రెచ్చగొట్టి మరీ రచ్చ రచ్చ | TDP Leaders Over Action At Gannavaram Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రెచ్చగొట్టి మరీ రచ్చ రచ్చ

Published Wed, Feb 22 2023 3:44 AM | Last Updated on Wed, Feb 22 2023 3:44 AM

TDP Leaders Over Action At Gannavaram Andhra Pradesh - Sakshi

మంగళవారం నాగాయలంక స్టేషన్‌ ముందు పోలీసులతో టీడీపీ నేతలు, కార్యకర్తల వాగ్వాదం

‘‘వాడో పిల్ల సైకో. నేనే గన్నవరం వెళతా!. ఎవడేం పీకుతాడో చూస్తా. ఆ వంశీ సంగతి తేలుస్తా. నియోజకవర్గంలోంచి బయటకు విసిరేస్తా’’ అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ముందు రెచ్చగొట్టింది... టీడీపీ నాయకుడు పట్టాభి. ‘‘దొంతు చిన్నా ఇంటికి వచ్చి వంశీ మనుషులు బెదిరించారని మీరంతా కేసు పెట్టండి. నేనూ వస్తా. వంశీ సంగతి తేలుస్తా’’ అని గన్నవరం టీడీపీ నేతలతో చెప్పింది... పట్టాభి. 

అన్నట్టుగానే వెళ్లాడు. తనతో పాటు కొంతమందిని అక్కడికి తీసుకువెళ్లటంతో పాటు స్థానిక తెలుగుదేశం నాయకులను కూడా వెంటేసుకుని... దండయాత్రకు బయలుదేరాడు. అక్కడ అలజడి సృష్టించబోయాడు. వంశీ అనుచరులు, అభిమానులు దీన్ని అడ్డుకోబోయారు. అప్పుడే ఇరువర్గాలకూ ఘర్షణ జరిగింది. తెలుగుదేశం నేతలు ముందే ఘర్షణకు సిద్ధమై మారణాయుధాల్లాంటి పరికరాలు తీసుకెళ్లటం వల్లే... స్థానిక సీఐ కనకారావు నుదుటిపై తీవ్ర గాయమైందనేది ప్రత్యక్ష సాక్షుల మాట.  

కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటో తెలుసా? బాధితులను పరామర్శించటానికంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బయలుదేరారు. ఆయన అనుకూల మీడియా రభస మొదలెట్టింది. మొత్తానికి అందరూ కలిసి... అసలిక్కడ ప్రజాస్వామ్యమే లేదంటూ ఆక్రందనలు మొదలుపెట్టారు. అదీ కథ.  

(సాక్షి ప్రతినిధి, విజయవాడ): అసలిక్కడ బాధితులెవరు? చంద్రబాబు నాయుడు ఓదార్చాల్సింది ఎవరిని? ఓదార్చటం కన్నా ముందు తెలుగుదేశం నేతల్ని మందలించాలి కదా? ఇలాంటి సవాళ్లు, బెదిరింపులు రాజకీయాల్లో సరికాదని చెప్పాలి కదా? గన్నవరం నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా నియమించిన బచ్చుల అర్జునుడు దురదృష్టవశాత్తూ ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రిలో చేరితే... ఆ స్థానాన్ని ఆక్రమించడానికి ఇంత అత్యుత్సాహం తగదని పట్టాభికి చెప్పాలి కదా? అవేమీ లేకుండా పట్టాభికి తోడుగా మీరంతా ఎందుకు వెళ్లలేదని పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడే క్లాసు తీసుకున్నారంటే ఆయన మానసిక స్థితిని ఎలా అంచనా వేసుకోవాలి? రాజకీయ పునర్వై­భవం కోసం ఏ స్థాయికైనా దిగజారుతున్నారనేగా అర్థం!!. పట్టాభి కూడా అంతే. అవును మరి! ఆవు చేలో మేసినపుడు దూడ గట్టున మేస్తుందా!!? 

విజయవాడే కాదు. కృష్ణా జిల్లాలో అందరికీ ఇటీవల సంకల్పసిద్ధి అనే ఫైనాన్స్‌ కంపెనీ చేసిన మోసం గురించి తెలిసే ఉంటుంది. నిర్వాహకులను పట్టుకోవటంతో పాటు పోలీసులు కేసులూ పెట్టారు. అయితే దాన్ని అదునుగా తీసుకున్న తెలుగుదేశం నేతలు కొన్నాళ్లుగా సంకల్పసిద్ధి నిర్వాహకులతో సంబంధం ఉందంటూ గన్నవరం ఎమ్మెల్యే వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.

తమకు ఆ సంస్థ వివరాలు గానీ, నిర్వాహకుల ఊరూపేరూ గానీ ఏమీ తెలియవని వారిద్దరూ పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. అయినా సరే తెలుగుదేశం నేతలు తమ విమర్శలు కొనసాగిస్తుండటంతో... దీనిపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు వల్లభనేని వంశీ. కాకపోతే దీన్ని కూడా తెలుగుదేశం నేతలు ఎగతాళి చేశారు. అసలు వంశీకి పరువంటూ ఉంటే కదా... కేసులు వెయ్యాల్సింది? అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. వంశీని విమర్శిస్తూ... ఆయన సంగతి తేలుస్తానని టీడీపీ నేత దొంతు చిన్నా ఆవేశంతో ఊగిపోయాడు. ఇదిగో... ఇదే కారణంతో వంశీ అనుచరులు చిన్నా ఇంటికి వెళ్లారు.

ఆ సమయానికి ఆయన లేకపోవటంతో... ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కాదని, నోరు అదుపులో ఉంచుకోమని ఆయనకు చెప్పాలంటూ చిన్నా భార్యతో మాట్లాడి వెళ్లిపోయారు. ఇది తెలుసుకున్న పట్టాభి... దీన్నో అవకాశంగా మార్చుకుని అధినేత దగ్గర మార్కులు కొట్టేయాలనుకున్నారు. విజయవాడ నుంచి మనుషులను తీసుకుని వెళ్లి మరీ అక్కడ వారందరితో కలిసి ర్యాలీగా పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లారు. అయినా పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలంటే బాధితులు వెళితే సరిపోదా? ఇన్ని వందల మంది ర్యాలీగా వెళ్లాలా? అలా వెళ్లారంటే ఏమిటర్థం? వాళ్లు వెళ్లింది దండయాత్రకనేగా?  

క్లుప్తంగా గన్నవరంలో ఘర్షణలకు దారితీసిన ఘటనలు ఇవే. సోమవారం టీడీపీ మూక పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తుండగా ఇరు వర్గాలూ ఎదురుపడటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకుని పరిస్థితిని చల్లబరిచారు. తరవాత టీడీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి ముందే పగలగొట్టిన నాపరాళ్లతో పాటు చేతికందిన కర్రలు, రాడ్లు సిద్ధం చేసుకున్నారు.

అంతలో అటుగా వెళుతున్న వంశీ అనుచరులను చూసి రెచ్చగొట్టేలా అరవటంతో... అక్కడ ఇరువర్గాలూ ఘర్షణకు దిగాయి. వీరిని వారించబోయిన పోలీసులకూ టీడీపీ నేతల చేతిలో గాయాలయ్యాయి. ఎస్పీ జాషువా అప్రమత్తంగా వ్యవహరించి, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పరిస్థితి కుదుట పడింది. అదీ జరిగిన కథ.  

దూషణల్లో నెంబర్‌–1 చంద్రబాబే... 
వాస్తవానికి కొన్నాళ్లుగా ముఖ్యమంత్రితో సహా ఆయన కుటుంబాన్ని తెలుగుదేశం నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వీరందరిలోనూ చంద్రబాబే ముందుంటూ... ఎక్కడకు వెళ్లినా, ఏ సభలోనైనా పదుల సార్లు ‘సైకో’ అంటూ ముఖ్యమంత్రిపై తీవ్ర దూషణకు దిగుతున్నారు. అదే కోవలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాల్సిందిగా తన పార్టీ కార్యకర్తలకు, జీతగాళ్లకు కూడా చెబుతున్నారు. ఏ చిన్నఘటన జరిగినా వారిని ఉసిగొల్పుతూ సోషల్‌ మీడియాలో ట్వీట్లు చేయిస్తున్నారు.

తనకు వంత పాడే మీడియా సహకారంతో అధికార పార్టీనే తిరిగి వేలెత్తి చూపిస్తున్నారు. గడిచిన మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందిస్తున్న సంక్షేమ, అభివద్ధి పాలనలో వేలెత్తి చూపే అంశాల్లేక... ప్రజల్లోకి వెళ్లడానికి మొహం చెల్లక ఇలాంటి రచ్చకు దిగుతున్నారనేది తెలియనిదేమీ కాదు.

ఈ నెలలోనే కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, గన్నవరంలో మూడు ఘటనలు జరిగాయంటే పరిస్థితి చెప్పకనే తెలుస్తుంది. చిన్న విషయాలను పెద్దవి చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ నేతలు ఎంతలా ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది. 

మచిలీపట్నం, గుడివాడలోనూ.. 
మచిలీపట్నంలో ఈ నెల 7న ఇదే విధంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. నిబంధనలు పాటించాలని కోరిన పోలీసులపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర రెచ్చిపోయారు. ప్రభుత్వ భూమిలో వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్నారని, దానిని అడ్డుకొంటామంటూ రవీంద్ర కార్యకర్తలతో కలిసి వచ్చి అమలులో ఉన్న 30 పోలీస్‌ యాక్ట్‌ను ఉల్లంఘించారు.

పోలీసులు ప్రజా రవాణాకు అంతరాయం కలుగుతుందని, ధర్నాకు అనుమతి లేదని, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నచ్చజెప్పారు. దీంతో రవీంద్ర, ఇతర టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. రవీంద్ర పోలీసులను నెట్టుకుంటూ, దుర్భాషలాడుతూ, నడి రోడ్డులో ఎస్సైపై చెయ్యి చేసుకున్నారు. 

ఆ మరునాడే గుడివాడలోనూ టీడీపీ నాయకులు బరితెగించారు. కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ, ఆక్రమణలు తొలగిస్తున్న  మున్సిపల్‌ ఉద్యోగులపై దౌర్జన్యం చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు మునిసిపల్‌ అధికారులకు వేలు చూపిస్తూ బూతులతో రెచ్చిపోయారు. కోర్టు ఆదేశాలను అడ్డుకోవడం నేరమని చెప్పిన పోలీసులు, అధికారులపై జులుం ప్రదర్శించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement