- ఈనెల 30న మున్సిపల్ వార్డులకు ఎన్నికలు
- మే 9న ఎంపీ, ఎమ్మెల్యేలకు రెండు ఓట్లు
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల్లో మున్సిపల్ ఓటర్లు ఒక ఓటు అదనంగా వేయాల్సి ఉంది. ఒకటి మున్సిపాలిటీకి, మరో రెండు ఓట్లు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నిక కోసం... అసెంబ్లీకి, పార్లమెంటుకు జమిలి ఎన్నికలు జరిగే అతి కొద్ది రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి. ఊహించని అతిథిలా మున్సిపోల్స్ కూడా హఠాత్తుగా రావడంతో పట్టణ ప్రజలకు మూడో ఓటు కూడా వేసే అవకాశం లభించింది. అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు జీవీఎంసీలో విలీనం కావడంతో నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. సీమాంధ్రలో లోక్‌సభ, అసెంబ్లీలకు మే 7న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది.
జిల్లాలోని రెండు మున్సిపాలిటీలకు ఇవి తొలి ఎన్నికలు. నర్సీపట్నంలోని 27 వార్డులకు, యలమంచిలిలోని 24 వార్డులకు ఈనెల 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు మున్సిపాలిటీల ఓటర్లు వార్డు కౌన్సిలర్‌ను ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. వచ్చే నెల 2న జరగనున్న కౌంటింగ్‌లో గెలుపొందే కౌన్సిలర్లు పరోక్ష పద్ధతిలో చైర్మన్‌ను ఎన్నుకుంటారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ మున్సిపాలిటీ పట్టణాల్లోని ప్రజలు మే 7న నర్సీపట్నం, యలమంచిలి ఎమ్మెల్యేలతోపాటు అనకాపల్లి ఎంపీ ఎన్నిక కోసం రెండు బ్యాలెట్లపై తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ విధంగా రెండు పట్టణాలకు చెందిన ఓటర్లంతా వరుసగా మూడు బ్యాలెట్లు వినియోగించాల్సి ఉంటుంది. ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన నేపథ్యంలో మూడు ఎన్నికలను ఎలా భరించాలోనని రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మూడు ఓట్లు వేయాల్సిన పట్టణ ఓటర్లకు మాత్రం ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది.
పీపుల్స్ మేనిఫెస్టో
మౌలిక వసతులపై దృష్టి సారించాలి
కొత్తగా ఎన్నికైన పాలకవర్గాలు ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలి. 24 గంటలు తాగునీటి సౌకర్యం కల్పించడంతోపాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలి. విస్తరిస్తున్న ప్రాంతాలకు రోడ్డు, విద్యుత్ సౌకర్యం కల్పించాలి. కొత్తగా వెలుస్తున్న కాలనీలు సమస్యలతో సతమతమవుతున్నాయి. వీటిని పరిష్కరించే బాధ్యతను కొత్త పాలకవర్గం వహించాలి. పట్టణంలో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పూనుకోవాలి. మున్సిపాలిటీ ఏర్పాటయ్యాక తొలిసారి జరుగుతున్న ఎన్నికలివి. ప్రజలు సంతృప్తి చెందే విధంగా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పథంలో పాలన సాగాలి. సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా కొత్త పాలకవర్గం పాలన సాగాలి.
- పసుపులేటి శ్రీనివాసరావు
కార్యదర్శి, వినియోగదారుల ఫోరం, నర్సీపట్నం.