ఆత్మ ఘోష | In the recent past suicides | Sakshi
Sakshi News home page

ఆత్మ ఘోష

Published Sun, Sep 21 2014 4:17 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

ఆత్మ ఘోష - Sakshi

ఆత్మ ఘోష

 - ఇటీవల కాలంలో పెరిగిన ఆత్మహత్యలు
- ఈ నెలలో ఇప్పటికే 20మందికి పైగా బలవన్మరణం
- పోలీసు రికార్డుల్లోకి రానివి మరెన్నో..!
- మృతుల్లో విద్యార్థులు, యువత
- చిన్నచిన్న కారణాలకే తీవ్ర నిర్ణయాలు
నెల్లూరు(క్రైమ్): ఇంట్లో వాళ్లు పెళ్లి చేయలేదని ఒకరు..భార్య ఆమ్లెట్ వేయలేదని మరొకరు..చుట్టుపక్కల వాళ్లు హేళన చేశారని ఇంకొకరు..ఇలా చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంతో విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు. తమను కన్నవారిని, భార్యాపిల్లలను దిక్కులేని వాళ్లను చేస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఈ ఘటనలు ఎక్కువవుతుండడం ఆందోళన కలిగించే విష యం. సృష్టిలోనే మానవజన్మకు ప్రత్యేకత ఉంది. ఇది ఒక వరంగా భావిస్తారు. అయి తే కొందరు మాత్రం చిన్నచిన్న సమస్యలకే మనోస్థైర్యం కోల్పోయి తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నారు. అలాంటి వారు ఆత్మీయతలు, అనుబంధాలను ఒక్కసారి గుర్తు చేసుకుని క్షణం పాటు ఆలోచించినా జీవితాన్ని అలవోకగా జయించవచ్చు.
 
పెరుగుతున్న ఘటనలు
జిల్లాలో ఏటా 500 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఒక్క నెల్లూరు నగర పరిధిలోనే 250 ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా మరో వెయ్యిమందికి పైగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మద్యం అలవాటు, ప్రేమవిఫలం, భార్య ప్రవర్తనపై అనుమానాలు తదితర కారణాలతో ఎక్కువ శాతం మంది ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.

ఆత్మహత్యలకు ఒడిగడుతున్న వారిలో 18 నుంచి 25 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉంటున్నట్లు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో జీవన వేగం జోరందుకోవడంతో పాటు అంతే స్పీడుగా జనాన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. బాధను ఆత్మీయులతో పంచుకోవడం, సమస్య పరిష్కారానికి మార్గాలను పరిశీలించడం తదితర అంశాలు కొరవడడంతో విలువైన ప్రాణాలను త్రుణప్రాయంగా తీసుకుంటున్నారు.

మానసికంగా కుమిలిపోతున్న వారిని సకాలంలో గుర్తించకపోవడం, గుర్తించినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ప్రధానంగా విద్యార్థులు, యువతపై తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దడం కూడా ఆత్మహత్యలకు కారణమవుతోందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సినిమాల ప్రభావంతో యువత చిన్నవయస్సులోనే ప్రేమమత్తులో పడుతున్నారు. పరిపక్వత చెందని వయస్సులో సొంత నిర్ణయాలను తీసుకుని చివరకు జీవితాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తున్నారు. ఈ నెలలోనే ఇప్పటి వరకు 20 మందికి పైగా ప్రాణాలు బలవంతంగా తీసుకున్నారు. వీరిలో విద్యార్థులు, యువకులు ఉండడం ఆలోచించాల్సిన విషయం.
 
ఇటీవల చోటుచేసుకున్న ఘటనల్లో కొన్ని..
అల్లూరు మండలం ఇస్కపల్లి దళితవాడకు చెందిన కోవూరు హేమంత్‌కుమార్ (25) గ్యాస్ ఏజెన్సీలో చిరుద్యోగి. మద్యానికి బానిసవ్వడంతో తండ్రి వెంకటరత్నం మందలించాడు. మనస్తాం చెందిన హేమంత్ సముద్రంలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఆమ్లెట్ వేయలేదని భార్యపై అలిగి సంగం మండలం జెండాదిబ్బలో నాయబ్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.  నెల్లూరులోని ఫత్తేఖాన్‌పేట సకిలంవారివీధికి చెందిన మేఘన(24), శ్రీరామ్ ప్రేమ వివాహం చేసుకున్నారు.

శ్రీరామ్ దుర్వ్యసనాలకు బానిసై కట్నం కోసం వేధించడంతో మేఘన ఉరేసుకుంది.  కర్నూలుకు చెందిన దాసరి నాగశ్రావణి నెల్లూరు సమీపంలోని ఓ మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదువుతోంది.  అనారోగ్యం సమస్యతో ఆత్మహత్య చేసుకుంది.  దగదర్తి మండలం చెన్నూరుకు చెం దిన పదో తరగతి విద్యార్థిని ధరణి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  కోవూరు మండలం పాటూరు యువతి ప్రతిమారెడ్డి  ఆత్మహత్య చేసుకుంది.
 
కౌన్సెలింగే పరిష్కారం : ఎవరిలోనైనా ఆత్మహత్యకు పాల్పడే లక్షణాలు గుర్తించినా లేదా ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడినా కౌన్సెలింగ్ అత్యవసరం. కౌన్సెలింగ్‌ను స్నేహితులు, కుటుంబసభ్యులు ఎదుటి వారి మాటలు విని ఓపికగా అర్థం చేసుకొనేవారు, మానసిక, వ్యక్తిత్వ  వి కాస నిపుణులు ఎవరైనా చేయవచ్చు..ఆత్మహత్యాయత్నం చేసిన వారిని, అలాంటి ఆలోచనలో ఉన్నవారిని ఒంటరిగా వదలకూడదు.
 
ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలి
సమస్యలు వచ్చినపుడు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలే తప్ప ఆత్మహత్యలకు పాల్పడకూడదు. ఎండోజిలన్ లక్షణాలు మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి దారితీస్తాయి. సిజోఫినియా లక్షణాలున్న వారికి ఎవరో బెదింరిచినట్లు ఉండటం, ఇతర శబ్దాలేవీ వినిపించ కపోవడం తదితర కారణాలతో ఆందోళనకు గురై ప్రాణాలు తీసుకుంటారు. ఆత్మహత్య ఆలోచన వచ్చిన సమయంలో ఇష్టమైన వాటి గురించి ఆలోచించడం, స్నేహితులతో మాట్లాడడం చేయాలి. బయట ప్రశాంత వాతావరణంలో గడపాలి. తమ భవిష్యత్, కుటుంబం, పరిష్కారాల గురించి ఆలోచించకపోవడమే ఆత్మహత్యలకు ప్రధాన కారణం.
డాక్టర్ ఈదూరు సుధాకర్
 
కౌన్సెలింగ్ ఇచ్చేందుకు చర్యలు
ఇటీవల కాలంలో ఆత్మహత్య ఘటనలు పెరిగాయి. ఆత్మహత్యలకు పాల్పడడం చట్టరీత్యానేరం. ఆ ప్రయత్నం చేసిన వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చేందుకు అన్ని పోలీసుస్టేషన్లలో చర్యలు చేపట్టాం.  
 పి.వెంకటనాథ్‌రెడ్డి, నగర డీఎస్పీ, నెల్లూరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement