పోరంకిలో భారీ దొంగతనం
రూ.21 లక్షల విలువైన సొత్తు అపహరణ
పోరంకి (పెనమలూరు) : పోరంకి గ్రామం నారాయణపురం కాలనీలో గురువారం వేకువజామున ఓ ఇంటి తాళాన్ని దొంగలు పగులగొట్టి రూ.21 లక్షలు విలువ చేసే సొత్తు అపహరించుకుపోయారు. పెనమలూరు పోలీ సులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోరంకి నారాయణపురం కాలనీలోని ప్లాట్ నంబరు 11లో కాంట్రాక్టర్ పెందుర్తి రంగవరప్రసాద్, పాపాయమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేరు. కాగా దంపతులు బ్యాంక్ పనిమీద ఈనెల 26న జిల్లాలోని రుద్రపాక గ్రామానికి వెళ్లారు. రంగవరప్రసాద్ ఇంట్లో పని చేసే మహిళ గురువారం ఉదయం వచ్చి చూడగా ఆయన ఇంటి తాళం పగులగొట్టి ఉంది. పక్కనే ఉన్న వారి బంధువులకు ఈ విషయాన్ని చెప్పింది. వారు అందజేసిన సమాచారంతో తూర్పు డివిజన్ ఏసీపీ మహేశ్వరరాజు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. దీనిపై సమాచారం అందుకున్న రంగవర ప్రసాద్ దంపతులు తిరిగి వచ్చి బీరువాలో దాచిన దాదాపు 70 కాసుల బంగారు ఆభరణాలు, 12 కిలోల వెండి వస్తువులు, రూ.90 వేల నగదు, 12 పట్టుచీరలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. మేనల్లుడి పెళ్లి ఉండటంతో బంగారమంతా ఇంట్లోనే ఉంచామని, అవన్నీ చోరీకి గురయ్యాయని బాధిత దంపతులు పోలీసులకు వివరించారు.
పెళ్లి కోసం ఉంచిన వస్తువులు ఎత్తుకెళ్లారు
కాగా రంగవరప్రసాద్ మేనల్లుడు పాలడుగు రాజేష్‌కుమార్ పెద ఓగిరాలలో ఉంటున్నాడు. అతనికి తండ్రి లేడు. రాజేష్‌కుమార్ నిశ్చి తార్థం వచ్చేనెల 22న వివాహం మార్చి నాలుగో తేదీన ఉంది. ఈ పెళ్లిని వీరే జరి పించాల్సి ఉంది. వివాహం కోసం రాజేష్ 20 కాసుల బంగారాన్ని మేనమామ ఇంటిలో ఉంచాడు. అపహరణకు గురైన సొత్తులో అవి కూడా ఉన్నాయి. పెనమలూరు పోలీస్‌స్టేషన్ సిబ్బందితోపాటు సీసీఎస్ సీఐ సుబ్బారావు సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు.
సీసీ కెమెరాలు, వాచ్మెన్లు ఉన్నా..
ఇదిలా ఉండగా, కాలనీలో దొంగలు 44, 45 ప్లాట్లతో పాలు పలు ఇళ్లలో చోరీకి యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. వాటి యజమానులు ఇళ్లలో ఉండటంతో దొంగల ప్రయత్నం ఫలించలేదు. కాలనీలో సీసీ కెమెరాలు, వాచ్మెన్లు ఉన్నా దొంగలు చాకచక్యంగా భారీ చోరీకి పాల్పడటంతో స్థాని కులు, పోలీసులు కంగుతిన్నారు. రంగవరప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఆఫీసులో దాచిన బంగారం మాయం
సత్యనారాయణపురం : ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళాలు పగుల కొట్టి నగలు, నగదు దోచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యనారాయణపురం అడివి శేషగిరిరావు వీధిలో సి.హెచ్.దుర్గారావు నివసిస్తున్నారు. ఇతను ఇటీవల ఇల్లు ఖాళీ చేసి పటమటకు వెళ్లి పోయారు. గతంలో ఉన్న ఆ ఇంటిని ఆఫీసుగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బ్యాంక్‌నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని ఆఫీసులో ఉంచారు. ఎప్పటిలానే బుధవారం తాళ ం వేసి వెళ్లారు. గురువారం వచ్చి చూసే సరికి తాళం తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా అల్మారాలో ఉంచిన తొమ్మిది గ్రాముల నగలు, రెండు వేల నగదు కనిపించలేదు. దీంతో సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సింగ్‌నగర్‌లో మరో ఘటనలో...
మధురానగర్ : సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంటిలో దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్‌నగర్ ఎక్సెల్‌ప్లాంట్ రోడ్డులో బొకెనాల శాంతి కుటుంబం నివాసం ఉంటోంది. శాంతి 27న ఇంటికి తాళం వేసి తల్లితో కలసి గొల్లపూడి నల్లకుంటలో ఉంటున్న చెల్లెలి ఇంటికి వెళ్లారు. 28వ తేదీ రాత్రి వచ్చి చూసేసరికి ఇంటి వెనుక తలుపు తెరచి ఉంది. ఇంట్లోని బీరువా పగులగొట్టి ఉంది. ఇంట్లోని 57 గ్రాముల బంగారు వస్తువులు, బ్రాస్‌లెట్, రింగ్, చెవిదిద్దులు, పట్టీలు,30 వేల నగదు మాయమయ్యాయి. శాంతి తల్లి మిర్యాల సత్యవతి ఫిర్యాదు మేరకు సింగ్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బాలమురళీకృష్ణ పరిస్థితిని పరిశీలించారు.