ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ కనకారావును పరామర్శిస్తున్న కృష్ణా జిల్లా పోలీసుల సంక్షేమ సంఘం నాయకులు
గన్నవరం/నాగాయలంక (అవనిగడ్డ)/కోనేరుసెంటర్/పటమట/లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణాజిల్లా గన్నవరంలో విధి నిర్వహణలో ఉన్న సీఐ పి.కనకారావును కులం పేరుతో దూషిస్తూ, రాళ్లతో కొట్టి గాయపరిచిన కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. వీరిలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని ప్రభుత్వాస్పత్రికి, పదిమందిని గన్నవరం సబ్‌జైలుకు తరలించారు. గన్నవరంలో సోమవారం టీడీపీ నేతలు సృష్టించిన ఘర్షణకు సంబంధించి పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు.
వీటిలో మూడు టీడీపీ నేతలు, కార్యకర్తలపై.. ఒకటి ఎమ్మెల్యే అనుచరులపై నమోదైంది. పట్టాభి తనను కులం పేరుతో దూషించడమేగాక ఆయనతోపాటు దొంతు చిన్నా, జాస్తి వెంకటేశ్వరరావు మరో ఎనిమిదిమంది తనను రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చడంతోపాటు చంపేవిధంగా అనుచరులను ప్రేరేపించారని సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభి తదితరులపై అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
విధి నిర్వహణలో ఉన్న తమను నెట్టేసినట్లు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కుండేటి రఘుబాబు, మేకల కోటేశ్వరరావు, కొలుసు వరప్రసాద్ తదితరులపై ఎస్‌ఐ రమేష్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై మరో కేసు నమోదైంది.
టీడీపీ నేతలు పట్టాభి, మూల్పూరి కళ్యాణి, కోనేరు సందీప్, గూడవల్లి నరసయ్య, జాస్తి వెంకటేశ్వరరావు తనను కులం పేరుతో దూషించినట్లు గొన్నూరు సీమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే వంశీమోహన్ అనుచరులు యతేంద్రరామకృష్ణ, మోహన్‌రంగా తదితరులు తమ ఇంటికి వచ్చి బెదిరించినట్లు టీడీపీ నేత దొంతు చిన్నా భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఐపై దాడికేసులో..
సీఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. టీడీపీ నేతలు పట్టాభి, చిన్నా, వీరంకి గురుమూర్తి, లావు వంశీకృష్ణ, జాస్తి ఆదిశేషు, లావు వంశీకృష్ణ, చల్లగుళ్ల సందీప్, గురివిందగుంట దేవేందర్, ముప్పరాజు కార్తీక్, గుజ్జర్లపూడి బాబూరావు, కంచర్ల సూర్యప్రకాష్‌లను అరెస్ట్‌చేసి మంగళవారం స్థానిక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు.
పట్టాభి తనను పోలీసులు కొట్టినట్లు ఆరోపించడంతో ఆయనకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యచికిత్స చేసిన తర్వాత రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరచాలని జడ్జి బి.శిరీష పోలీసులను ఆదేశించారు. మిగిలిన పదిమందికి రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పట్టాభిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి, మిగిలినవారిని గన్నవరం సబ్‌జైలుకు తరలించారు.
పోలీసులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం
గన్నవరం ఘటనకు సంబంధించి మచిలీపట్నం, నాగాయలంకల్లో సోమవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగి, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. గన్నవరం నుంచి తొమ్మిదిమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు మచిలీపట్నంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో గన్నవరం టీడీపీకి చెందిన ఒక న్యాయవాది తొమ్మిదిమంది అనుచరులతో అక్కడికి వెళ్లి భద్రత విధుల్లో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యం చేసి పోలీసులు నిర్భంధించిన తొమ్మిదిమంది నాయకులు, కార్యకర్తలను కారుల్లో తప్పించారు. ఈ సమాచారం అందుకున్న ఎస్పీ జాషువ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు.
పోలీసు అధికారులు, సిబ్బంది జీపీఎస్ ద్వారా తప్పించుకున్న వారిని వెంబడించి నిమిషాల వ్యవధిలో న్యాయవాదితో సహా అందరినీ పట్టుకుని బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ వాణి ఫిర్యాదు మేరకు మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. గన్నవరం ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను సోమవారం అర్ధరాత్రి నాగాయలంక పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆయన అనుచరులు, స్థానిక టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు.
బోడెని చూసేందుకు అనుమతించాలంటూ సీఐ శ్రీనివాస్‌తో వాగ్వాదానికి దిగారు. టీడీపీ మహిళా నేత తలశిల స్వర్ణలత, కొందరు తెలుగు తమ్ముళ్లు సచివాలయ మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా మాట్లాడారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ స్టేషన్‌లో బోడెను పరామర్శించారు. బోడె ప్రసాద్‌ను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.
పోలీసులతో పట్టాభి భార్య వాగ్వాదం
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పట్టాభి ఇంటివద్ద మంగళవారం ఆయన భార్య చందన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించిన ఆమె నిరపరాధి అయిన తన భర్తను విడుదల చేయకపోతే డీజీపీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించటంతో పోలీసులు అభ్యంతరం చెప్పారు. దీనిపై ఆమె పోలీసులతో పరుష పదజాలంతో వాగ్వాదానికి దిగారు.
కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణితో కలిసి పలువురు టీడీపీ నేతలు పట్టాభి ఇంటిపైకెక్కి ఆందోళన చేపట్టారు. పట్టాభి కుటుంబ సభ్యులను మంగళవారం రాత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించారు.
వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం
టీడీపీ నాయకుడు పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలే గన్నవరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాయని ఎస్పీ పి.జాషువ చెప్పారు. ఆయన దాడికి ప్రేరేపించడంతోనే సీఐ కనకారావు గాయపడ్డారని తెలిపారు. మచిలీపట్నంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం కార్యాలయంపై దాడికి సంబంధించి వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు.
సుమోటోగా రైటింగ్, నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ వారి దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ కనకారావును మంగళవారం పోలీసుల సంక్షేమ సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షుడు జయపాల్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మస్తాన్‌ఖాన్ పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment