ప్రసంగిస్తున్న జస్టిస్ కురియన్ జోసెఫ్
న్యాయస్థానాలు–మీడియా పరస్పర సహకారంతో పనిచేయాలి
జ్యుడీషియల్ ప్రాంతీయ సదస్సులో న్యాయమూర్తులు
విశాఖ–లీగల్: ‘కోర్టులు–మీడియా పరస్పర సహకారం, సమన్వయంతో పని చేయాలి. జవాబుదారీతనంతో కూడిన పనితీరును ప్రదర్శిస్తూ, బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపైనా విశ్లేషణ అవసరమని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాలులో రెండు రోజులుగా కొనసాగుతున్న సౌత్ జోన్–2 జ్యుడీషియల్ ప్రాంతీయ సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు ‘జ్యుడీషియరీ అండ్ మీడియా, అడ్వాన్సింగ్ జ్యుడీషియల్ గవర్నెన్స్ త్రూ ఎమెర్జింగ్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్’ అనే అంశాలపై చర్చ నిర్వహించారు.
ముందుగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన ‘కోర్టులు–మీడియా పాత్ర’ అనే అంశంపై చర్చ జరిగింది. రిసోర్స్ పర్సన్లుగా కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవన్ రామచంద్రన్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌషిమి భట్టాచార్య వ్యవహరించారు. అనంతరం ‘అడ్వాన్సింగ్ జ్యుడీషియల్ గవర్నెన్స్’పై జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన చర్చ నిర్వహించారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ముస్తాక్యు, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సుందర్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించారు.
జస్టిస్ కురియన్ జోసెఫ్ మాట్లాడుతూ సమాచారాన్ని చేరవేయడంలో మీడియా పాత్ర, తీర్పులు, ఇతర కోర్టు ప్రొసీజరల్ అంశాల్లో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఆవశ్యకతను న్యాయమూర్తులు తెలుసుకోవాలని, వినియోగంపై విశ్లేషణ చేసుకోవాలని సూచించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలు ప్రస్తుతం పోషిస్తున్న పాత్రపై అవగాహన కలిగి ఉండటంతోపాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవన్ రామచంద్రన్ మాట్లాడుతూ నిజాలను నిర్ధారించుకుని వాస్తవాలను వార్తలుగా ప్రచురించాలని సూచించారు. ట్రయల్ అంశాలను ముందుగా బహిర్గతం చేయకూడదని హితవుపలికారు.
జస్టిస్ ఎం.సుందర్ కోర్టు వ్యవహారాల్లో ఏఐ పాత్ర గురించి వివరించారు. ఏఐ అనేది న్యాయమూర్తులకు సహకారిగా మాత్రమే ఉంటుందని, ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు ఏఐ టెక్నాలజీని పరిగణనలోకి తీసుకోవచ్చని, కానీ.. దానినే తుది నిర్ణయంగా, అంతిమ ప్రామాణికంగా తీసుకోకూడదని పేర్కొన్నారు. జస్టిస్ ఏఎం ముస్తాక్యు మాట్లాడుతూ కేరళలో కోర్టు వ్యవహారాల నివేదికలను రూపొందించేందుకు ఏఐ, గూగుల్ నోట్‌బుక్ సాయం తీసుకుంటున్నామని తెలిపారు. ఏఐ వినియోగంలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్ జస్టిస్ రవినాథ్ తిల్హారీ వందన సమర్పణ చేశారు. విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవీ శేషమ్మ, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment