గన్నవరం టీడీపీలో...మూడో కృష్ణుడు
- గన్నవరం టీడీపీలో...మూడో కృష్ణుడు
- ఇప్పటికే దాసరి, వంశీ మధ్య పోటీ
- తాజాగా తెరపైకిచలసాని ఆంజనేయులు
- తెరవెనుక చక్రం తిప్పుతున్న దేవినేని ఉమా!
సాక్షి, విజయవాడ : గన్నవరం టీడీపీలో సీట్ల సిగపట్లు తారస్థాయికి చేరుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో సీటు తమదేనంటే... తమదేనంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, విజయవాడ అర్బన్ మాజీ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్‌లు పోటీ పడుతుంటే తాజాగా జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు తెరపైకి వచ్చారు. ఇప్పటికే దాసరి-వంశీల మధ్య తెలుగుదేశం కార్యకర్తలు నలిగిపోతుండగా, తాజాగా మరో నేత తెరపైకి రావడంతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. నేతల మధ్య ఉన్న విభేదాలే పార్టీ కొంప ముంచుతాయని ఆందోళన చెందుతున్నారు.
దాసరికి తిరిగి టిక్కెట్ ఇస్తే తనకు అభ్యంతరం లేదని, లేనిపక్షంలో పార్టీలో సీనియర్ నేతనైన తనకు టిక్కెట్ ఇస్తే రైతులకు న్యాయం చేసినట్లు అవుతుందని చలసాని ఆంజనేయులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దాసరి పోటీ నుంచి తప్పుకోవాల్సివస్తే ఆయన వంశీ కంటే చలసానికే మద్దతు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల తుపాన్లు వచ్చినప్పుడు చంద్రబాబునాయుడు హనుమాన్‌జంక్షన్, గన్నవరం ప్రాంతాల్లో పర్యటించారు. అప్పుడు చలసాని ఆంజనేయులు పక్కనే ఉండి జిల్లా రైతులకు జరుగుతున్న నష్టాన్ని, రైతుల పక్షాన నిలబడి తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటాలను వివరించినట్లు సమాచారం. దీంతో చలసాని అభ్యర్థితాన్ని కూడా చం ద్రబాబు పరిశీలిస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
తెరవెనుక ఉమా మంత్రాంగం...
ఒకవేళ దాసరి బాలవర్ధనరావు తప్పుకోవాల్సివస్తే గన్నవరం సీటు వంశీకి దక్కకుండా చలసాని ఆంజనేయులును జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమానే తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సీటు కావాలంటూ చలసానితో ఆయనే మెలిక పెట్టించారని తెలిసింది. దేవినేని ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీల మధ్య ఇప్పటికే పొరపొచ్చాలు ఉన్నాయి. ఇద్దరూ మొదటి నుంచి ఎడమొహం పెడమొహంగానే ఉండేవారు.
వంశీ దూకుడును ఉమా ఎప్పుడూ అంగీకరించలేదు. దాసరికి కాని పక్షంలో వంశీ కంటే చలసాని ఆంజనేయులే మంచి అభ్యర్థి అవుతారని ఉమా వర్గం ప్రచారం చేస్తోంది. చలసాని ఆంజనేయులుకు టిక్కెట్ ఇవ్వడం వల్ల జిల్లా రైతాంగం పార్టీకి దగ్గరవుతారని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. చలసానిని రంగంలోకి దింపడం ద్వారా వంశీని ఇబ్బందిపెట్టవచ్చని ఉమా వర్గం భావిస్తోంది. ఒకవేళ చలసానిని కాదని వంశీకి టిక్కెట్ ఇస్తే రైతులు వంశీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు వీలుంటుదంటున్నారు.
సీటు తనదేనంటున్న దాసరి...
దాసరి బాలవర్ధనరావు విజయా డెయిరీ డెరైక్టర్‌గా ఎన్నిక కావడంతో ఆయన త్వరలోనే చైర్మన్ అవుతారని, అప్పుడు గన్నవరం సీటు ఖాళీ అయితే అది వంశీమోహన్‌కే దక్కుతుందని గన్నవరంలో ప్రచారం జరుగుతోంది. దీన్ని దాసరి బాలవర్ధనరావు తీవ్రంగా ఖండిస్తున్నారు. చంద్రబాబు సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తున్నారని, అందువల్ల ఈసారి తనకే సీటు వస్తుందని ఆయన బలంగా చెబుతున్నారు. కేవలం రైతుల మీద ఉన్న అభిమానంతోనే విజయా డెయిరీ డెరైక్టర్ పదవి తీసుకున్నాను తప్ప ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకోనని చెబుతున్నారు. చంద్రబాబు వద్ద తనకు క్లీన్ చిట్ ఉండటంతో తన అభ్యర్థిత్వానికి డోకా ఉండదని అంటున్నారు.
దూకుడు పెంచుతున్న వంశీ మోహన్...
