
మున్సిపాలిటీల్లో ఎగరనున్న వెఎస్‌ఆర్ సీపీ జెండా
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో వైఎస్‌ఆర్ సీపీ జెండా ఎగరనుంది. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలతోపాటు చిత్తూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరు మున్సిపాలిటీల్లోనూ వైఎస్‌ఆర్ సీపీ హవా కొనసాగుతోంది.పుంగనూరు మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. ఇందులో 20 వార్డుల్లో వైఎస్‌ఆర్ సీపీ విజయం సాధిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.
మిగిలిన నాలుగు వార్డుల్లో వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ మధ్య పోటీ ఉంటుందనేది పరిశీ లకుల భావన. వైఎస్‌ఆర్ సీపీ వారు మాత్రం ఈ నాలుగు వార్డులను కూడా తప్పకుండా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.నగరి మున్సిపాలిటీలో 27 వార్డులు ఉన్నాయి. 20 వార్డుల్లో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు విజయదుందుభి మోగిస్తారని స్థానికులు చెబుతున్నారు. మిగిలిన ఏడు వార్డుల్లో వైఎస్‌ఆర్ సీపీ,టీడీపీ మధ్య పోటీ ఉంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్‌ఆర్ సీపీలో చేరడంతో పార్టీ మున్సిపల్ పరిధిలో పటిష్టంగా ఉంది. ఆర్కేరోజా నాయకత్వంలో వైఎస్‌ఆర్ సీపీ వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
పుత్తూరు మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ నేత అమ్ములు పార్టీలో చేరడంతో మున్సిపల్ పరిధిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ బలం పుంజుకుంది. అమ్ములుకు పలు వార్డుల్లో పట్టు ఉంది. 20 వార్డులు వైఎస్‌ఆర్ సీపీ గెలుపొందే అవకాశం ఉందనేది పరిశీలకుల మాట.మదనపల్లె మున్సిపాలిటీలో 35 వార్డులు ఉన్నాయి. ఇందులో స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఏకగ్రీవమయ్యారు. 34 వార్డుల్లో 20 వార్డులు వైఎస్‌ఆర్ సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మిగిలిన వార్డుల్లో టీడీపీతో పోటీ ఉంటుందని, వైఎస్‌ఆర్ పెట్టిన పథకాల వల్ల లబ్ధిపొంది న అనేకమంది ఓటర్లు వైఎస్‌ఆర్ సీపీ వైపే ఉన్నారనేది స్థానికుల మాట.
పలమనేరులో 24 వార్డులు ఉన్నాయి. సగం వార్డులకు పైగా వైఎస్‌ఆర్ సీపీ గెలుస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. 10 వార్డుల్లో టీడీపీ వైఎస్‌ఆర్ సీపీ మధ్య పోటీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.హస్తి మున్సిపాలిటీలో వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖపోటీ జరగనుంది. ఈ మూడు పార్టీల్లో వైఎస్‌ఆర్ సీపీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని పలువురు పరిశీలకులు చెబుతున్నారు.
చిత్తూరు నగర కార్పొరేషన్‌లో వైఎస్‌ఆర్ సీపీ, స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి దించిన సీకే బాబు వర్గాల మధ్య పోటీ జరగనుంది. జిల్లా కేంద్రంలో మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ద్వారా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సీకే బాబు కార్యక్రమాలు చేపట్టారే తప్ప తన సొంత కార్యక్రమాలేమీ కాదని, ఆయన చేసిన కార్యక్రమాలు వైఎస్‌ఆర్ ద్వారానే సాధ్యమైందనే ఆలోచనను ఓటర్లకు చెప్పి వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సీకే బాబు వర్గం వారు కూడా ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఈ రెండు వర్గాల మధ్యనే పోటీ ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వేలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్‌ఆర్ సీపీ జెండా ఎగుర వేస్తుందని వెల్లడైనట్లు విశ్వసనీయ సమాచారం.