డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన | In front of DSP office made hunger strike | Sakshi
Sakshi News home page

డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన

Published Thu, Aug 29 2013 5:37 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

In front of DSP office made hunger strike

ఆత్మకూరు, న్యూస్‌లైన్: ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం ఎదుట గండ్లవీడు దళితులు బుధవారం నిరాహార దీక్షలకు ఉపక్రమించారు. పోలీసులు వీరి దీక్షలను భగ్నం చేశారు. వారిని బైండోవర్ చేసుకున్నారు. బాధితుల కథనం మేర కు.. గండ్లవీడులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయమై అగ్రవర్ణాలకు, దళితులకు మధ్య వివాదం నెలకొంది. ఈ విషయంలో గ్రామంలోని దళితులను సామాజికంగా బహిష్కరించారు.
 
 దీనిపై దళితులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదు. దీంతో బాధితులు ఇటీవల ఎస్పీని కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. ఆయన బుధవారం డీఎస్పీని కలవాల్సిందిగా సూచించారు. ఎస్పీ సూచన మేరకు గండ్లవీడు దళితులు బుధవారం డీఎస్పీ రాజామహేంద్రనాయక్‌ను కలిసి తమను దూషించిన అగ్రవర్ణాల వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్పీ కేసు విచారణలో ఉందని సమాధానమిచ్చారు. ఐదు నెలలవుతున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అందుకే తాము ఎస్పీని కలిశామని, ఆయన మిమ్మల్ని కలవమని సూచించారని వివరించారు. అక్కడి నుంచి తమకేమీ ఆదేశాలు రాలేదని డీఎస్పీ సమాధానమివ్వడంతో కార్యాలయం ఎదుట దళితులు దీక్షలకు ఉపక్రమించారు. షామియానా వేసి దీక్షలకు పూనుకొంటుండగా పోలీసులు రంగప్రవేశం చేసి వారందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 
 నాలుగు గంటల వరకు
 పోలీస్‌స్టేషన్లో నిరీక్షణ
 స్టేషన్‌కు తరలించిన దళితులపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. వారిని బైండోవర్ చేసుకునేందుకు సాయంత్రం నాలుగు గంటల వరకు స్టేషన్లోనే ఉంచారు. దీంతో పోలీస్‌స్టేషన్లోనే సంకే రాజమ్మ అనే మహిళ కుప్ప కూలిపోయింది. పోలీసుల కాపలాతో వైద్యం చేయిస్తామని అధికారులు చెప్పడంతో దళితులు ఆశ్చర్యపోయారు. న్యాయం కోసం వస్తే దోషుల్లాగా చూస్తారా అంటూ తమకు వైద్యం అవసరం లేదని ఖరాకండిగా చెప్పారు. సాయంత్రం నాలుగుగంటలకు వారిని వదిలిపెట్టారు.
 
 ఎస్‌ఐ కక్ష సాధింపు
 ఎస్‌ఐ ఆంజనేయరెడ్డి దళితులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని న్యాయవాది నాపా పద్మజ ఆరోపించారు. ఈ సంఘటనపై సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసు నమోదు చేసి ఐదు నెలలవుతున్నా నిందితులను అరెస్టు చేయకుండా అగ్రవర్ణాలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ అధికారి కూడా గ్రామానికి వచ్చి విచారించలేదని చెప్పారు. నిందితులను అరెస్టు చేసేవరకు ఆందోళన చేస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement