గన్నవరం టీడీపీ రెండు ముక్కలు !
- బజారుకెక్కిన దాసరి, వంశీ పోరాటం
- టపాసులు పేల్చిన వంశీ వర్గీయులు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు ముక్కలైంది. పార్టీ టికెట్టు ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్థనరావు, డాక్టర్ వంశీమోహన్ మధ్య ఎంతో కాలంగా కొనసాగుతున్న అంతర్గత గొడవలు బజారు కెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికలే వేదికగా బలాబలాలు తేల్చుకునేందుకు వారిద్దరూ సమాయత్తమైనట్లు సమాచారం.
టీడీపీలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు పావులు కదుపుతున్నారు. తమ నాయకునికి టీడీపీ అధినేత గన్నవరం సీటు ఇస్తానని హామీ ఇచ్చారని ఆదివారం గ న్నవరంలో వంశీ వర్గీయులు టఫాసులు కాల్చి హంగామా చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న దాసరి వెంకట బాలవర్దనరావు, ఆయన వర్గీయులు కలవరం చెందారు. అదంతా పచ్చి అబద్దమని పార్టీ నాయకులు కార్యకర్తలకు దాసరి స్వయంగా ఫోన్ చేసి చెప్పుకున్నారు.
ఈ నేపథ్యంలో దాసరి, వంశీ వర్గాలు పోటాపోటీగా స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా వంశీని పనిచేసుకోమన్నారని ఆయన వర్గీయులు గ్రామాల్లో నాయకులకు ఫోన్‌లు చేసి ప్రచారం చేశారు. ఈ హడావిడితో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రతి ఎన్నికల మాదిరిగా ఈ సారీ గన్నవరం టీడీపీ టికెట్టు విషయం వివాదాస్పదం కాక తప్పదని భావిస్తున్నారు. మండల స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంకట స్థితి నెదుర్కొంటున్నారు.
ఈ ప్రభావంతో కొద్ది రోజుల్లో జరుగనున్న ఎంపీటీసీ,జెడ్‌పీటీసీ ఎన్నికల్లో ఏ వర్గంలో చేరాలో తెలియక పార్టీ నాయకులు అయోమయం చెందుతున్నారు. గత ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలలోనూ టీడీపీలో వంశీ, దాసరి వర్గాలు ప్రత్యక్ష పోరాటానికి దిగాయి. పలు గ్రామాల్లో టీడీపీ రెబల్స్ అభ్యర్థులు రంగంలో దిగారు. మళ్లీ అదే పరిస్థితి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే పునారావృతం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో వంశీ వర్గీయుల ప్రచారం ....
సోషనల్ మీడియాలోనూ వంశీమోహన్‌కు గన్నవరం టికెట్ కేటాయించినట్లు ఆయన అభిమానులు ప్రచారం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లలో, నెట్‌లో వంశీ అభిమానులు హల్ చల్ చేస్తున్నారు. వంశీకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు హంగామా సృష్టిస్తున్నారు.
టికెట్ నాదే : వంశీ
గన్నవరం, న్యూస్‌లైన్ : గతంలో కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందం మేరకు గన్నవరం నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ టికెట్‌ను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తనకే కేటాయించారని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వల్లభనేని వంశీమోహన్ పునరుద్ఘాటించారు. శ్రీనగర్‌కాలనీలోని వల్లభనేని అరుణ ట్రస్టు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ర్ట పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు మేరకు జిల్లా పార్టీ పరిశీలకులు సుజానాచౌదరి, బందరు ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు సమక్షంలో బాబు తనతో, దాసరితో విడివిడిగా సమావేశమయ్యారని తెలిపారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందంతో పాటు దాసరి గత ఎన్నికల్లో ఇదే చివరిసారని చెప్పడంతో ప్రస్తుత ఎన్నికల్లో సీటు తనకే కేటాయిస్తున్నట్లు బాబు హామీ ఇచ్చారని చెప్పారు.
అది తప్పుడు ప్రచారం : దాసరి
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్టు తనకు కేటాయించారని, తానే అభ్యర్థినని గ్రామాల్లో వంశీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్థనరావు చెప్పారు. ఆదివారం ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ వంశీమోహన్, ఆయన వర్గీయులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. తాను చంద్రబాబును కలిసి ఇక్కడ జరుగుతున్న విషయాలను వివరించినట్లు తెలిపారు. కేవలం ప్రజలను, పార్టీ నాయకులను అయోమయం చేయటానికే వంశీ ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారని దాసరి విమర్శించారు. శనివారం సాయత్రం తాను, వంశీ చంద్రబాబును కలిసినట్లు, ఆయన పార్టీ టికెట్టు వంశీకి కేటాయించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. శనివారం ఉదయం తాను చంద్రబాబును కలిసి వంశీ చేస్తున్న అసత్య ప్రచారం గురించి ఫిర్యాదు చేశానని, ఆయన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మాట్లాడదామని చెప్పారని దాసరి వివరించారు. గతంలో గద్దే రామ్మోహనరావు, 2009 ఎన్నికల్లో వల్లభనేని వంశీమోహన్ ఎన్నికల ముందు ఇదే తరహాలో తమకు పార్టీ టికెట్ వచ్చేసిందని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసుకున్నారని తెలిపారు. గన్నవరం అసెంబ్లీ టికెట్ విషయమై చంద్రబాబు ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వలేదని, వంశీ చెబుతున్నట్లుగా ఒప్పందాలు ఏమీ లేవని దాసరి చెప్పారు. గతంలో చంద్ర బాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తానని చెప్పిన మాటను దాసరి గుర్తు చేశారు. గన్నవరం నుంచి పోటీ చేస్తానని ఆయన తెలిపారు.