గన్నవరం సీటు ఇక తనదేనన్న ధీమాలో వల్లభనేని వంశీ ఉన్నారు. చంద్రబాబు తనను పిలిచి పనిచేసుకోమని చెప్పారని, త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని సమస్యలు సమసిపోతాయని చెబుతున్నారు. దీనికి తోడు తనకు సీటు ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ తన అభిమానుల చేత పత్రికా ప్రకటనలు ఇప్పిస్తున్నారు.
ఇక యువతను పోగు చేసి నియోజకవర్గంలో హడావుడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో భారీస్థాయిలో ప్రచారానికి సిద్ధమౌతున్నారు. వంశీ దూకుడుకు బ్రేక్ వేయడానికి చలసానిని తెరపైకి తెచ్చి రాష్ట్రస్థాయిలో సీనియర్ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
నన్ను కాదని ఎవరికీ ఇవ్వరు : దాసరి
గన్నవరం : సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని గన్నవరం అసెంబ్లీ టీడీపీ టిక్కెట్ ఎవరికీ ఇవ్వరని శాసనసభ్యుడు డాక్టర్ వెంకట బాలవర్ధనరావు స్పష్టం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించే విషయమై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటనా చేయలేదన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన తొందరపడి ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోరని చెప్పారు.
ముఖ్యంగా గన్నవరం సీటు విషయమై బాబు ఎవరికీ హామీ ఇవ్వలేదన్నారు. టిక్కెట్ తనకే కేటాయించారంటూ వంశీ చేస్తున్న దుష్ర్పచారం కారణంగా నియోజకవర్గంలో పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని తెలిపారు. 1994 నుంచి పార్టీ టిక్కెట్ విషయమై నియోజకవర్గ ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసినా 2014 ఎన్నికల బరిలో టీడీపీ నుంచి తిరిగి పోటీ చేసి తీరుతానని దాసరి ధీమా వ్యక్తం చేశారు.
గతంలో చంద్రబాబు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టిక్కెట్లు కేటాయిస్తానని ప్రకటించారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో విస్తరించి ఉన్న కృష్ణామిల్క్ యూనియన్ సేవలను పార్టీకి ఉపయోగించాలనే యూనియన్ డెరైక్టర్‌గా పోటీచేశాను కానీ, ఆ డెయిరీకి చైర్మన్ కావాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఈ రాద్ధాంతంపై పార్టీ అధినేతకు ఎటువంటి ఫిర్యాదూ చేయబోనని, ఆయనకు ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తుందని చెప్పారు. చివరకు అధినేత ఆదేశాల మేరకు నడుచుకుంటానని పేర్కొన్నారు.
బాబు వాగ్దానం చేశారు : వంశీ
గన్నవరం : గతంలో కుదిరిన ఒప్పందం మేరకు గన్నవరం అసెంబ్లీ టిక్కెట్ తనకే ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాగ్దానం చేశారని ఆ పార్టీ విజయవాడ అర్బన్ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర నాయకుడు డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ తెలిపారు. స్థానిక వల్లభనేని అరుణ ట్రస్టులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2009 ఎన్నికలలో గన్నవరం అసెంబ్లీ టిక్కెట్ కోసం దాసరి, తాను పోటీపడగా స్వయంగా బాబు ఇద్దరి మధ్య రాజీ చేశారని, దాసరి ఇవే చివరి ఎన్నికలు అనడంతో ఆయనకు గన్నవరం టిక్కెట్, తనకు విజయవాడ పార్లమెంట్ టిక్కెట్ కేటాయించారని తెలిపారు. ఎన్నికల తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటామని దాసరి సోదరులు ప్రకటించారని గుర్తుచేశారు. అందుకే పార్టీ ఎమ్మెల్యేగా దాసరి ఉండడంతో నాలుగేళ్లుగా నియోజకవర్గ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యానని చెప్పారు.
పంచాయతీ ఎన్నికల ముందు మళ్లీ ఒప్పందం...
పంచాయతీ ఎన్నికల ముందు తిరిగి బాబు సమక్షంలో దాసరి విజయ డెయిరీ చైర్మన్‌గా, తనను గన్నవరం శాసనసభ్యునిగా పోటీ చేసే విధంగా ఒప్పందం జరిగిందన్నారు. ఈ విషయమై విజయవాడలో జరిగిన చర్చలో దివంగత ఎర్రంనాయుడు, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, కాగిత వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారని తెలిపారు. దీనిలో భాగంగానే సర్పంచ్‌ల ఎన్నికలలో అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేసినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. కొంతమంది గిట్టనివాళ్లు తాను పార్టీ మారుతున్నట్లు చేస్తున్న ప్రచారం నేపథ్యంలో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని బయటపెట్టానని, ఏదేమైనా బాబుపై పూర్తి నమ్మకముందని చెప్పారు. 2014 ఎన్నికలలో నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానని తెలిపారు.