Fish exports
-
‘సంధ్య’ నిర్వాకాలతో ఎగుమతులకు దెబ్బ
మహారాణిపేట: సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ దిగుమతి చేసుకున్న 25 వేల కిలోల ఇన్ యాక్టివ్ డ్రై ఈస్ట్‌లో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలడం మత్స్య ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం విశాఖ ఫిషింగ్ హార్బర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అక్రమ రవాణా వల్ల 20 ఏళ్ల క్రితం కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి భూమి ఇచ్చిన మత్స్యకారుల త్యాగానికి విలువ లేకుండా పోయిందన్నారు. భూములిచ్చిన 766 మంది మత్స్యకారులకు ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలు ఇస్తామన్న మాటను ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. దేశ అభివృద్ధి కోసం విశాఖ పోర్ట్ యాజమాన్యానికి భూములిస్తే వారు ప్రైవేటు వ్యక్తులకు కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి భూములు అప్పగించారన్నారు. కంటైనర్ టెర్మినల్‌లో ప్రైవేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో అంతర్జాతీయ స్మగ్లర్లు అక్రమ వ్యాపారాలకు విశాఖను ఎంచుకుంటున్నారన్నారు. దీనివల్ల విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినడమే కాకుండా మత్స్య ఎగుమతులపై ప్రభావం చూపుతుందన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు భారత మత్స్య పరిశ్రమకు రాయితీలు, ప్రోత్సాహకాలు రద్దు చేయాలని నిర్ణయించడం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ యాజమాన్యం నిర్వాకాలతో మత్స్య పరిశ్రమ, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంధ్యా ఆక్వా సంస్థతో పాటు విశాఖ కంటైనర్ టెర్మినల్, జేఎం బక్షి సంస్థలను దీనికి బాధ్యులుగా చేసి సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు కంటైనర్ దిగుమతులను విశాఖ పోర్ట్ అథారిటీ స్వయంగా పరిశీలించాలని కోరారు. దిగువ స్థాయి కస్టమ్స్ అధికారులు ప్రమేయం లేకుండా ఇదంతా జరగదని, వీసీటీపీఎల్, జేఎం భక్షి సంస్థలు ఇందుకు బాధ్యత వహించాలన్నారు. విశాఖకు దిగుమతి అవుతున్న ప్రతి కంటైనర్‌ను పూర్తిగా స్కానింగ్ చేసిన తర్వాత దేశంలోకి అనుమతించాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు దూడపోలయ్య, గుంటు దానయ్య, వాసుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు . -
సోయగాల చేపలతో సిరులు
సాక్షి, అమరావతి: రంగురంగుల చేపలు.. సోయగాల చేపలు సిరులు కురిపిస్తున్నాయి. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లకే పరిమితమైన ఈ అలంకార చేపలు.. ఇప్పుడు మధ్యతరగతి, సామాన్య ప్రజల నివాసాల్లో కూడా కనువిందు చేస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా వీటికి గిరాకీ పెరిగింది. అంతర్జాతీయంగా ఏటా రూ.15 వేల కోట్ల వ్యాపారం జరుగుతుంటే.. భారత్‌లో రూ.250 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. దేశీయంగా ఈ అలంకార చేపల ఉత్పత్తిలో పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ముందు వరుసలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2,500కు పైగా రకాల అలంకార చేపలను ఉత్పత్తి చేస్తుంటే.. మన దేశంలోని మంచి నీటిలో 375, ఉప్పు నీటిలో 165 రకాల చేపలను సాగు చేస్తున్నారు. ఏపీలో ఈ అలంకార చేపల సాగుకు రాయలసీమ కేంద్రంగా ఉంది. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వీటి సాగు విస్తరిస్తోంది. కాకినాడ, విశాఖపట్నంలో కూడా పెద్ద యూనిట్లున్నాయి. ఇక్కడ ఏటా మూడు దఫాల్లో సాగు చేస్తూ.. ఒక్కో విడతలో 1.20 లక్షల నుంచి 1.50 లక్షల చేపలను ఉత్పత్తి చేస్తున్నారు. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. భారీగా ఆదాయం.. 300 చదరపు అడుగుల ట్యాంకులో 3–4 సెంటీమీటర్ల సైజున్న 600 నుంచి 800 పిల్లలను వేస్తే నెలకు అంగుళం సైజుకొస్తాయి. రకాల ఆధారంగా గరిష్టంగా 300 నుంచి 500 గ్రాముల వరకు పెరుగుతాయి. అంగుళం సైజుకొస్తే చాలు.. మార్కెటింగ్ చేసుకోవచ్చు. నెలకు 13 వేల చేపల చొప్పున.. ఏటా లక్షకు పైనే పిల్లలు ఉత్పత్తి అవుతాయి. సాధారణ అలంకార చేప ధర రూ.10. కొన్ని రకాలైతే రూ.వందలు, రూ.వేలల్లో కూడా ఉంటాయి. రూ.3.40 లక్షల వరకు పెట్టుబడి పెడితే.. ఏటా రూ.10 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. రూ.కోటిన్నర వరకు చేయూత.. రాయలసీమతో పాటు ఉమ్మడి కృష్ణా, గోదావరి, విశాఖ జిల్లాలు అలంకార చేపల సాగుకు అనుకూలమని.. ఏటా కోటి చేపలు ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయని నిఫుణులు అంచనా వేశారు. దీనిని ప్రోత్సహిస్తే కనీసం 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. అలంకార చేపల సాగు యూనిట్లకు ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి పథకంలో ఎంటర్‌ప్రెన్యూర్స్ స్కీమ్ కింద రూ.25 లక్షల నుంచి రూ.కోటిన్నర వరకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. మహిళలకు 30 శాతం, ఇతరులకు 25 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. 20 రకాలను ఉత్పత్తి చేస్తున్నాం.. 1.25 ఎకరాల్లో రూ.93 లక్షలతో క్లస్టర్ యూనిట్ ఏర్పాటు చేశాం. బ్రూడర్, రేరింగ్, లార్వా యూనిట్లతో పాటు 100 ట్యాంకులు, 100 అక్వేరియం యూనిట్లు పెట్టాం. 20 రకాల చేపల్ని ఉత్పత్తి చేస్తున్నాం. – ఆర్.అలోక్, జె.ధీరజ్, ఆనందజ్యోతి ఆర్నమెంటల్ ఫిషరీస్ ఫామ్, కర్నూలు రూ.1.50 లక్షలు పెడితే రూ.8 లక్షల ఆదాయం.. ప్రభుత్వ సహ కా రంతో గతేడాది కర్నూ లులో అలంకార చేపల సాగు ప్రారంభించాం. ఎకరాకు ఓ పంటకు 1.50 లక్షల పెట్టుబడి పెడితే.. రూ.8 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ప్రస్తుతం సాగు చేస్తున్న అలంకార చేపల చెరువులను అర్నమెంటల్ ఫిష్ కల్చర్ మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నాం. – రెడ్డిపోగు అశోక్, మామిదాలపాడు, కర్నూలు జిల్లా -
చేపల ఉత్పత్తిలో గణనీయ పురోగతి సాధించిన ఏపీ
-
భారతీయ చేపల ప్యాకెట్లపై కరోనా!
బీజింగ్: భారత్ సహా వేర్వేరు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న చేపల ప్యాకెట్లపై కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు చైనా అధికారులు ప్రకటించారు. ఇండియా, రష్యా, అర్జెంటీనా తదితర దేశాల నుంచి వచ్చిన ఈ ప్యాకెట్లను పరీక్షించగా వాటిపై కరోనా ఆనవాళ్లు ఉన్నట్లు స్పష్టంగా తేలిందని బుధవారం గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఇండియా నుంచి వచ్చిన రెండు బట్టర్‌ఫిష్ ప్యాకెట్లు, రష్యా నుంచి వచ్చిన ఒక సాల్మన్ ఫిష్ ప్యాకెట్, అర్జెంటీనా నుంచి దిగుమతి చేసుకున్న రెండు బీప్ ప్యాకెట్ల ఉపరితలాలపై కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించామని అధికారులు తెలిపినట్లు పేర్కొంది. 20 దేశాల నుంచి వచ్చిన వివిధ ఉత్పత్తుల ప్యాకెట్లపైనా వైరస్ ఉన్నట్లు వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు. భారత్ నుంచి దిగుమతి అయిన ప్యాకెట్లపై వైరస్ ఆనవాళ్లు ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఇది రెండోసారి. దిగుమతుల పరీక్షలు, నిబంధనల విషయంలో చైనా అసంబద్ధంగా వ్యవహరిస్తోందని, ఇది వాణిజ్యాన్ని దెబ్బతిస్తోందని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. -
ఈయూకు చేపల ఎగుమతి తాత్కాలికంగా నిలిపివేత
బ్రెసిలియా: యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చేపల ఎగుమతిపై బ్రెజిల్ తాత్కాలికంగా నిలిపివేసింది. కొన్ని బ్రెజిల్ సంస్థలు ఆహార భద్రత నిబంధనలు పాటించడంలో అక్రమాలను కనుగొన్న నేపథ్యంలో ఈ నిలిపివేతను ప్రకటించింది. సెప్టెంబర్‌లో ఈయూ నిర్వహించిన ఆడిట్ నేపథ్యంలో జనవరి 3నుంచి విరామం కార్యాచరణను అమలులో పెట్టనున్నట్లు బ్రెజిల్ వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ కార్యాచరణలో భాగంగా యూరప్‌కు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసే బ్రెజిల్ ఓడలను తనిఖీ చేపట్టారు. పది కంపెనీలకు గాను 6 కంపెనీల్లో తనిఖీ అధికారులు సమస్యలను కనుగొన్నారు. -
ఆక్వాలో కృష్ణా ఫస్ట్
- సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కితాబు - జిల్లాలో పాలీహౌస్ టెక్నాలజీకి హామీ - ఉదయం 10.30 నుంచి రాత్రి వరకు సమీక్ష - శాఖలవారీగా విడివిడిగా చర్చ - హాజరైన మంత్రులు, సీఎస్, 13 జిల్లాల కలెక్టర్లు సాక్షి, విజయవాడ : ‘చేపల ఎగుమతుల్లో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్పత్తి, ఎగుమతుల్లో రూ.7వేల కోట్ల టర్నోవర్ సాధించిన కృష్ణాజిల్లాను మిగిలిన జిల్లాలు ఆదర్శంగా తీసుకోవాలి.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ‘ప్రాథమిక రంగ మిషన్ ద్వారా రెండంకెల వృద్ధిరేటు సాధన’పై నగరంలోని ఎ.కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మొదలుకుని నీటిపారుదల శాఖ వరకు అన్ని ప్రధాన శాఖలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. పలు ప్రభుత్వ ప్రధాన అంశాలపై సీఎం సమీక్ష సాగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మొదలైన సమావేశం రాత్రి 10.30 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా సీఎం పలు అంశాలపై విస్తృతంగా చర్చించడంతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నిర్వహించారు. ఆగిరిపల్లి ఫుడ్‌పార్క్‌కు ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం తొలుత ఉద్యానవన శాఖ సమీక్షతో సమావేశం మొదలైంది. ఒక్కో శాఖపై దాదాపు గంటకుపైగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న ప్రభుత్వ పథకాల తీరుతెన్నుల్ని ఆయా శాఖల రాష్ట్ర కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వివరించగా, జిల్లాల్లోని పరిస్థితిని, అమలవుతున్న విధానాలను కలెక్టర్లు వివరించారు. ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించిందని సీఎం చెప్పారు. అలాగే, రాష్ట్రంలో ఉన్న నూతన ఫిషరీస్ పాలసీ కూడా ఎక్కడా అమలులో లేదన్నారు. ఆగిరిపల్లికి మంజూైరైన ఫుడ్‌పార్క్‌కు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమవుతోందని, అది రాగానే దానికి అనుగుణంగా పనులు మొదలవుతాయని వివరించారు. పాల ఉత్పత్తిలో మూడోస్థానం పాల ఉత్పత్తిలో కృష్ణాజిల్లా మూడో స్థానంలో ఉందని, ఉభయగోదావరి జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయని సీఎం చెప్పారు. 18.2 శాతం వృద్ధిరేటు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనికి అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని చెప్పారు. ప్రతి ప్రైమరీ సెక్టార్‌కు ఒక జాయింట్ కలెక్టర్‌ను నియమించామన్నారు. కృష్ణాజిల్లా హర్టీకల్చర్లో నూతన పద్ధతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఇజ్రాయెల్‌లో అమల్లో ఉన్న పాలీహౌస్ టెక్నాలజీని కృష్ణాజిల్లాలో ప్రారంభించనున్నామని, దీనికోసం రూ.3కోట్ల నిధులు మంజూరు చేశానని చెప్పారు. ఇది డ్రిప్ ఇరిగేషన్ కంటే సూక్ష్మంగా ఉంటుందని, మొక్కకు ఎక్కువ నీరు ఇచ్చేలా పనిచేస్తుందని, కూరగాయలు, పండ్లతోటల సాగులో దీనిని ఎక్కువగా వినియోగించేలా అందరూ దృష్టి సారించాలని కోరారు. మంత్రులు, కలెక్టర్లు హాజరు ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథ్‌రెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్, కిమిడి మృణాళిని, పీతల సుజాత, రావెల కిషోర్‌బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అచ్చెన్నాయుడు, శిద్దా రాఘవరావు, ప్రభుత్వ సలహాదారులు పరకాల ప్రభాకర్, జె.సత్యనారాయణ, జీవీ కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్పీ టక్కర్, టి.విజయ్‌కుమార్, ముఖ్య కార్యదర్శులు కేఎస్ జవహర్‌రెడ్డి, ఆదిత్యనాథ్ దాస్, కరికల వలన్, ఎస్.ప్రేమ చంద్రారెడ్డి, సాల్మన్ ఆరోగ్య రాజ్, శశిభూషణ్, డి.శ్రీధర్, బి.రామాంజనేయులు, 13 జిల్లాల కల్టెకర్లు పాల్గొన్నారు. ఈ-పోస్పై కలెక్టర్‌కు అభినందన జిల్లాలో కలెక్టర్ బాబు.ఎ అమలు చేస్తున్న ఈ-పోస్ విధానం ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నారని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. చౌకధరల దుకాణాల్లో దీనిని అమలు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో వేగంగా పని జరుగుతుందని, అలాగే ఎరువులు, విత్తనాల బ్లాక్ మార్కెట్ నియంత్రణలో కూడా దీనిని ఉపయోగించవచ్చని కలెక్టర్ బాబు.ఎ సీఎం చంద్రబాబుకు వివరించారు. రానున్న రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని చౌకడిపోల్లో దీనిని అమలు చేయాలని సీఎం సూచిస్తూ కలెక్టర్‌ను అభినందించారు.