పట్టాభిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలిస్తున్న పోలీసులు
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం సీఐ పి.కనకారావుపై రాళ్లతో దాడి చేసి గాయపరచడంతోపాటు హత్యాయత్నానికి అనుచరులను ప్రేరేపించిన కేసులో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు బుధవారం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసుల సమాచారం మేరకు.. ఈ కేసులో 11 మంది నిందితులను మంగళవారం గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు హాజరుపరిచిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పది మందికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని జడ్జి ఎదుట పట్టాభి ఆరోపించారు. దీంతో ఆయనకు విజయవాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించి తిరిగి కోర్టులో హాజరుపరచాలని జడ్జి శిరీష పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు పట్టాభికి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు బుధవారం కోర్టుకు తీసుకువచ్చారు.
పట్టాభి చేతులకు సాధారణ గాయాలు మినహా శరీరంపై కొత్త గాయాలు ఏమీ లేవని జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్‌ను కోర్టులో ఆయనకు చదివి వినిపించారు. మెడికల్ సర్టిఫికెట్‌పై పట్టాభి కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
అయితే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కాకుండా మిగిలిన నిందితులు ఉన్న గన్నవరం సబ్‌జైలుకు తనను రిమాండ్‌కు పంపించాలని పట్టాభి కోర్టును అభ్యర్థించారు. దీంతో ఆయనకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు.
అనంతరం పోలీసులు పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు. అయితే సబ్ జైలులో పరిమితికి మించి ఖైదీలు ఉండటంతో వీరందరినీ వేరే జైలుకు పంపించాలని జైలర్ యూనస్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వడంతో పట్టాభితోపాటు మరో పది మంది నిందితులను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment