జర్నలిస్టుల సంక్షేమంలో వైఎస్సారే స్ఫూర్తి
- ఏపీయూడబ్ల్యూజే ముగింపు సభలో జగన్‌మోహన్ రెడ్డి
- జర్నలిస్ట్ నాయకులకు జ్ఞాపికలు అందజేత
ఏఎన్‌యూ : జర్నలిస్టుల సంక్షేమం, ప్రయోజనాల కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆదర్శమైన చర్యలు తీసుకున్నారని ఆయన స్పూర్తితోనే జర్నలిస్టుల సంక్షేమం, ప్రయోజనాల కోసం పాటుపడతామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. కుంచనపల్లిలోని కేఎల్ యూనివర్సిటీలో రెండు రోజులపాటు జరిగిన ఏపీయూడబ్ల్యుజే (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) 34వ మహాసభల ముగింపు సభ మంగళవారం సాయంత్రం జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమాజంలో జర్నలిజానికి ఉన్న శక్తిని గురించి వివరించారు.
ప్రజా సమస్యలు, వారి సంక్షేమాన్ని ప్రభుత్వానికి తెలియజేయడంలో జర్నలిజం ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రనే పోషించాలన్నారు. వార్తా సంస్థల యాజమాన్యాలను రాజకీయ పార్టీలు విభేదిస్తామేమో కానీ జర్నలిస్టులతో ఎపుడూ విభేదించవని చెప్పారు. జాతీయ స్థాయిలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చేసే ప్రయత్నాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, పార్టీ నాయకులు కీలకపాత్ర పోషించాలని ఏపీయూడబ్ల్యుజే నాయకులు చేసిన విన్నపానికి సానుకూలంగా స్పందించిన జగన్ ఆ విషయంలో తామెపుడూ ముందుంటామని హామీ ఇచ్చారు. ఐజేయూ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ జగన్‌మోహన్ రెడ్డిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గ నాయకులు, మిమిక్రీ కళాకారుడు సిల్వస్టర్‌లకు జగన్ జ్ఞాపికలు అందజేశారు.
మార్మోగిన కరతాళ ధ్వనులు
సభలో జర్నలిస్టుల సమస్యలు, జర్నలిస్టుల పాత్ర, సమాజంలో పరిస్థితులపై జగన్ ప్రసంగిస్తున్నపుడు కరతాళ ధ్వనులు మార్మోగాయి. కార్యక్రమం ముగిసిన తరువాత జగన్‌మోహన్ రెడ్డితో కరచాలనం చేసేందుకు, ఫోటోలు దిగేందుకు ఏపీయూడబ్ల్యుజే సభ్యులు ఉత్సాహం కన బరిచారు.
విద్యార్థుల నినాదాలతో మార్మోగిన కేఎల్‌యూ
జై జగన్, జోహార్ వైఎస్సార్ అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో కేఎల్ యూ ప్రాంగణం మార్మోగింది. ఏపీయూడబ్ల్యుజే మహాసభల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జగన్‌కు కేఎల్‌యూ ద్వారం వద్ద విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమం ముగిసిన అనంతరం జగన్‌మోహన్‌రెడ్డితో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. కేఎల్‌యూ సిబ్బంది, అధికారు లు కూడా జగన్‌మోహన్ రెడ్డిని చూసేం దుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వారి ఉత్సాహాన్ని గమనించి జగన్ వా హనం దిగి వారికి అభివాదం చేశారు.
విద్యార్థినులు, సిబ్బందిని ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు, కేఎల్‌యూ చైర్మన్ సత్యన్నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, వంగవీ టి రాధా, పేర్నినాని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, నా యకులు నసీర్ అహ్మద్, గులాం రసూ ల్, దొంతిరెడ్డి వేమారెడ్డి, మున్నంగి గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.