్లో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్పత్తి, ఎగుమతుల్లో రూ.7వేల కోట్ల టర్నోవర్ సాధించిన కృష్ణాజిల్లాను మిగిలిన జిల్లాలు ఆదర్శంగా తీసుకోవాలి.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ‘ప్రాథమిక రంగ మిషన్ ద్వారా రెండంకెల వృద్ధిరేటు సాధన’పై నగరంలోని ఎ.కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మొదలుకుని నీటిపారుదల శాఖ వరకు అన్ని ప్రధాన శాఖలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. పలు ప్రభుత్వ ప్రధాన అంశాలపై సీఎం సమీక్ష సాగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మొదలైన సమావేశం రాత్రి 10.30 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా సీఎం పలు అంశాలపై విస్తృతంగా చర్చించడంతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నిర్వహించారు.
ఆగిరిపల్లి ఫుడ్‌పార్క్‌కు ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం
తొలుత ఉద్యానవన శాఖ సమీక్షతో సమావేశం మొదలైంది. ఒక్కో శాఖపై దాదాపు గంటకుపైగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న ప్రభుత్వ పథకాల తీరుతెన్నుల్ని ఆయా శాఖల రాష్ట్ర కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వివరించగా, జిల్లాల్లోని పరిస్థితిని, అమలవుతున్న విధానాలను కలెక్టర్లు వివరించారు. ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించిందని సీఎం చెప్పారు. అలాగే, రాష్ట్రంలో ఉన్న నూతన ఫిషరీస్ పాలసీ కూడా ఎక్కడా అమలులో లేదన్నారు. ఆగిరిపల్లికి మంజూైరైన ఫుడ్‌పార్క్‌కు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమవుతోందని, అది రాగానే దానికి అనుగుణంగా పనులు మొదలవుతాయని వివరించారు.
పాల ఉత్పత్తిలో మూడోస్థానం
పాల ఉత్పత్తిలో కృష్ణాజిల్లా మూడో స్థానంలో ఉందని, ఉభయగోదావరి జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయని సీఎం చెప్పారు. 18.2 శాతం వృద్ధిరేటు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనికి అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని చెప్పారు. ప్రతి ప్రైమరీ సెక్టార్‌కు ఒక జాయింట్ కలెక్టర్‌ను నియమించామన్నారు. కృష్ణాజిల్లా హర్టీకల్చర్‌లో నూతన పద్ధతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఇజ్రాయెల్‌లో అమల్లో ఉన్న పాలీహౌస్ టెక్నాలజీని కృష్ణాజిల్లాలో ప్రారంభించనున్నామని, దీనికోసం రూ.3కోట్ల నిధులు మంజూరు చేశానని చెప్పారు. ఇది డ్రిప్ ఇరిగేషన్ కంటే సూక్ష్మంగా ఉంటుందని, మొక్కకు ఎక్కువ నీరు ఇచ్చేలా పనిచేస్తుందని, కూరగాయలు, పండ్లతోటల సాగులో దీనిని ఎక్కువగా వినియోగించేలా అందరూ దృష్టి సారించాలని కోరారు.
మంత్రులు, కలెక్టర్లు హాజరు
ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథ్‌రెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్, కిమిడి మృణాళిని, పీతల సుజాత, రావెల కిషోర్‌బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అచ్చెన్నాయుడు, శిద్దా రాఘవరావు, ప్రభుత్వ సలహాదారులు పరకాల ప్రభాకర్, జె.సత్యనారాయణ, జీవీ కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్పీ టక్కర్, టి.విజయ్‌కుమార్, ముఖ్య కార్యదర్శులు కేఎస్ జవహర్‌రెడ్డి, ఆదిత్యనాథ్ దాస్, కరికల వలన్, ఎస్.ప్రేమ చంద్రారెడ్డి, సాల్మన్ ఆరోగ్య రాజ్, శశిభూషణ్, డి.శ్రీధర్, బి.రామాంజనేయులు, 13 జిల్లాల కల్టెకర్లు పాల్గొన్నారు.
ఈ-పోస్‌పై కలెక్టర్‌కు అభినందన
జిల్లాలో కలెక్టర్ బాబు.ఎ అమలు చేస్తున్న ఈ-పోస్ విధానం ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నారని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. చౌకధరల దుకాణాల్లో దీనిని అమలు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో వేగంగా పని జరుగుతుందని, అలాగే ఎరువులు, విత్తనాల బ్లాక్ మార్కెట్ నియంత్రణలో కూడా దీనిని ఉపయోగించవచ్చని కలెక్టర్ బాబు.ఎ సీఎం చంద్రబాబుకు వివరించారు. రానున్న రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని చౌకడిపోల్లో దీనిని అమలు చేయాలని సీఎం సూచిస్తూ కలెక్టర్‌ను అభినందించారు.