డ్రగ్ మాఫియా వల్ల ప్రమాదంలో మత్స్య పరిశ్రమ
ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్
మహారాణిపేట: సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ దిగుమతి చేసుకున్న 25 వేల కిలోల ఇన్ యాక్టివ్ డ్రై ఈస్ట్‌లో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలడం మత్స్య ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం విశాఖ ఫిషింగ్ హార్బర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అక్రమ రవాణా వల్ల 20 ఏళ్ల క్రితం కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి భూమి ఇచ్చిన మత్స్యకారుల త్యాగానికి విలువ లేకుండా పోయిందన్నారు.
భూములిచ్చిన 766 మంది మత్స్యకారులకు ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలు ఇస్తామన్న మాటను ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. దేశ అభివృద్ధి కోసం విశాఖ పోర్ట్ యాజమాన్యానికి భూములిస్తే వారు ప్రైవేటు వ్యక్తులకు కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి భూములు అప్పగించారన్నారు. కంటైనర్ టెర్మినల్‌లో ప్రైవేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో అంతర్జాతీయ స్మగ్లర్లు అక్రమ వ్యాపారాలకు విశాఖను ఎంచుకుంటున్నారన్నారు. దీనివల్ల విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినడమే కాకుండా మత్స్య ఎగుమతులపై ప్రభావం చూపుతుందన్నారు.
ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు భారత మత్స్య పరిశ్రమకు రాయితీలు, ప్రోత్సాహకాలు రద్దు చేయాలని నిర్ణయించడం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ యాజమాన్యం నిర్వాకాలతో మత్స్య పరిశ్రమ, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంధ్యా ఆక్వా సంస్థతో పాటు విశాఖ కంటైనర్ టెర్మినల్, జేఎం బక్షి సంస్థలను దీనికి బాధ్యులుగా చేసి సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు కంటైనర్ దిగుమతులను విశాఖ పోర్ట్ అథారిటీ స్వయంగా పరిశీలించాలని కోరారు.
దిగువ స్థాయి కస్టమ్స్ అధికారులు ప్రమేయం లేకుండా ఇదంతా జరగదని, వీసీటీపీఎల్, జేఎం భక్షి సంస్థలు ఇందుకు బాధ్యత వహించాలన్నారు. విశాఖకు దిగుమతి అవుతున్న ప్రతి కంటైనర్‌ను పూర్తిగా స్కానింగ్ చేసిన తర్వాత దేశంలోకి అనుమతించాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు దూడపోలయ్య, గుంటు దానయ్య, వాసుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు .
Comments
Please login to add a commentAdd a comment