
కదం తొక్కిన కార్మికులు
పాడేరులో భారీ ర్యాలీ
ఐటీడీఏ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు
2 గంటలు రోడ్డుపై ధర్నా
ప్రభుత్వ పోకడలకు నిరసనగా కార్మికులు గురువారం పాడేరులో కదం తొక్కారు. ఏజెన్సీలోని పలు ప్రభు త్వ సంస్థల్లో పని చేస్తున్న ఆశ కార్యకర్తలు, హాస్టల్ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖలో ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు యాని మేటర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం ఐటీడీఏను ముట్టడించారు. కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో రెండు గంటలపాటు బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పాడేరు: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కక్షసాధింపు చర్యలకు నిరసనగా ఏజెన్సీలోని పలు ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులు గురువారం ఐటీడీఏను ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాడేరులో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మన్యంలోని 11 మండలాల్లో పని చేస్తున్న ఆశ కార్యకర్తలు, హాస్టల్ వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు యానిమేటర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో తొలుత భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఐటీడీఏను ముట్టడించారు. కార్యాలయం లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు గేట్లు మూసివేసి అడ్డుకున్నారు.
శాంతియుతంగానే ఆందోళన చేపడతామని పోలీసు అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయింది. సీఐ ఎన్.సాయి, ఎస్‌ఐలు ధనుంజయ్, సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో కార్మికులు ఐటీడీఏ ఎదుట బైఠాయించారు. వేలాదిమందితో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. కాంప్లెక్స్ రోడ్డుపై కూడా కార్మికులు కూర్చొని సుమారు 2 గంటలపాటు ధర్నా చేపట్టారు. నినాదాలతో ఐటీడీఏ దద్దరిల్లింది.
కార్మికులకు అన్యాయం
ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.కోటేశ్వరరావు ఆరోపించారు. ఆందోళనకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అతి తక్కువ రూ.400 వేతనంతో వెట్టి చాకిరీ చేస్తున్న ఆశ కార్యకర్తలకు 14 నెలలుగా జీతాలివ్వకపోవడం దుర్మార్గం అన్నారు.అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కరువైందన్నారు. డ్వాక్రా సంఘాల నిర్మాణానికి అహర్నిశలు కృషి చేస్తున్న వెలుగు యానిమేటర్లకు కూడా బకాయి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికులపై కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ వేధింపులు అధికమయ్యాయన్నారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ సిబ్బంది, హౌసింగ్‌లోని వర్క్‌ఇన్‌స్పెక్టర్‌లను కూడా అకారణంగా తొలగిస్తున్నారన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ ఏపీవో పీవీఎస్ నాయుడుకు ఇచ్చారు. వారం రోజుల్లో ఆశ కార్యకర్తల14 నెలల బకాయిలు చెల్లిస్తామని, ఇతర కార్మికుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వె ళతామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు ఉమా మహేశ్వరరావు, శంకరరావు, ఎల్.సుందరరావు, సీపీఎం నేత కె.సురేంద్ర, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్సయ్య, అంగన్‌వాడీ వర్కర్ల సంఘం ప్రతినిధులు అంబాలమ్మ, వి.భాగ్యలక్ష్మి, అన్నపూర్ణ, కళావతి, ఆశ కార్యకర్తల సంఘం ప్రతినిధులు వై.మంగమ్మ, శ్రీదేవి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం ప్రతినిధులు పి.లక్ష్మి, ఎస్.హైమావతి, వీఆర్‌పీల సంఘం నేతలు రామస్వామి, కోటేశ్వరరావు, యానిమేటర్ల సంఘం ప్రతినిధులు ప్రకాష్, భాను పాల్గొన్నారు.