ఆర్భాటమేనా?
కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్ : కళ్యాణదుర్గం మార్కెట్‌యార్డులో వేరుశనగ కొనుగోలు కేంద్రం ఉందా.. లేదా..అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. క్వింటాలు రూ.4 వేలతో కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కాయను కేంద్రానికి తీసుకొస్తున్నారు. అయితే కొనుగోలు చేయడానికి సంబంధిత ఆయిల్‌ఫెడ్ అధికారులు అందుబాటులో లేరు. దీంతో రోజుకు 50 మంది చొప్పున రైతులు మూడు రోజులుగా యార్డు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నియోజకవర్గంలో ఖరీఫ్‌లో 95 వేల హెక్టార్లలో వేరుశనగ సాగైంది.
ఇందులో 80 శాతం వేరుశనగ కాయలను క్వింటాలు రూ.3 వేలు చొప్పున ఇప్పటికే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించారు. తతిమా 20 శాతం మంది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాలు రూ.4వేలతో కాయలను విక్రయించుకుందామని ఆశపడి భంగపాటుకు గురయ్యారు. ఇదే విషయమై మార్కెట్ డిప్యూటీ మేనేజర్ రాజశేఖరరెడ్డిని ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా.. ఇంతవరకూ కొనుగోలు చేయనిది వాస్తవమేనన్నారు. రెవెన్యూ అధికారులతో ధ్రువీకరణపత్రాలు తీసుకుని బుధవారం నుంచి వస్తే వేరుశనగ కొనుగోలు చేస్తామని చెప్పారు.